సిటీబ్యూరో, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): వెండితెరపై థ్రిల్లర్ సినిమాల్లో చూసే డ్రగ్స్ స్మగ్లింగ్ దందాను తలపిస్తూ.. కడుపుకి, రెండు కాళ్లకు బ్రౌన్ సెల్లో టేపులతో డ్రగ్స్ ప్యాకెట్లను చుట్టకొని డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటీ, వనస్థలిపురం పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్ట్ చేసి రూ. 1.5 కోట్ల విలువైన 12 కిలోల హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ వివరాలను సోమవారం మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఎల్బీనగర్ క్యాంప్ సీపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఏపీ నుంచి హైదరాబాద్ మీదుగా బెంగళూర్‌కు భారీగా హాష్ ఆయిల్ రవాణా అవుతుందని ఎల్బీనగర్ ఎస్ఓటీ బృందానికి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు వనస్థలిపురం పోలీసులతో కలిసి చింతల్‌కుంట ప్రాంతంలో బెంగళూర్ బస్సు ఎక్కేందుకు ప్రయత్నంలో ఉన్న ఆరుగురుని అదుపులోకి తీసుకొని విచారించారు. ఆరుగురు వ్యక్తులు పోలీసులకు పట్టుబడగా అందులో ఒక మహిళ, ఇద్దరు మైనర్లు ఉన్నారు.
జెమ్మిలి శ్రీను పాత నేరస్థుడు. గతంలో ఏపీలోని నర్సీపట్నం, అడవి అన్నవరం పోలీస్‌స్టేషన్‌లో ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదైంది. జైలు నుంచి విడులదలైన తరువాత ఏపీలోని చింతపల్లికి చెందిన కృష్ణ(సైప్లెయర్), బెంగళూర్‌కు చెందిన సీజో(రిసివర్)లతో కలిసి బెంగళూర్‌కు హాష్ ఆయిల్ రవాణా చేసేందుకు ప్లాన్ చేశారు. జెమ్మిలి శ్రీను అతని భార్య నిబియా అలియాస్ అమ్ముతో కలిసి ఏపీలోని ఏజెన్సీ ప్రాంతానికి చెందిన అమాయక గిరిజిన యువకులకు డబ్బులు ఆశ చూపి డ్రగ్స్ రవాణాకు క్యారియర్లుగా వాడుకుంటున్నట్లు తెలిసింది.
ఈ మేరకు చిక్కుడు సరన్, పంగి జగదీష్‌లతో పాటు ఇద్దరు మైనర్లను హాష్ స్మగ్లింగ్‌లో క్యారియర్లుగా ఎంచుకున్నారు. శ్రీను, నబియా దంపతులు హాష్ అయిల్ ప్యాకెట్లను నలుగురు క్యారియర్ల శరీరానికి అమర్చి, వారిని ప్రైవేట్ ట్రావెల్స్‌లలో హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఆ నలుగురికి, శ్రీను దంపతులకు ఎలాంటి సంబంధం లేకుండా ఆరుగురు ఒకే వాహనంలో ప్రయాణిస్తుంటారు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు వచ్చిన ఈ ఆరుగురు వనస్థలిపురం ప్రాంతంలో బస్సు దిగి, బెంగళూర్‌కు వెళ్లేందుకు మరో బస్సులో ప్రయాణానికి సిద్ధమవుతుండగా ఈ ముఠాను ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు.
12 కిలోల హాష్ ఆయిల్‌ను బెంగళూర్‌లో రిసివర్కు అప్పగించడంతో ఒకో ట్రిప్పకు రూ. 10 లక్షలు జెమ్మిలీ శ్రీను దంపతులకు వస్తాయని కమిషనర్ తెలిపారు. అందులో కొంత మొత్తం క్యారియర్లకు ఇస్తారని తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ప్రధాన సైప్లెయ్ దారు కృష్ణ, రిసివర్ సిజోల కోసం గాలిస్తున్నట్లు సీపీ తెలిపారు. ఎస్ఓటీ డీసీపీ మనోహర్ నేతృత్వంలో అదనపు డీసీపీ షకీర్ హుస్సేన్, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ ప్రతాప్‌రెడ్డి బృందం ఈ ముఠాను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహారించింది. ఎస్ఓటీ పోలీసులతో పాటు వనస్థలిపురం పోలీసులకు సీపీ అభినందనలు తెలిపారు.
పోలీసుల తనిఖీల్లో స్మగ్లింగ్ చేస్తున్న ఈ ముఠా ఎవరికీ అనుమానం రాకుండా ఒక్కొక్కరు తమ పొట్ట చుట్టూ ఒక కేజీ హాష్ ఆయిల్ ప్యాకెట్, కుడి కాలికి , ఎడమ కాలికి కేజీ చొప్పున ఒక్కొక్కరు మూడు కేజీల హాష్ ఆయిల్ ప్యాకెట్లను బ్రౌన్ టేపులతో శరీరానికి అంటించి ఆపైన దుస్తులు ధరించి ఎవరికీ అనుమానం రాకుండా సాధారణ ప్రయాణికుల మాదిరిగా తిరుగుతున్నారు. ఎలాంటి బ్యాగ్‌లు లేకుండా, శరీరానికి అంటుకున్నట్లు హాష్ ఆయిల్ ప్యాకెట్లను చుట్టి దుస్తులు ధరించి రవాణా చేస్తున్నారు. నలుగురు ఇలా హాష్ ఆయిల్ క్యారియర్లు 12 కిలోల హాష్ ఆయిల్‌ను శరీరంపై కట్టుకొని తీసికెళ్తున్నారు. ఈ నలుగురిని గంజాయి సైప్లె చేసే వాళ్లను ఇద్దరు పెడ్లర్సు వారిని వెంబడిస్తున్నట్లు గుర్తించారు.