హైదరాబాద్, ఆగస్టు31 (నమస్తే తెలంగాణ) : నీళ్లు, నిధులు, నియామకాల పేరిట సాగిన ఉద్యమానికి అర్థవంతమైన ముగింపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒకటయితే, ఉద్యమ నేత కేసీఆర్ పాలన మరొకటని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. గోదావరిలో ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపట్టి బీళ్లకు మళ్లించాలని నాడు కేసీఆర్, హరీశ్‌రావు రాత్రింబవళ్లు పనిచేసి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని గుర్తుచేశారు. గన్‌పార్క్ వద్ద నిరసన తెలిపిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్, కేసీఆర్‌ను బద్నాం చేసే కుత్సిత బుద్ధితోనే కాంగ్రెస్ కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలు రైతుల అనుభవంలో ఉన్నాయని తెలిపారు. ఘోష్ సమర్పించింది రిపోర్టు కాదని, ట్రాష్ రిపోర్టు అని నిప్పులు చెరిగారు. కనీసం బీఆర్ఎస్ వాదన వినకుండా, క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండా, చట్టాన్ని తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు. దానిపై న్యాయపోరాటం చేస్తున్నామని, అది కొనసాగుతుందని, పార్టీ పరంగా ఏం చేయాలనేది త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. నీళ్లను అందించిన కేసీఆర్‌ను దోషిగా నిలబెడుతున్నారని నిప్పులు చెరిగారు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ గొంతు నొకారని, స్పీకర్ ఏ మాత్రం సంబంధం లేనట్టుగా వ్యవహరించారని కేటీఆర్ విమర్శించారు. మాజీమంత్రి హరీశ్‌రావు ఒక్కడు మాట్లాడితే ముఖ్యమంత్రితో సహా మంత్రులంతా కలిసి 30 సార్లు అడ్డుతగిలారని, ఎన్ని రకాల కుట్రలు చేసినా తమ చిత్తశుద్ధిని చెప్పే ప్రయత్నం చేశామని, ప్రజల తరఫున, ప్రజలకు జరిగిన మేలును మరోసారి గుర్తుచేస్తూ అసెంబ్లీలో మాట్లాడే ప్రయత్నం చేశామని వెల్లడించారు. కాళేశ్వరంపై జరుగుతున్న కుట్రను ప్రజల్లో ఎండగడతామని, కాళేశ్వరం ప్రాజెక్టును కూల్చి ఇబ్బంది పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నదని తెలిపారు. గతంలో జరిగిన ప్రమాదం కూడా కాంగ్రెస్ నాయకత్వమే చేసిందని, నేడు కూడా కుట్ర చేసి మేడిగడ్డ బరాజ్ నష్టానికి కారణమైందన్న ఆరోపణలు ఉనాయని, ప్రాజెక్టును శాశ్వతంగా బొందపెట్టే ప్రయత్నం చేస్తున్నదని ధ్వజమెత్తారు. ప్రజలకు, రైతన్నలకు వరదాయినిగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడుకునేందుకు అవసరమైతే ప్రత్యేకంగా ఒక ఉద్యమం చేయాల్సి వస్తే చేస్తామని తెలిపారు. లక్షల ఎకరాల సాగునీటి సౌకర్యాన్ని, రైతన్నల భవిష్యత్తును, మొత్తంగా తెలంగాణ సాగునీటి రంగ భవిష్యత్తును కాపాడుకుంటామని పునరుద్ఘాటించారు.
