హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడికి తెగబడిన కాంగ్రెస్ గూండాలపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ దాడికి సహకరించిన స్థానిక పోలీస్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు. సైబరాబాద్ సీపీ ఆఫీసు వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో పాత్ర ఉన్న ప్రతి ఒక్కరినీ అరెస్టు చేయాలని చెప్పారు.
20 కిలోమీటర్ల దూరం నుంచి కార్ల కాన్వాయ్‌లో ఓ ఎమ్మెల్యే తన అనుచరులతో దాడి చేసేందుకు వస్తుంటే.. ఏ ఒక్కరూ కూడా ఎందుకు ఆపలేదో చెప్పాలని ప్రశ్నించారు. నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో కాంగ్రెస్ నేతలకు పోలీసులు కుర్చీల్లో కూర్చోబెట్టి, టీలు, బిర్యానీలు తెప్పిస్తూ.. రాచమర్యాదలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతుందని, నిందితులను బయటికి వదిలిపెట్టడం సిగ్గుమాలిన చర్య అని పేర్కొన్నారు. ఈ తరహా దాడులను సీఎం నియంత్రించాలని, మేధావులు ఈ చర్యలను ఖండించాలని కోరారు.
పోలీసుల వైఫల్యమా? ప్రభుత్వ ప్రోత్సాహమా?
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై దాడి పోలీసుల వైఫల్యమా? ప్రభుత్వ ప్రోత్సాహమా? అనేది నిగ్గుతేల్చాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కౌశిక్‌రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు, గాంధీని భారీ కాన్వాయ్‌తో ఎలా అనుమతించారని ప్రశ్నించారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ప్రతిపక్షంలోనే ఉంటే బీఆర్ఎస్ కండువా కప్పుకోవాలని సూచించారు. ఆయన కాంగ్రెస్‌లో చేరింది నిజమేనన్న విషయం ప్రజలందరికీ తెలుసని, పీఏసీ పదవి రావడంతో ప్రతిపక్షంలో ఉన్నట్టు చెప్పుకుంటున్నారని తెలిపారు.
ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే దాడి
పాడి కౌశిక్‌రెడ్డిపై ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే దాడి జరిగిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. పకా ప్రణాళికతోనే కాంగ్రెస్ జరిపిన విద్రోహ చర్య అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో రౌడీ పాలన కొనసాగుతుందని విమర్శించారు. అరికపూడి గాంధీ స్వయంగా కండువా కప్పుకుని కాంగ్రెస్ పార్టీలో చేరారని, పీఏసీ చైర్మన్ పదవి కోసం నాటకాలు ఆడుతున్నాడని ధ్వజమెత్తారు. పీఏసీ చైర్మన్ పదవి అనవాయితీని తుంగలో తొకి నీతిమాలిన రాజకీయానికి సీఎం రేవంత్‌రెడ్డి తెరలేపారని విమర్శించారు.
కౌశిక్‌రెడ్డిపై దాడి ఉన్మాద చర్య
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై దాడి ఉన్మాద చర్య అని శాసనమండలిలో బీఆర్ఎస్ ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. భౌతికదాడులు చేయడం దారుణమని పేర్కొన్నారు. దాడిచేసిన ఎమ్మెల్యే గాంధీ మీద, అతని అనుచరుల మీద తక్షణం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రోత్సహించిన పోలీసులను తక్షణం సస్పెండ్ చేసి, చర్యలు తీసుకోవాలని కోరారు. దాడి చేసిన వారు రాచమర్యాదలతో పోలీస్‌స్టేషన్‌లో ఉంటే, తాము న్యాయంకోసం సీపీ ఆఫీసు మెట్లెకామని తెలిపారు. న్యాయం జరిగేంత వరకు ఉద్యమిస్తామని చెప్పారు.
