సిద్దిపేట/నారాయణరావుపేట/హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): వరద బాధితులకు బీఆర్ఎస్ అండగా నిలిచింది. పార్టీ పరంగా బాధితులను ఆర్థికం గా ఆదుకోవాలని అధినేత కేసీఆర్ నిర్ణయించారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల నెల జీతాన్ని వరద బాధితులకు వితరణగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎక్స్ వేదికగా వెల్లడించారు.
‘వరద బాధితులను ఆదుకోవాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల నెల జీతం విరాళం ఇవ్వాలని నిర్ణయించాం’ అని ప్రకటించారు. ఎప్పుడూ ప్రజలకు తోడుండే బీఆర్ఎస్, ఇప్పుడు విలయం సృష్టించిన విపత్తులోనూ ప్రజల పక్షాన నిలబడిందని పేర్కొన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు ఎవరికి తోచిన రీతిలో వారు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
సీఎం రేవంత్‌కు కక్షసాధింపు రాజకీయాలు తప్ప పాలనపై పట్టులేదని హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా నారాయణపేట మండలంలోని గోపులాపూర్‌లో తురకవానికుంట తెగి రైతు దేవయ్యకు చెందిన 2 ఎకరాల పంట పొలం నష్టపోయింది. హరీశ్‌రావు బుధవారం ఆ రైతు పొలాన్ని పరిశీలించి.. తక్షణ సహాయంగా రూ.10 వేలు అందించారు.
ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఖమ్మంలో వరద బాధితు లకు సహాయం చేద్దామని వెళ్తే కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాడులకు పాల్పడ్డారని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లావ్యాప్తంగా 700 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని వివరించారు. సిద్దిపేట అమర్నాథ్ అన్నదాన సేవాసమితి ఆధ్వర్యంలో ఖమ్మం వరద బాధితులకు 500 నిత్యావసర కిట్లు పంపనున్నట్టు తెలిపారు.
గురువారం ఉదయం 6 లారీల్లో అవి బయలుదేరుతాయని వెల్లడించారు. సిద్దిపేట పట్టణ ఐఎంఏ తమవంతు సహాయంగా రూ.లక్ష విరాళం అందజేసిందని వివరించారు. సిద్దిపేటకు చెందిన చాలామంది వ్యాపారులు తమవంతుగా సహాయంగా వస్తువులు, నిత్యవసర సరుకులు ఇవ్వటానికి ముందుకు వచ్చారని చెప్పారు. అమర్నాథ్ అన్నదాన సేవాసమితి 13 ఏండ్ల్లుగా అమర్నాథ్ యాత్రికులకు అన్నదానం చేస్తున్నదని, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నదని, ఇప్పటికే 10 వేల మట్టి విగ్రహాలను పంపిణీ చేసిందని తెలిపారు.