హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : జేఎంఎం అధినేత, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూసొరేన్ అంత్యక్రియలు మంగళవారం జార్ఖండ్ రాష్ట్రం రామ్‌గఢ్ జిల్లా నేమ్రాలో జరిగాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఈ అంత్యక్రియలకు హాజరయ్యారు. సొరేన్ పార్థివదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేసీఆర్‌తో కలిసి నడిచిన సొరేన్ తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచారని కొనియాడారు. 2001లో హైదరాబాద్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ సభకు శిబూసొరేన్ తొలి అతిథిగా హాజరయ్యారని గుర్తుచేసుకున్నారు.
ఆయన మరణం అస్తిత్వ పోరాటాలకు, జాతీయ ఫెడరల్ విధానానికి తీరని లోటని పేర్కొన్నారు. రాజకీయంగా ఎదురైన ఒడిదొడుకులను ధైర్యసాహసాలతో ఎదుర్కొన్న యోధుడని కీర్తించారు. ఆదివాసీ, గిరిజన హక్కుల సాధన కోసం, జార్ఖండ్ రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. శిబూసొరేన్ కొడుకు జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్‌ను పరామర్శించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. శిబూసొరేన్తో కేసీఆర్‌కు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేశారు.