హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌తో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు భేటీ అయ్యారు. మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలోని స్పీకర్ చాంబర్లో ఆయనను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, గంగుల కమలాకర్, కేపీ వివేకానంద, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కోవ లక్ష్మి, పాడి కౌశిక్‌రెడ్డి, విజయుడు తదితరులు కలిశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రశ్నోత్తరాలను ఎత్తివేయటం అన్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరారు. ఒకవైపు శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పటికీ మరోవైపు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకులే అధికారిక కార్యక్రమాలను నిర్వహించడంపై నిరసన వ్యక్తంచేశారు. సమావేశాలు సాగుతున్న సమయంలోనూ ప్రొటోకాల్ ఉల్లంఘన జరుగుతున్నదని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి స్పీకర్ దృష్టికి తెచ్చారు. ఈ ఉల్లంఘనలపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.
హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ ) : సభ్యులు ఎక్కువ సమస్యలు లేవనెత్తుతుండటంతో స్పీకర్ ప్రసాద్‌కుమార్.. ‘మీరు చాలా తక్కువగా ప్రశ్నలు అడగండి. మంత్రులు త్వరగా సమాధానం చెప్తరు. లేకపోతే హరీశ్ సమాధానం ఎక్కడ? అని మా వెంట పడతరు’ అని చెప్పడంతో బీఆర్ఎస్ పక్షంలో నవ్వులు విరిశాయి.