హైదరాబాద్ : రాష్ట్రంలో పోలీసుల రాజ్యం నడుస్తుంది. సర్పంచులు(Sarpanchs) ఏం తప్పు చేశారు. ప్రజలకు సేవ చేయటం తప్పా? వడ్డీలకు తెచ్చి, గ్రామాల్లో కార్యక్రమాలు చేశారు. అలాంటి వారిని అరెస్ట్ చేయడం సిగ్గు చేటని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish rao) ఫైర్ అయ్యారు. పెండింగ్లో ఉన్న బిల్లులను చెల్లించాలంటూ రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఎక్కడిక్కడ సర్పంచ్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో పలువురు సర్పంచ్లను హరీశ్ రావు పరామర్శించి సంఘీభా వం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలులు అయి నా ఎనిమిది పైసలు కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వలేదని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన రూ.500 కోట్లు కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యం లోపించింది. జ్వరాలతో జనం బాధపడుతున్నారు. ప్రభుత్వం మొద్దు నిద్ర పోతున్నదని మండిపడ్డారు.
ప్రతి నెల రూ.275 కోట్లు మేము మా ప్రభుత్వంలో ఇచ్చాం. పల్లె ప్రగతి డబ్బులు ఇవ్వటం లేదన్నారు. తమ పెండింగ్ నిధుల కోసం సర్పంచులు పోరాడితే వారిని అన్యాయంగా అరెస్టు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, సంజయ్, బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఉన్నారు.