MLC Dasoju Sravan | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డికి విషం ఎక్కువ.. విషయం తక్కువ అని ఆయన ప్రసంగం మరో సారి రుజువు చేసింది అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. పదేళ్ల కేసీఆర్ హయంలో హైదరాబాద్ నిర్మాణ రంగం ఎందుకు పురోగతిలో ఉంది.. రేవంత్ హయంలో ఎందుకు దిగజారిందో ఆలోచించాలి అని శ్రవణ్ సూచించారు. తెలంగాణ భవన్లో దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడారు.
నిన్న పంద్రాగస్టు సందర్భంగా గోల్కొండలో, క్రెడాయక్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పసలేని ప్రసంగాలు చేశారు. నిర్మాణ రంగం కుదేలయింది. వాళ్లకు స్వాంతన చేకూర్చే మాట ఒక్కటి రేవంత్ ప్రసంగంలో లేదు. రేవంత్ రెడ్డికి విజన్ లేదు.. విజ్డం లేదు. ఎంత సేపు కేసీఆర్‌ను తిట్టడం, చంద్రబాబును పొగడటం తప్ప ఆయనకు ఏదీ చేత కాదు. హైదరాబాద్ అనేది రెవెన్యూ ఇంజిన్. నిర్మాణ రంగం బాగుంటేనే అన్నీ బాగుంటాయి. కేసీఆర్, కేటీఆర్‌ల చొరవతో హైదరాబాద్ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారింది. హైదరాబాద్ ఇమేజ్ రేవంత్ పాలనలో డ్యామేజీ అయ్యింది. జీహెచ్ఎంసీలో భవన నిర్మాణ అనుమతులు తగ్గిపోయాయి. హెచ్ఎండీఏలో కార్యకలాపాలు పడకేశాయి. రేరాను అడ్డం పెట్టుకుని రేవంత్ బిల్డర్లను బెదిరిస్తున్నారు అని దాసోజు శ్రవణ్ ధ్వజమెత్తారు.
హైదరాబాద్ సైబరాబాద్‌గా మారడానికి 30 ఏండ్లు పట్టింది. రేవంత్ ఫ్యూచర్ సిటీ తెస్తానంటున్నాడు. అప్పటి దాకా హైదరాబాద్‌ను ఎండబెడతారా..? చంద్రబాబును పొగడుతున్నాడు. కేసీఆర్, కేటీఆర్ కృషిని రేవంత్ ఎందుకు ప్రస్తావించరు?రేవంత్ గుండె మీద చేయి వేసుకుని ఆత్మ విమర్శ చేసుకోవాలి. కేసీఆర్ ఉన్నప్పుడు బర్కత్ ఉంటుండే. రేవంత్ రెడ్డి అడుగుపెట్టాడో లేదో ప్రజల దగ్గర పైసలు పుట్టడం లేదు. రాష్ట్ర ఆర్థిక రంగ దుస్థితికి ఏకైక కారకుడు రేవంత్ రెడ్డి మాత్రమే అని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ఎన్ని భవనాలకు అనుమతి ఇచ్చారని తాను ఈ ఏడాది మే 7వ తేదీన ఆర్టీఐకి దరఖాస్తు చేసుకుంటే అర్థం పర్థం లేని సమాధానాలు ఇచ్చారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పరిధిలో వేలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆర్ఆర్ ట్యాక్స్ కట్టనిదే ఏ పర్మిషన్ ఇవ్వడం లేదు. అనుమతులు పూర్తిగా అవినీతిమయం అయ్యాయి. రేవంత్ రెడ్డికి కుడి చేయిగా రేరా, ఎడమ చేయిగా హైడ్రా మారి ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్నాయని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు.