హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో రోడ్లు, మౌలిక వసతుల దుస్థితిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ సరార్ను నిలదీశారు. రోడ్ల అభివృద్ధికి కేటాయించిన నిధులు, గత రెండేండ్లలో ఖర్చు చేసిన మొత్తంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆర్‌యూబీలు, ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేయకపోవడాన్ని ప్రశ్నోత్తరాల సమయంలో ఎండగట్టారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మాణం ప్రారంభమైన పలు ప్రాజెక్టులను కాంగ్రెస్ సర్కార్ అటకెక్కించడంపై నిప్పులు చెరిగారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు, రోడ్ల దుస్థితి, డంపింగ్ యార్డుల నిర్వహణ, వీధిదీపాల ఏర్పాటు తదితర అంశాలపై రేవంత్‌రెడ్డి సర్కార్ నిర్లక్ష్యాన్ని తూర్పారబట్టారు.
రెండేండ్లలో 123 కోట్లే ఖర్చు: వివేకానంద
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరాభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నదని ధ్వజమెత్తారు. అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్లు, బైపాస్ రోడ్ల నిర్మాణానికి దాదాపు రూ.16 వేల కోట్లతో ప్రణాళికలు రూపొందించినట్టు చెప్పడమే తప్ప ఆచరణలో పరిస్థితి అధ్వానంగా ఉన్నదని నిప్పులు చెరిగారు. గత రెండేండ్లలో ప్రభుత్వం కేవలం రూ.123 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని పేర్కొంటూ.. ఇలా అయితే ప్రభుత్వ ప్రణాళికలు ఎన్నేండ్లకు అమలవుతాయని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో హైదరాబాద్ అద్భుతంగా అభివృద్ధి చెందిందని, అందుకే నగర ప్రజలు ఎన్నికల్లో బీఆర్ఎస్కు గొప్ప విజయాన్ని అందించారని గుర్తుచేశారు.
తట్టెడు మట్టి తీయలె: సబితా ఇంద్రారెడ్డి
గతంలో ప్రారంభమైన అనేక రోడ్ల పనుల టెండర్లను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు రోడ్డు నుంచి శ్రీశైలం హైవే వరకు రోడ్డు నిర్మాణానికి టెండర్లు పిలిచిన రేవంత్‌రెడ్డి సరార్ తట్టెడు మట్టి కూడా తీయలేదని, టెండర్లు పూర్తయిన చోట పనులు ప్రారంభం కాలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానిది ఆరంభ శూరత్వమనేనని ఎద్దేవా చేశారు.
ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలె: సుధీర్‌రెడ్డి
హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని, అందులో భాగంగా అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్ల నిర్మాణాలు చేపట్టాలని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి డిమాండ్ చేశారు. రోడ్లపై ఉన్న గుడులు, మసీదులు, ఇతర ప్రార్థనా మందిరాలను ఆయా మతపెద్దల సమ్మతంతో ఇతర ప్రాంతాలకు తరలించాలని, తద్వారా ట్రాఫిక్ సమస్యలు చాలా మేరకు తగ్గుతాయని తెలిపారు.
ప్రణాళికల అమలు ఇప్పుడే మొదలైంది: మంత్రి దుద్దిళ్ల
సభ్యులు లేవనెత్తిన అంశాలపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సమాధానమిస్తూ.. ఇప్పటివరకు ప్రణాళికలు రూపొందించామని, వాటి అమలు ఇప్పుడే మొదలైందని చెప్పారు. ఈ ఏడాది రూ.2 వేల కోట్లకుపైగా పనులను చేపడుతామని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
కాంగ్రెస్‌తో హైదరాబాద్ రోడ్లకు దుర్గతి: తలసాని
బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ గ్లోబల్ సిటీగా, అత్యంత సురక్షితమైన నగరంగా అభివృద్ధి చెందడంతో అనేక రాష్ట్రాలవారు ఇకడ స్థిరపడ్డారని మాజీ మంత్రి, అసెంబ్లీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్‌యాదవ్ కొనియాడారు. అప్పట్లో రూ.70 వేల కోట్లతో రోడ్ల అభివృద్ధి జరిగిందని, ప్రణాళికాబద్ధంగా రహదారులు, డ్రైనేజీలు తదితర అభివృద్ధి పనులు కొనసాగాయని గుర్తుచేశారు. కాంగ్రెస్ వచ్చాక విశ్వనగరం అధ్వానంగా తయారైందని, హైదరాబాద్ రోడ్లకు దుర్గతి పట్టిందని, దీంతో రోడ్లపై గంటల తరబడి నరకం చూడాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రోడ్లకు మరమ్మతులు చేయడం లేదని విమర్శించారు.
అర్ధాంతరంగా పనుల నిలిపివేత : మాధవరం
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూకట్పల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను అర్ధాంతరంగా నిలిపేసిందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ధ్వజమెత్తారు. పనుల ప్రారంభోత్సవాల్లో ప్రజాప్రతినిధులను విస్మరించి కాంగ్రెస్ నేతల పేర్లు పెడుతున్నారని నిప్పులు చెరిగారు.
నిధులివ్వండి: మల్లారెడ్డి
మాజీ మంత్రి మ ల్లారెడ్డి జవహర్‌నగర్ డంపింగ్‌యార్డు సమస్యను లేవనెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక డంపిం గ్ యార్డు పరిస్థితి అధ్వానంగా తయారైందని విమర్శించారు. యార్డు సమస్య పరిష్కారానికి స్పెషల్ క్యాటగిరీ కింద నిధులివ్వాలని కోరారు.
రోడ్లను పట్టించుకునే నాథుడే లేడు: ముఠా గోపాల్
ముషీరాబాద్ నియోజకవర్గంలో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని, ముఖ్యంగా పద్మారావునగర్, గంగపుత్ర కాలనీ, పార్సిగుట్టలో రోడ్లు తీవ్రంగా పాడయ్యాయని ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. సుందరయ్య పార్ చుట్టుపకల రోడ్లు కూడా అధ్వానంగా ఉన్నాయని తెలిపారు. ఈ సమస్యలను ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.