హైదరాబాద్, మార్చి 21(నమస్తేతెలంగాణ) : బడ్జెట్లో కేటాయింపులకు, ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు పొంతన కుదరడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి అన్నారు. మండలిలో బడ్జెట్‌పై చర్చలో ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లకు బడ్జెట్లో కేటాయింపులు లేవని పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణాలకు బడ్జెట్లో కేటాయించిన నిధులు సరిపోవని, మనఊరు-మనబడి పాఠశాలల నిర్మాణాల బకాయిలు చెల్లించాలని కోరారు. తెలంగాణ కళాకారుల వేతనాల పెంపు ప్రస్తావన లేదని పేర్కొన్నారు. దళిత బంధు ప్రస్తావన లేదని, వైద్య ఆరోగ్యానికి కేటాయింపులు తగ్గాయని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గాలికి కాంగ్రెస్ 1994లో మాదిరిగా కొట్టుకుపోవడం ఖాయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల తీరు ఆహ నా పెళ్ళంట సినిమాలో కోటా శ్రీనివాస్ సీనుకు మించిపోయాయని ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి తెలిపారు.
ప్రత్యేక అవసరాలు ఉన్న వర్గాలకు ఎలాంటి బడ్జెట్ కేటాయించలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణీదేవి అన్నారు. ఆటిజం(బుద్ధిమాంద్యం) 22 ఏండ్ల క్రితం వెయ్యి మందిలో ఒక్కరికి ఉండే లక్షణాలు.. ఇప్పుడు 64కి పెరిగిందని వాపోయారు. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే ప్రమాదమున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. టెక్నికల్ విద్యా విధానంలో తొందరపాటు వద్దని అన్నారు. సమాజ శ్రేయస్సు గురించి ఆలోచించే బ్రాహ్మణ వర్గానికి బీఆర్ఎస్ పాలనలో బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటుచేసి, అన్ని విధాలా సహకారం అందించారని గుర్తుచేశారు.
కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మహమూద్ అలీ అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని తెలిపారు. బడ్జెట్లో మైనార్టీలకు కేటాయింపులు సరిపోవని పేర్కొన్నారు. షాదీముబారక్ అమలులో లేదని, మైనార్టీ విద్యార్థులకు స్కాలర్షిప్లు లేవని తెలిపారు. కేసీఆర్ పాలనలో మైనార్టీలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం ఇచ్చామని గుర్తుచేశారు.
బడ్జెట్లో గిరిజనులకు అన్యాయం జరిగిందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ వాపోయారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో గిరిజన తండాలు, గూడెంలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. విద్యా, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో గిరిజన మంత్రి లేరని, గిరిజన గురుకులాలలో మౌలిక సదుపాయాలు కల్పించలేదని ఆరోపించారు.