హైదరాబాద్: రేవంత్ రెడ్డి సంకుచిత మనస్తత్వం బయటపడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద (MLA KP Vivek) అన్నారు. రాష్ట్రంలో తొమ్మిది నెలలుగా శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత కాంగ్రెస్‌లో ప్రకంపణలు మొదలయ్యాయని చెప్పారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, డాక్టర్ సంజయ్‌తో కలిసి ఆయన హైదరాబాద్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అరికెపూడి గాంధీని రెచ్చగొట్టి కౌశిక్ ఇంటిపై దాడికి పురిగొల్పారన్నారు. వర్షాలతో నష్టపోయిన ఖమ్మం జిల్లాలో హరీశ్‌రావు సహా బీఆర్ఎస్ నేతలు పర్యటించారని, ఈ సందర్భంగా ప్రజల నుంచి అద్భుతమైన స్పందన రావడం చూసి రేవంత్ తట్టుకోలేక పోతున్నారని విమర్శించారు.
కౌశిక్‌రెడ్డిపై దాడికి సీఎం రేవంత్ రెడ్డి సూత్రధారి అన్నారు. తమవాళ్లే దాడి చేస్తారని సీఎం స్వయంగా చెబుతున్నారని వెల్లడించారు. రేవంత్ రెడ్డివన్నీ లఫంగా మాటలని ఫైర్ అయ్యారు. తాను సీఎంననే విషయాన్ని రేవంత్ మర్చిపోతున్నారు. అప్పుడప్పుడు తాను ముఖ్యమంత్రి అనేది గుర్తుంచుకోవాలన్నారు. ఏది పడితే అది మాట్లాడుతాడని, ఫుట్‌పాత్ గాళ్లు మాట్లాడినట్టు.. లోఫర్, లఫంగ మాటలు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ మాటలు ముఖ్యమంత్రి మాట్లాడకూడదు అనేది మా బాధ అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడితే ప్రభుత్వం అడ్డుకుంటున్ననదని ఆరోపించారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా ఉంటే సమావేశాలు ప్రశాంతంగా జరిగాయన్నారు. రైతులందరికీ ఇంకా రుణమాఫీ పూర్తికాలేదని చెప్పారు. తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. హామీలు అమలు చేయకపోవడంతో ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు. రేవంత్‌ను నమ్ముకుంటే కుక్క తోకను పట్టుకొని గోదారి ఈదినట్టుగా ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి అవుతుందన్నారు.
రాష్ట్రంలో రాజకీయ దాడులకు సీఎం రేవంత్ రెడ్డి కారణమని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అన్నారు. సీఎం మాట్టాడిన తీరును తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యేను మర్డర్ చేయడానికి స్వయంగా సీఎం మనుషులను పంపారన్నారు. తన ఇంటిమీదికి మనుషులను పంపించినట్లు స్వయంగా ముఖ్యమంత్రే ఒప్పుకున్నారని చెప్పారు. రేవంత్ మాటలపై డీజీపీ, హోం శాఖ సెక్రెటరీ స్పందించాలని డిమాండ్ చేశారు. ఖమ్మం వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్తే తమను అరెస్టు చేశారన్నారు. కాంగ్రెస్ నాయకుల్లో పొంతన లేదని ఎద్దేవా చేవారు. డైవర్షన్ పాలిటిక్స్ భాగంగా మంత్రులు తలో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. తమపై దాడులు చేసినవారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.
ఓటుకు నోటు కేసులో రేవంత్ వీపు చింతపండు అయిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. అధికార మదంతో రేవంత్‌రెడ్డి కండ్లు నెత్తికెక్కాయన్నారు. రేవంత్ తన ఇంటికి వచ్చి కాళ్లు మెక్కితేనే ఆయన పీసీసీ చీఫ్ అయ్యారన్నారు. తనను చంపేస్తానంటూ ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పారు. తనకేమైనా అయితే రేవంత్‌దే బాధ్యత అన్నారు. వందలాది మంది పోలీసుల సహాయంతో తనపై దాడికి తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ప్రజలే రేవంత్ రెడ్డి వీపు చింతపండు చేసే రోజు దగ్గరలోనే ఉందన్నారు. తెలంగాణ ప్రజల కోసం చావడానికైనా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. పార్టీ ఫిరాయించిన నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయమని చెప్పారు.
తాను రాజకీయాల్లో వచ్చింది తెలంగాణ ప్రజల కోసమేనని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్నారు. రేవంత్ రెడ్డికి సైకలాజికల్ డిజార్డర్ ఉందని ఓ డాక్టర్ చెప్పారన్నారు. కాంగ్రెస్ తొమ్మిది నెలల పాలనలో రాష్ట్రాన్ని 9 ఏండ్లు వెనకకు తీసుకెళ్లారని విమర్శించారు. రేవంత్ రెడ్డి పొద్దున ఒక మాట, సాయంత్రం ఒక మాట మాట్లాడుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరికెపూడి గాంధీ ఏ పార్టీ సభ్యుడో భట్టి విక్రమార్క లేదా శ్రీధర్ బాబు చెప్పాలని డిమాండ్ చేశారు.