MLC Madusudhana Chary | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలవబోతుంది అనే కొంతమంది వ్యక్తులు, కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న కుట్రలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో మధుసూదనాచారి మీడియాతో మాట్లాడారు.
ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ వ్యతిరేకంగా టీడీపీ ఆవిర్భావం జరిగింది. ప్రతికూల పరిస్థితుల్లో కేసీఆర్ టీఆర్ఎస్ను స్థాపించారు. తెలంగాణ అంటే నక్సలైట్లు అన్న సందర్భంలో కేసీఆర్ పార్టీని పెట్టారు. కాంగ్రెస్, టీడీపీలకు ధీటుగా టీఆర్ఎస్ ఆవిర్భావం జరిగింది. ఇద్దరు బలమైన నాయకులు చంద్రబాబు, వైఎస్ఆర్ను కేసీఆర్ ఎదుర్కొన్నారు. తెలంగాణ సాధించి కేసీఆర్ సీఎం అయ్యి అభివృద్ధి చేశారు. బీఆర్ఎస్ పార్టీని బలహీనపర్చాలని కుట్ర పూరితంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెలంగాణ ప్రయోజనాలను కాపాడవని ఆయన స్పష్టం చేశారు.
కేసీఆర్ సీఎంగా లేనందుకు ప్రజలు బాధపడుతున్నారు. కేసీఆర్ పాలన చర్చకు వస్తే కాంగ్రెస్, బీజేపీల రాజకీయ పునాదులు కదులుతాయి. పరిపాలనలో కాంగ్రెస్, బీజేపీ ప్రజల మెప్పు పొందాలి. కేంద్రమంత్రుల భాష, వారి పాలన ప్రజలు అసహ్యించుకునే విధంగా ఉంది. కేసీఆర్ నాయకత్వం పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారు. జూన్ 2వ తేదీన తెలంగాణ భవన్లో ఆవిర్భావ వేడుకలు జరుగుతాయి. కేసీఆర్ ఆలోచనలు నాకు తెలుసు. తెలంగాణ ప్రయోజనాలకు ఎట్టి పరిస్థితుల్లో భంగం కలగదు. తెలంగాణ ప్రజలు ఉన్నంతవరకు బీఆర్ఎస్ ఉంటుంది. పార్టీలో ఏ నిర్ణయం అయినా కేసీఆర్ తీసుకుంటారు. జూన్ 2వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారు అని మధుసూదనాచారి తెలిపారు.