హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అభయహస్తం గ్యారెంటీల అమలు ఏమైందో సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. బుధవారం తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశంలో దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి? తులం బంగారం ఏమైందని ప్రశ్నించారు. కాళేశ్వరాన్ని ఎండబెట్టి తెలంగాణను ఏడారిగా మార్చాలనుకుంటున్నారా అంటూ నిప్పులుచెరిగారు. రాష్ట్రంలో పదేండ్లు సీఎంగా ఉంటానని చెప్తున్న రేవంత్‌రెడ్డి జపాన్ నుంచి బంక ఏమైనా కొనుకొచ్చారా? అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ చరిత్ర ఫాంహౌజ్‌లోనే శాశ్వత సమాధి అంటూ వ్యాఖ్యలు చేయడం దారుణమని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పెద్ద మనిషిని పట్టుకుని నీచమైన మాటలు మాట్లడుతారా అంటూ నిప్పులుచెరిగారు.