దాడిపై ముఖ్యమంత్రి స్పందించాలి
కౌశిక్‌రెడ్డిపై దాడి ఘటనపైన సీఎం రేవంత్‌రెడ్డి స్పందించాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఒక ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యేపై దాడి చేయడం గర్హనీయమని, ఈ ఘటనపై సీఎంతోపాటు స్పీకర్, డీజీపీ కూడా స్పందించాలని కోరారు. దాడికి పాల్పడిన ఎమ్మెల్యే గాంధీని రాచమర్యాదలతో పోలీసులు ఇంటికి పంపారని, దౌర్జన్యంపై ఫిర్యాదు చేసేందుకు సీపీని కలిసేందుకు వెళ్లిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలను గేటు వద్దే నిలిపేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
గూండాగురి చేసిన గాంధీకి రాచమర్యాదలా?
ఎమ్మెల్యేపై హత్యాయత్నం చేసిన మరో ఎమ్మెల్యే గాంధీకి రాచమర్యాదలు.. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన తమకేమొ అవమానాలా? అని మాజీ మంత్రి గంగుల కమలాకర్ పోలీస్ అధికారులను ప్రశ్నించారు. కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా గూండాగిరే సాగిస్తుందని, ఈ సర్కారుపై ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేస్తామని, దాడి ఘటనపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే ఎమ్మెల్యే గాంధీపై 307 కింద హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
గాడ్సేగా మారిన గాంధీ
ఎమ్మెల్యే గాంధీ గాడ్సేగా మారారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నారని, ఢిల్లీలో ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. ఆంధ్రా, తెలంగాణ అని రెచ్చగొట్టింది రేవంత్‌రెడ్డే అని స్పష్టం చేశారు. దానం నాగేందర్ నీకు దమ్ముందా, ఇంటిని చుట్టుముడుతావా అంటూ నిలదీశారు. గులాబీ దండు వల్లే నువ్వు గెలిచావనే విషయాన్ని మరిచావా అంటూ గుర్తుచేశారు. తెలంగాణ సమాజం మీద దాడి చేస్తే ఊరుకోమని, రేవంత్‌రెడ్డికి మీరు భయపెడితే మేము భయపడబోమని తేల్చిచెప్పారు.
గాంధీని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు
కాంగ్రెస్ కండువా కప్పుకొని బీఆర్ఎస్లోనే ఉన్నానని చెప్తున్న ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తెలిపారు. పాడి కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడిని తెలంగాణ సమాజంపై దాడిగానే భావిస్తామని చెప్పారు. తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి ఆటవిక పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కొలేక ఇలాంటి దాడులకు ఉసిగొల్పుతున్నారని విమర్శించారు.
కేసీఆర్ పాలనలో అందరి లెకలు తేలుస్తాం
వచ్చే ఎన్నికల అనంతరం కేసీఆర్ పాలనే వస్తుందని, అప్పుడు అందరి లెకలు తెలుస్తామని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కొమ్ముగాసిన పోలీసుల పేర్లు పింక్ బుక్‌లో ఎకిస్తున్నామని స్పష్టంచేశారు. కౌశిక్‌పై కాంగ్రెస్ గూండాలు జరిపిన దాడి హేయమైన చర్యగా పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి హయాంలో తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని ధ్వజమెత్తారు.
కేసీఆర్ పదేండ్ల పాలనంతా శాంతియుతం
కేసీఆర్ పాలించిన గత పదేండ్లలో హైదరాబాద్ సహా రాష్ట్రంలో ఎలాంటి అలజడులు, అల్లర్లు, దాడులు జరగకుండా శాతియుత పాలన సాగిందని మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాస్వామ్య విలువలు హరించుకుపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేపై హత్యాయత్నం ఘటనను చూస్తుంటే శాంతిభద్రతలు ప్రశ్నార్థకమయ్యాయని తెలిపారు. కౌశిక్‌రెడ్డిపై ఉద్దేశపూర్వకంగానే హత్యాయత్నం జరిగిందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు చోటులేదని స్పష్టం చేశారు.