హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): రాజకీయ కక్షసాధింపులో భాగంగానే తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ నుంచి నోటీసులు ఇప్పించిందని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. కేసీఆర్‌కు తాము రక్షణ కవచంలా ఉంటామని, ఆయనపై ఈగ వాలినా సహించేది లేదని హెచ్చరించారు. కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద బుధవారం మహాధర్నా నిర్వహించారు.
ఈ ధర్నానుద్దేశించి కవిత మాట్లాడారు. ఏ తప్పు చేశారని కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారు? తెలంగాణ భూములకు నీళ్లిచ్చినందుకా? తెలంగాణను అభివృద్ధిలో దేశంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దినందుకా? అని ప్రశ్నించారు. అసలు కేసీఆర్‌ను బద్నాం చేయడం కోసమే కాళేశ్వరం కమిషన్ వేశారని దుయ్యబట్టారు. 99శాతం మేర పూర్తయిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే తెలంగాణలోని 35 శాతం భూభాగానికి సాగు, తాగునీటి సదుపాయం అందుతుందని వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా 44 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. హైదరాబాద్‌కు శాశ్వతంగా 40 టీఎంసీల తాగునీరు, పరిశ్రమలకు 16 టీఎంసీల నీరు అందుతుందని చెప్పారు. 90 మీటర్ల అడుగున ఉండే నీళ్లను ఒడిసి పట్టి 630 మీటర్లకు ఎత్తిపోసే ప్రాజెక్టు అని వివరించారు. కేసీఆర్ గుండె గట్టిది కాబట్టే.. ఇలాంటి అతిపెద్ద ప్రాజెక్టును నిర్మించారని కొనియాడారు. మేడిగడ్డకు చిన్న మరమ్మతులు చేయకుండా.. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలోని పొలాలను ఎండబెట్టిందని మండిపడ్డారు. కేవలం కమిషన్లు, కాంట్రాక్టర్ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఆరోపించారు.
గోదావరిపై ఏపీ సర్కారు నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని కవిత తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 200 టీఎంసీల గోదావరి జలాలను అక్రమంగా తరలించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ఈ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు మౌనం వహిస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా దీనిపై స్పందించి ప్రధాని మోదీకి లేఖ రాసి, బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. గోదావరి-పెన్నా అనుసంధానం పేరిట నీళ్ల తరలింపును తక్షణమే అడ్డుకోవాలని కోరారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం కూడా ఎంపీ ఈటల కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఆయా విషయాలపై నెలరోజుల్లో వారి నుంచి ఎలాంటి స్పందన రాకుంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా నీటి ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, ఉపాధ్యక్షుడు దాస్యం విజయభాస్కర్, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌రావు, యూనైటెడ్ ఫూలే ఫ్రంట్ కన్వీనర్ బొల్ల శివశంకర్, కోఆర్డినేటర్ ఆలకుంట హరి, యూపీఎఫ్ కో కన్వీనర్లు ఆర్వీ మహేందర్, కోల శ్రీనివాస్, నరహరి, విజయేంద్రసాగర్, ఎల్చాల దత్తాత్రేయ, గొరిగే నరసింహ, టీ నరేశ్‌కుమార్, డీ కుమార్‌స్వామి, కే ప్రవీణ్, రాచమల్ల బాలకృష్ణ, మురళీకృష్ణ, సల్వాచారి తదితరులు పాల్గొన్నారు.