హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Telangana Assembly) కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కలు మహిళా ఎమ్మెల్యేలను కించపరిచేలా మాట్లాడినందుకు నిరసనగా బీఆర్ఎస్ శాసనసభ్యులు నల్లబ్యాడ్జీలు ధరించి సభకు హాజరయ్యారు. మహిళా ఎమ్మెల్యేలకు సీఎం, డిప్యూటీ ఎంసీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సభలో నినాదాలతో హోరెత్తిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనల మధ్యే మంత్రి శ్రీధర్ బాబు స్కిల్ యూనివర్సిటీ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అయితే తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యేలు పట్టుబట్టారు.
కాగా, నిండు శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క మహిళల పట్ల అత్యంత అవమానకరంగా ప్రవర్తించారని, వారి ప్రవర్తన తనను ఆశ్చర్యానికి గురిచేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డికి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంలు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా.. ఎంతో హుందాగా, ప్రజలకు సేవ చేసే గుణం వారిది. అలాంటి మహిళ నేతలను ఇంత చులకనగా మాట్లాడటం సిగ్గు చేటని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు చేసిన ఈ వ్యాఖ్యలు వారిద్దరిపై మాత్రమే కాదు మొత్తం మహిళలపై వారికున్నా చులకన భావాన్ని తెలియజేస్తుందన్నారు. కాంగ్రెస్ నేతల వ్యవహార శైలిని మహిళలంతా గమనిస్తున్నారని చెప్పారు. వారికి సరైన సమయంలో బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.
శాసనసభలో ముఖ్యమంత్రి బీఆర్ఎస్ మహిళా శాసనసభ్యుల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసనగా, సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి అసెంబ్లీకి హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. pic.twitter.com/82U4OoDCRx
— BRS Party (@BRSparty) August 1, 2024