హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రస్తుతం కనిపిస్తున్నది ప్రజాపాలన కాదని, వికృత రాజకీయ క్రీడ అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. ‘దుర్మార్గుడు దేశాన్ని తగులబెట్టి, ఆ బూడిద కుప్పపై సింహాసనాన్ని వేసుకుంటాడు’ అన్న సన్జూ సూక్తి నేడు తెలంగాణ రాజకీయాలకు అద్దం పడుతున్నదని మండిపడ్డారు. నిరాధారమైన, నిలకడలేని ఫోన్‌ట్యాపింగ్ కేసు పేరుతో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావును విచారణ పేరుతో వేధించిన తీరు అమానుషం, అప్రజాస్వామికమని పేర్కొన్నారు. మంగళవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి అధికార గర్వంతో వ్యవస్థలను తన వ్యక్తిగత కక్షల కోసం పావులుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. నేడు మీరు ప్రయోగిస్తున్న ‘పోలీసు అస్త్రాలు’ రేపు మీ రాజకీయ పతనానికి పునాది అవుతాయని హెచ్చరించారు.