MLC Kavitha | హైదరాబాద్(నమస్తే తెలంగాణ): మోసపూరిత హామీలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. కర్ణాటకలో 5 గంటలు మాత్రమే విద్యుత్తు సరఫరా చేస్తున్నామని మంత్రి చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం కల్వకుంట్ల కవిత ఎక్స్‌లో స్పందించారు. 65 ఏండ్ల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ రైతుల ఉసురు తీసుకున్నదని, ఇప్పుడు మరోసారి మభ్యపెట్టడానికి బయలుదేరిందని విమర్శించారు. ‘కర్ణాటకలో 5 గంటల కరెంట్ ఇస్తున్నారు.
తెలంగాణలో 3 గంటల కరెంటు చాలని పీసీసీ అధ్యక్షుడు అన్నారు. దీన్ని బట్టి కాంగ్రెస్‌కు ఓటేస్తే తెలంగాణలో 3 గంటల కరెంటే వస్తుందని చెప్పడంలో సందేహమే లేదు’ అని పేరొన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్తు అందిస్తూ అండగా నిలుస్తున్నారని తెలిపారు. రైతులపై ప్రేమ, చిత్తశుద్ధి ఉన్న నేత సీఎం కేసీఆర్ అని, అన్నదాతల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు.