Deshapati Srinivas | శాంతిభద్రతలను కాపాడాల్సిన కేంద్ర హోంమంత్రి గూండాలను పంపి దాడులు చేయిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మండిపడ్డారు. కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై దాడి చేసి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కారును ధ్వంసం చేసిన బీజేపీ నాయకులపై రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. డీజీపీని కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, దేశపతి శ్రీనివాస్ వినతిపత్రం అందజేశారు.
అనంతరం దేశపతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ దాడులకు సీఎం రేవంత్ రెడ్డి వత్తాసు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ కార్యాలయమైన క్యాంప్ ఆఫీసులపై దాడి చేశారని తెలిపారు. సిద్దిపేట, గజ్వేల్, హుజూరాబాద్, మల్కాజిగిరిలో దాడులు చేశారని పేర్కొన్నారు. బాహాటంగా బీజేపీ గూండాలు దాడులకు తెగబడ్డారని అన్నారు. వాళ్లు దాడులు చేస్తుంటే పోలీసులు అదుపు చేయకుండా చోద్యం చూస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో శాసనసభ్యులకే రక్షణ లేకుండా పోయిందని దేశపతి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశం కోసం ధర్మం కోసం అని చెప్తూ పుట్టుక గురించి మాట్లాడతారా? ఇంత కుసంస్కారమా అని బండి సంజయ్ తీరుపై దేశపతి శ్రీనివాస్ మండిపడ్డారు. బండి సంజయ్ నోటి నుంచి ఒక శ్లోకం వినలేదని తెలిపారు. ప్రజలకు అవసరం వచ్చే మాట ఒక్కటి కూడా వినలేదని పేర్కొన్నారు. పొద్దున లేస్తే కేటీఆర్, కేసీఆర్ లను తిట్టడం తప్ప ఏం చేతకాదని విమర్శించారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కలిసి ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కలిసి విజ్ఞప్తి చేశామని తెలిపారు. చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.