BRS MLAs | ఢిల్లీ మద్యం పాలసీ వివాదంలో ఎమ్మెల్సీ కవితపై ఈడీ, కేంద్ర ప్రభుత్వం తీరును బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఖండిస్తున్నారు. ఈడీ విచారణ నేపథ్యంలో కవితకు మద్దతుగా నిలబడేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు, జాగృతి నాయకులు పెద్ద ఎత్తున ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలోని ముఖ్యమంత్రి నివాసం వద్దకు చేరుకుని కవితకు అండగా నిలబడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాడిని దుర్మార్గపు చర్యగా బీఆర్ఎస్ నేతలు అభివర్ణించారు. కేవలం కేసీఆర్ను ఇబ్బంది పెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం ఈడీని అడ్డుపెట్టుకుని ఈ దాడులకు పాల్పడుతోందని విమర్శిస్తున్నారు.
తెలంగాణ ప్రజలు, బీఆర్ఎస్ నేతలు, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబంపై బీజేపీ కక్ష కట్టిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆరోపించారు. ఈడీ దాడులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని కబ్టా చేయాలని చూస్తోందని అన్నారు. బీజేపీ వ్యతిరేక నాయకుల మీద మాత్రమే దాడులు చేస్తున్నారని.. బీజేపీ నాయకులపై ఎందుకు ఈడీ దాడులు జరగట్లేదని ప్రశ్నించారు. ప్రజల సొమ్మును దోచుకెళ్లిన ఆదానీపై ఎందుకు దాడి చేయట్లేదని.. కవితపైనే ఎందుకు దాడి చేస్తున్నారని నిలదీశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ కవితకు మద్దతుగా ఉంటామని ప్రకటించారు.
టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చినప్పటి నుంచి తమ పార్టీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని గువ్వల బాలరాజు అన్నారు. ముఖ్యంగా కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితపై సీబీఐ, ఈడీ అంటూ రకరకాల ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. కవిత ఎలాంటి స్కామ్ చేయలేదని.. కేవలం కేసీఆర్ బలగాన్ని దెబ్బతీయాలనే దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దేశ విలువలు కాపాడాలనే కదం తొక్కుతూ ముందుకెళ్తున్న కేసీఆర్ను తెలంగాణకే పరిమితం చేయాలనే కుట్రలు పన్నుతోందని అన్నారు. తెలంగాణలో అమలవుతున్న పాలన విధానాన్ని దేశానికి పరిచయం చేస్తే తమ ఉనికికే ప్రమాదమని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. అందుకే తమ దుర్మార్గపు ఆలోచనలతో ప్రజాస్వామ్యాన్ని అంతమొందించడమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం గద్దె దిగేంతవరకు ప్రజాస్వామ్యవాదులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. స్వయంప్రతిపత్తితో పనిచేయాల్సిన ఈడీ, సీబీఐ వంటి సంస్థలను కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో పనిచేసే విధంగా మారుస్తున్నారని విమర్శించారు. దీన్ని ఖండిస్తున్నామని తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లో కవితకే కాదు.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పనిచేస్తున్న నాయకులను ఇటువంటి దాడులకు పూనుకున్న ప్రభుత్వాన్ని అంతమొందించాలని పిలుపునిచ్చారు.
మోదీ హయాంలో దేశంలో వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టాయని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విమర్శించారు. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ కుట్ర రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. కేసీఆర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకే బీజేపీ కుట్రలు పన్నుతోందని అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ సర్కార్ దుర్వినియోగం చేస్తోందని బీసీ కమిషన్ సభ్యుడు ఉపేంద్ర ఆరోపించారు. మోదీ ఎన్ని కుట్రలు చేసినా భయపడేది లేదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్పై బీజేపీ కుట్రలు సాగవని అన్నారు.