KTR | ఆమన్‌గల్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిజాయితీగల్ల మోసగాడు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. ఆమన్‌గల్‌లో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన రైతు దీక్షలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాతకు కులం, మతం ఉండదు. అన్ని వర్గాల్లో రైతులు ఉంటరు. 70 లక్షల మంది రైతులను కేసీఆర్ కడుపులో పెట్టుకుని చూసుకున్నడు. ఎన్నికల్లో ఓట్ల కోసం మాట ఇవ్వకపోయినా.. 12 సీజన్లలో రూ. 73 వేల కోట్ల రైతుబంధు వేశాడు. రైతు చనిపోతే ఆ కుటుంబం ఆగం కావొద్దని చెప్పి.. తొలిసారి స్వతంత్ర భారతదేశ చరిత్రలో రూ. 5 లక్షల బీమా ప్రవేశపెట్టిన నాయకుడు కేసీఆర్. ఆడబిడ్డ లగ్గానికి లక్ష రూపాయాలు కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ కింద కానుకగా అందించారు. 200 ఉన్న పెన్షన్‌ను 2 వేలు చేసిండు. ఇవన్నీ చూసి జీర్ణించుకోలేక.. నంగనాచి, దొంగ, మోసపు మాటలు చెప్పి అధికారంలోకి రావాలని అరచేతిలో స్వర్గం చూపించి గెలిచారు అని కేటీఆర్ అన్నారు.
రేవంత్ రెడ్డి నిజాయితీగల్ల మోసగాడు.. ప్రజలు మోస పోవాలని కోరుకుంటారు.. మోసగాళ్లను నమ్ముతరు.. అందుకే మోసం చేస్తున్నానని అన్నడు. ఇక తెలుగు భాషలో ఇన్ని తిట్లు ఉంటాయను కోలేదు. కొందరు తిట్లను చూస్తే రోషం ఉన్నోడు అయితే పాడుబాడ్డ బావిలో దుంకి చనిపోతేడు. సిగ్గు లజ్జ లేని బతుకు కాబట్టి బతుకుతుండు రేవంత్ రెడ్డి. ఇన్ని తిట్లు తిన్న సీఎంను ఇప్పటి వరకు చూడలేదు అని కేటీఆర్ పేర్కొన్నారు.
కులణగన పేరిట బీసీలను మోసం చేసిండు. 420 రోజుల్లో 430 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మన పిల్లలు విదేశాలకు పోయి ఉన్నత చదువులు చదువుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణలో 1022 గుకులాలు స్థాపించి, ఒక్కో విద్యార్థి మీద లక్షా 20 వేలు ఖర్చు పెట్టారు. గురుకుల విద్యార్థులంతా ఐఐటీ, నీట్, ఐఐఎంలో పాసై పెద్ద చదువులు చదివారు. ఈ సన్నాసికి గురుకులాలను నడపడానికి వస్తలేదు. గురుకులాల్లో 56 మంది పిల్లలు చనిపోయారు. దీన్ని బట్టి కాంగ్రెస్ పాలన ఎంత నికృష్టంగా ఉందో తెలుస్తుంది అని కేటీఆర్ మండిపడ్డారు.