20 ఏండ్లపాటు తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాల కోసం కేసీఆర్ పోరాటం చేశారని, అధికారంలోకి వచ్చిన పదేండ్లపాటు తెలంగాణలోని ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టేందుకు ప్రయత్నం చేశారని గుర్తుచేశారు. దశాబ్దాల పాటు జరిగిన అన్యాయాన్ని అరికట్టి తెలంగాణ రైతాంగానికి న్యాయం చేసే ప్రయత్నం కేసీఆర్ చేశారని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేస్తే కేసీఆర్‌ను బద్నాం చేయవచ్చన్న కుట్రతోనే కాంగ్రెస్ ఈ రిపోర్టును రూపొందించిందని, అంతకుమించి అందులో ఇంకేమీ లేదని వెల్లడించారు. 50 ఏళ్ల కాంగ్రెస్ చరిత్ర, బీఆర్ఎస్ చేసిన పనులు ప్రజలందరికీ తెలుసని వివరించారు. కాళేశ్వరంపై ఘోష్ ఇచ్చిన రిపోర్టు ఘోష్ రిపోర్ట్ కాదని, అది ట్రాష్ రిపోర్ట్ మాత్రమేని, అందుకే ఆ రిపోర్టు కాపీలను చెత్తబుట్టలో వేశామని వివరించారు. కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టాన్ని ఉల్లంఘించి కమిషన్ ఈ రిపోర్టును రూపొందించిందని, నీళ్లు ఇచ్చిన కేసీఆర్‌నే బద్నాం చేయాలన్న కుట్రతోనే ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని వివరించారు. మేడిగడ్డ కోసం జరిగే మరమ్మతులకు సంబంధించి 350 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందని, అది కూడా ఆ సంస్థ భరించేందుకు సిద్ధంగా ఉందని, ప్రజలపై రూపాయి భారం పడబోదని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.90వేల కోట్లు ఖర్చయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం లక్ష కోట్లు అని నోటికి ఎంతొస్తే అంత ప్రచారం చేస్తున్నదని నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డికి పిల్లనిచ్చిన మామ సైతం ఆ ఆరోపణలను ఖండించారని, కాళేశ్వరం ప్రాజెక్టులో బరాజ్‌లు, కాలువలు పనిచేస్తుంటే లక్ష కోట్లు అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారని గుర్తుచేశారు. మేడిగడ్డ ఒకటే కాళేశ్వరం అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్తున్నదని ధ్వజమెత్తారు.
గోదావరి జలాలను వదిలిపెట్టి బనకచర్లను పంపడానికే కాళేశ్వరం ప్రాజెక్టును, మేడిగడ్డను బలిపెడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణతో పాటు దేశంలో ఎకడ ప్రమాదాలు జరిగినా ఎన్డీఎస్ఏ విచారణ చేపట్టదని విమర్శించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలి 8మంది చనిపోయినా, పోలవరం కుంగినా, సుంకిశాల కూలినా ఎన్డీఏఎస్ రాదని, కానీ తెలంగాణలో మేడిగడ్డలో జరిగిన చిన్న ప్రమాదాన్ని పెద్దగా చేసి చూపించే కుట్ర చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీజేపీ రెండూ కూడబలుక్కుని తెలంగాణ, బీఆర్ఎస్ గొంతు నొక్కుతున్నాయని నిప్పులు చెరిగారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీరింగ్ అద్భుతమని, ప్రపంచలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని వివరించారు. తెలంగాణ ప్రజలకు, రైతాంగానికి భారత రాష్ట్ర సమితిపై సంపూర్ణ విశ్వాసమున్నదని, ప్రాజెక్టుపై జరుగుతున్న కుట్రలను గుర్తుపట్టి కచ్చితంగా వ్యతిరేకిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పార్టీపరంగా తాము సైతం అవసరమైతే నియోజకవర్గాల వారీగా మీటింగ్‌లు పెడతామని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి కాళేశ్వరంపై చేస్తున్న కుట్రలను ప్రజల్లో ఎండగడతామని, అడ్డుకుంటామని వెల్లడించారు. రాజకీయ దురుద్దేశంతోనే కమిషన్ నివేదికను ఇచ్చిందని, సీనియర్ జడ్జి రాజకీయ దురుద్దేశాలతో రిపోర్టు ఇవ్వడం బాధాకరమని తెలిపారు.