హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ ): ఇటీవల విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో 13 వేల మంది అభ్యర్థులను ఇన్వాలిడ్గా ఎందుకు ప్రకటించారని, గ్రూప్-1 పరీక్షలు, ఫలితాలపై అభ్యర్థులు లేవనెత్తుతున్న పలు అనుమానాలను రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నివృత్తి చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. గ్రూప్-2లో ఆ 13 వేల మంది అభ్యర్థుల ఫలితాలను ఎందుకు వెల్లడించలేదో తేల్చాలని డిమాండ్ చేశారు. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలల్లో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో రాష్ట్రంలోని 11 యూనివర్సిటీలకు చెందిన విద్యార్థి ప్రతినిధులు ఆదివారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కలిశారు. గ్రూప్స్ పరీక్షలు, ఫలితాలకు సంబంధించిన వివిధ అంశాలపై ఆమెతో చర్చించారు.
ఫలితాలపై ఉన్న పలు అనుమానాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని, శాసనమండలిలో ఈ అంశాలను లేవనెత్తాలని వారు ఆమెకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. ట్రాన్స్లేషన్ సమస్య వల్ల ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు సరిగా మూల్యాంకనం చేయలేకపోయారని, దాని ఫలితంగా మారుల్లో వ్యత్యాసాలు ఏర్పడ్డాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. గ్రూప్-1 పరీక్షల్లో ప్రిలిమ్స్‌కి ఒక హాల్‌టికెట్, మెయిన్స్‌కి మరో హాల్‌టికెట్ నంబరు కేటాయించడం వల్ల విద్యార్థులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారని తెలిపారు. పేపర్ల మూల్యాంకనంలో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని విద్యార్థులు తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు.కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ సత్య, గౌతమ్, విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు డాక్టర్ ఎల్చాల దత్తాత్రేయ, బొడ్డుపల్లి లింగం, అశోక్‌యాదవ్, మంథని మధు, కేయూ నుంచి శరత్ గౌడ్, గ్రూప్-1 అభ్యర్థులు సింధు, అనూష, సత్యవతి, రవీందర్ రాథోడ్, క్రాంతికిరణ్ పాల్గొన్నారు.
ఖలీల్‌వాడి, మార్చి 16 : తెలంగాణ హిస్టరీ, ఫ్యూచర్ కేసీఆర్ అని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొనియాడారు. సీఎం రేవంత్‌రెడ్డి తన కలలో కూడా కేసీఆర్‌నే కలవరిస్తున్నట్టున్నాడని, ఉదయం నుంచి రాత్రి వరకు కేసీఆర్ జపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందుకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఇప్తార్ విందులో పాల్గొని మాట్లాడారు. గౌరవం అనే విషయం మన ప్రవర్తనతోనే ఉంటుందని తెలిపారు. కేసీఆర్ మాట్లాడితే జనం టీవీల ముందు క్యూకడతారని, రేవంత్‌రెడ్డి మాట్లాడితే టీవీలు మ్యూట్ చేస్తున్నారని చెప్పారు. కేసీఆర్‌తో రేవంత్‌రెడ్డి ఎక్కడా సరితూగలేడని, భవిష్యత్తు మళ్లీ కేసీఆర్‌దేనని స్పష్టంచేశారు.
రోజురోజుకూ కేసీఆర్‌కు ప్రజల్లో మరింత ఆదరణ పెరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమాన్ని మరిచిపోయిందని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి సబ్బండ వర్గాలను పట్టించుకోకుండా నోటికి ఏదివస్తే అది మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రంజాన్ పండుగ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు తోఫాలు ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెప్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో రంజాన్ సందర్భంగా మసీదులకు రూ.లక్ష చొప్పున ఇచ్చారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. బీఆర్ఎస్ అంటేనే మత సామరస్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, అర్బన్, రూరల్ మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, బీఆర్ఎస్ బోధన్ ఇన్చార్జి ఆయేషా ఫాతిమా, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, జడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, మాజీ మేయర్ నీతూ కిరణ్ పాల్గొన్నారు.