హైదరాబాద్, జనవరి 5(నమస్తే తెలంగాణ) : సభాహక్కుల ఉల్లంఘనకు పాల్పడిన సీఎం రేవంత్‌రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ప్రివిలేజ్ మోషన్ ఫిర్యాదు చేసింది. శాసనసభలో కృష్ణా జలాలపై జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి తప్పుడు సమాచారం ఇచ్చి సభాహక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపించింది. ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై తానే ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపించానని సీఎం రేవంత్‌రెడ్డి తప్పుడు ప్రకటనతో సభలో హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆ ఫిర్యాదులో బీఆర్ఎస్ పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, కోవ లక్ష్మి, విజయుడు, అనిల్ జాదవ్ తదితరులు శాసనసభ కార్యదర్శి తిరుపతిని కలిసి ఫిర్యాదు చేశారు. ప్రివిలేజ్ మోషన్ ఫిర్యాదును తొలుత శాసన స్పీకర్ గడ్డంప్రసాద్కు ఇచ్చేందుకు ప్రయత్నించగా, ఆయన సభ నుంచి బయటికి రావడం కుదరదని చెప్పినట్టు తెలిసింది. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభ కార్యదర్శికి ఫిర్యాదు అందజేశారు. తెలంగాణ శాసనసభ కార్యకలాపాల నిర్వహణ నియమావళిలోని 168-173 కింద, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 194 ప్రకారం సీఎం రేవంత్‌రెడ్డిపై ఫిర్యాదు చేస్తున్నట్టు వివరించారు.
కృష్ణాజలాల వివాదంపై సభలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చర్చకు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. పూర్తిగా తప్పుడు సమాచారాన్ని సభ ముందు ఉంచిందని, మొదటిసారి జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం, రెండోసారి జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశాల గురించి ప్రస్తావించినప్పుడు అధికారిక మినిట్స్ తప్పుగా ఉటంకించారని, సభలో మినిట్స్ క్రమం, పద్ధతిని ఇష్టానుసారంగా మార్చి చదివారని, అధికారిక రికార్డులను కూడా వక్రీకరించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదులో పేర్కొన్నారు. తెలంగాణ శాసనసభ నిర్వహణ నియమావళి 335 ప్రకారం సభలో ఉటంకించిన పత్రాలను సభ ముందు పెట్టాలని, కానీ సీఎం రేవంత్‌రెడ్డి ఎటువంటి అధికారిక పత్రాలను సభకు సమర్పించకుండానే ఇష్టానుసారం మాట్లాడి, ఇదే నిజమని నమ్మించే ప్రయత్నం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విమర్శించారు. కృష్ణాజలాలపై జరిగిన తాత్కాలిక ఒప్పందాలను శాశ్వత ఒప్పందాలని చిత్రీకరించారని, తప్పుడు ఉద్దేశంతోనే సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు.
కృష్ణా జలాలపై అసెంబ్లీలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో సీఏం రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆరోపించారు. సోమవారం తోటి ఎమ్మెల్యేలతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డిపై ప్రివిలేజ్ మోషన్ ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ ఫిర్యాదును స్పీకర్ అంగీకరించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాదులపై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని, ప్రజలను మోసంచేసి ప్రభుత్వాన్ని నడుపుతున్నదని ధ్వజమెత్తారు. సీఎం అసెంబ్లీలో ఆన్ రికార్డుగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని తెలిపారు. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో పచ్చి అబద్ధాలు చెప్పారని, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను తానే ఆపానని రేవంత్‌రెడ్డి అంటున్నారని, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎవరు ఆపారో హరీశ్‌రావు స్పష్టంగా చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి అపెక్స్ కౌన్సిల్లో ఉన్న అంశాలను తప్పుదోవ పట్టించారని, కృష్ణా నదీజలాలపై శాశ్వత ఒప్పందం జరిగినట్టుగా ప్రజల ను, సభను నమ్మించేలా మాట్లాడారని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి అబద్ధాలు మాట్లాడి అడ్డంగా దొరికిపోయారని, అందుకే తాము ఆయనపై ప్రివిలేజ్ మోషన్ ఫిర్యాదు ఇచ్చినట్టు చెప్పారు. రేవంత్‌రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో తమకు మైక్ ఇవ్వడానికి కాంగ్రెస్ భయపడుతున్నదని చెప్పారు.