BRS MLAs | హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను మాజీ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రిగా ఉండి అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నాడని స్పీకర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. సభను తప్పు దోవ పట్టిస్తున్నారు అని చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై తక్షణమే చర్య తీసుకోవాలని స్పీకర్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరారు.
శాసన సభ ప్రశ్నోత్తరాల సమయంలో రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన ప్రశ్నకు సంబంధించి కోమటిరెడ్డి ఇచ్చిన సమాధానం సభను తప్పుదోవ పట్టించే విధంగా ఉందని స్పీకర్‌కు ఇచ్చిన వినతి పత్రంలో బీఆర్ఎస్ శాసన సభాపక్షం పేర్కొంది.
బీఆర్ఎస్ పాలనలో సీఆర్ఎఫ్ నిధులు రాలేదని, నల్లగొండ నియోజకవర్గ రోడ్లకు నిధులు కేటాయించలేదని, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌కు ఎస్క్రో అకౌంట్ తెరవలేదని కోమటి రెడ్డి ఇచ్చిన సమాధానం పూర్తిగా అవాస్తవమని స్పీకర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆధారాలు సమర్పించారు. తక్షణమే కోమటి రెడ్డి పై తమ సభా హక్కుల ఉల్లంఘన నోటీసును అనుమతించాలని బీఆర్ఎస్ శాసన సభాపక్షం స్పీకర్‌ను కోరింది.