MLC Surabhi Vanidevi | మేడ్చల్, మార్చి 8 : మహిళలు ఆకాశమే హద్దుగా ముందుకు సాగాలని ఎమ్మెల్సీ సురభి వాణిదేవి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి మైసమ్మగూడలోని మల్లారెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల, మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డితో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళల భాగస్వామ్యంతోనే ఏ రంగమైనా అద్బుతంగా మారుతుందని నమ్మేవారిలో తాను ఒకరినన్నారు. మహిళలు ప్రతీ రంగాన్ని సద్వినియోగం చేసుకొని అవకాశాలను మనమే అందిపుచ్చుకుని అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ఇప్పటికే ప్రతీ రంగంలో మహిళలు ప్రతీ రంగంలో రాణిస్తున్నారని, హైదరాబాద్లో మెట్రో నడిపే మహిళను తాను ఎలా నడుపగలుగుతుందో చూడాలనిపించిందన్నారు. మహిళలు ఆకాశమే హద్దుగా ముందుకు సాగాలన్నారు.
తనను తండ్రి పీవీ నర్సింహ్మరావు ఆడపిల్ల కాకుండా కుమారులతో సమానంతో చూసాడని అందుకే తాను విద్యారంగంలో, ప్రస్తుతం రాజకీయ రంగంలో రాణించగలిగానన్నారు. గతంలో ఆడపిల్లలు అంటే వంటింటికి పరిమితం అనే వారని ప్రస్తుతం ఆడపిల్లలు అన్ని రంగాల్లో ఉండడం సంతోషకరంగా ఉందన్నారు. అట్టడుగు వర్గాల్లో ఉన్న మహిళలు సైతం తాము ఎందులోనైనా తక్కువ కాదు అనే దృక్పథానికి వచ్చారని తెలిపారు.
ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచాన్ని లీడ్ చేసే వారు మహిళలే అన్నారు. ఆర్థికంగా ముందువరుసలో ఉన్న దేశాల్లో మహిళలు అన్ని రంగాల్లో పనిచేయడమే కారణమన్నారు. తాను మహిళల కోసం ప్రత్యేక కళాశాలలు ఏర్పాటు చేయడం వల్లే విజయవంతం అయ్యాయని, అందుకు తన భార్యకూడా తోడుగా నిలిచిందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ, పలు రంగాల్లోని మహిళలను సత్కరించారు.
కార్యక్రమంలో మల్లారెడ్డి యూనివర్సిటీ ఛాన్స్లర్ కల్పన, వైస్ చైర్మెన్ ప్రీతిరెడ్డి, మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ మాధవిలత, యూనివర్సిటీ వీసీ వీఎస్కే రెడ్డి, మహిళా అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.