నిజామాబాద్ : ఆకాశంలో చుక్కలెన్ని ఉన్న చంద్రుడు ఒక్కడే.. తెలంగాణలోనూ కేసీఆర్ ఒక్కడే అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. రైతులకు అత్యంత ఉపయుక్తంగా ఉన్న వ్యవసాయ కల్లాల నిర్మాణానికి ఖర్చయిన రూ.151 కోట్లను తిరిగి చెల్లించాలని కేంద్రం రాష్ట్రానికి నోటీసు జారీ చేయడం సరికాదన్నారు. ఆ డబ్బులను తిరిగి చెల్లించాలని కేంద్రం ఆదేశించడం అత్యంత దారుణం, హేయం, బాధాకరం అని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ మరోసారి రైతు వ్యతిరేక ప్రభుత్వం అని నిరూపించుకుందన్నారు.
రేపు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి జిల్లా కేంద్రంలో రైతు మహాధర్నా జరగబోతున్నదని తెలిపారు. రైతులందరూ ఈ ధర్నాలో పాల్గొని బీజేపీ విధానాలను ఎండగట్టాల్సిన అవసరం ఉందన్నారు. మన హక్కులు సాధించుకోవాలంటే ధర్నా పెద్ద ఎత్తున జరగాలి. చుక్కలు ఎన్ని ఉన్న చందమామ ఒక్కడే అన్నట్టు, ఎన్ని పార్టీలు వచ్చినా, ఏమోచ్చినా తెలంగాణ ప్రజల గుండెల్లో ఉండేటటువంటి వ్యక్తి కేసీఆరే మాత్రమే అని పేర్కొన్నారు. చంద్రబాబు లాంటి వ్యక్తిని ప్రజలు నమ్మరు. చంద్రబాబును ఇప్పటికే తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. భవిష్యత్‌లోనూ అదే జరగబోతుందన్నారు. ఆ పార్టీలు ప్రజలను శ్రేయస్సు కోరే పార్టీలు కావు. తెలంగాణ ప్రజలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు అని కవిత స్పష్టం చేశారు.