MLC Kavitha | సూర్యాపేట : మేడిగడ్డను వాడుకోక తెలంగాణను ఎండబెడుతున్నారని రేవంత్ రెడ్డి సర్కార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. సాగుకు నీళ్లివ్వక రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి.. కాంగ్రెస్ పార్టీకి రైతుల ఉసురు తప్పక తగులుతుంది అని కవిత పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లాలో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు.
తక్షణమే మేడిగడ్డ ప్రాజెక్టును వినియోగంలో తేవాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి జల విధానం లేదా..? అని ప్రశ్నించారు. తెలంగాణ నీళ్లు మలపాలన్న సోయి లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరోపక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 199 టీఎంసీలతో బనకచర్లలో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. కానీ మన ముఖ్యమంత్రి మాత్రం నాగార్జున సాగర్‌ను కూడా మన ఆధీనంలోకి తీసుకురాలేకపోయారు అని కవిత పేర్కొన్నారు.
కాళేశ్వరం ద్వారా సూర్యాపేట జిల్లాలో గోదావరి జలాలను కేసీఆర్ పారించారని కవిత గుర్తు చేశారు. కృష్ణా పరివాహక ప్రాంతంలోనూ గోదావరి నుంచి నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది. కేసీఆర్ హయాంలో కోదాడ నియోజకవర్గానికి కాళేశ్వరం ద్వారా లక్షా 22 వేల ఎకరాలకు నీళ్లు అందించారు. ఇప్పుడు నీళ్లు ఎందుకు తేవడం లేదని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సవాలు చేస్తున్నాను. ఇప్పుడు నీళ్లు ఎందుకు తేవడం లేదు..? మేడిగడ్డ పాడయిందా..? రాజకీయ కక్షతోనే మేడిగడ్డ ప్రాజెక్టును వినియోగించడం లేదని ఇంజనీర్లు చెబుతున్నారు. మరో 40 రోజుల పాటు నీళ్లు ఇస్తేనే పంటలు చేతికొచ్చే అవకాశం ఉంటుంది. పోయిన ఏడు నీళ్లు ఇవ్వక సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో 4 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది. ఈ మొత్తం వ్యవహారానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యత వహించాలి అని కవిత డిమాండ్ చేశారు.
సూర్యాపేట జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయంటే ఆ పాపం, ఉసురు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తగులుతుంది. జిల్లా మంత్రియే కాకుండా సాగునీటి శాఖ మంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వని మంత్రి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. రోజంతా కేసీఆర్‌ను తిట్టుకుంటూ తిరిగితే కాంగ్రెస్ నాయకులకు ఒరిగేదేమీ లేదు. కేసీఆర్ ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల ప్రేమతో పరిపాలించారని కవిత తెలిపారు.
ఇవి కూడా చదవండి..
TG Highcourt | తెలంగాణ హైకోర్టులో కేసు వాదిస్తుండగా న్యాయవాదికి గుండెపోటు
KTR | రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ తప్ప.. స్టేట్ ఫికర్ లేదు : కేటీఆర్
KTR | రేవంత్ రెడ్డి నిజాయితీ గల్ల మోసగాడు.. కేటీఆర్ సెటైర్లు