Vemula Prashanth Reddy | హైదరాబాద్ : గల్లీలో గలీజ్ దందాలు చేస్తూ ఢిల్లీలో గులాం గురి చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తీరు ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశం మండిపడ్డారు. తెలంగాణ భవన్లో వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో చిట్ చాట్ చేశారు. మంత్రుల శాఖల కేటాయింపు కోసం, కాంగ్రెస్ పార్టీ అధినేతల అపాయింట్మెంట్ కోసం రెండు రోజులు ఢిల్లీలో పడిగాపులు కాసి అపాయింట్మెంట్ దొరకని ప్రస్టేషన్లో మాట్లాడుతున్నాడు. కేసీఆర్, కిషన్ రెడ్డి ఒక్కటే అని రేవంత్ రెడ్డి అన్న మాట అబద్ధం, అవాస్తవం. రేవంత్ రెడ్డి బీజేపీ ఒక్కటి అన్నది వాస్తవం. రేవంత్ రెడ్డి ,బీజేపీ దోస్తాన్ చాలా సార్లు బయట పడింది. లోక్‌సభ ఎన్నికల్లో బలహీన అభ్యర్థులను పెట్టి బీజేపీ ఎంపీలు గెలవడానికి రేవంత్ రెడ్డి సహాయ పడ్డారు. స్వయంగా ఈ మాట బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. మల్కాజ్‌గిరిలో ఈటల రాజేందర్‌ను గెలిపించడానికి వేరే ప్రాంతం నుంచి సునీతా మహేందర్ రెడ్డిని నిలబెట్టారు. కిషన్ రెడ్డిని గెలిపించడానికి బీఆర్ఎస్లో ఉన్న దానం నాగేందర్‌ని సికింద్రాబాద్‌లో నిలబెట్టారు. కాంగ్రెస్ నుండి గతంలో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా పలుమార్లు పోటీ చేసిన అనుభవం ఉన్న జీవన్ రెడ్డికి కాదని ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేని వెలిచాల రాజేందర్‌కు కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్‌పై పోటీకి నిలిపారు. ఇలా నిజమాబాద్‌లో అరవింద్‌పై, మెదక్‌లో రఘునందన్‌పై, ఆదిలాబాద్‌లో నగేశ్‌లపై రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బలహీన అభ్యర్థులను నిలబెట్టారు. 8 మంది బీజేపీ ఎంపీలలో 7 మందిని రేవంత్ రెడ్డినే గెలిపించారు. బీజేపీ పార్టీ కూడా రేవంత్ రెడ్డిపై ఈగ వాలనివ్వడం లేదు అని వేముల ప్రశాంత్ రెడ్డి గుర్తు చేశారు.
స్వయంగా ప్రధాని మంత్రి మోదీ ఎలక్షన్ ప్రచారంలో తెలంగాణలో ఆర్ ఆర్ ట్యాక్స్ నడుస్తుంది అని మాట్లాడిన ఈడి, సీబీఐ ఎందుకు రావడం లేదు..? ఓటుకు నోటు కేసు ఎటుపోయింది, ఎందుకు జాప్యం జరుగుతోంది..? రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయినప్పుడు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకదు కానీ ప్రధానిని కలవడానికి 15 నిమిషాల్లో అపాయింట్మెంట్ ఎలా దొరుకుతుంది..? బండి సంజయ్ బహిరంగంగానే రేవంత్ రెడ్డి పదవి కాపాడుకోవాలని సూచనలు ఇస్తున్నాడు. బీఆర్ఎస్ను రాజకీయంగా బొంద పెట్టడానికి కాంగ్రెస్, బిజెపి కలిసి పని చేయాలి అని బండి సంజయ్ అన్నారు. బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అనే సంకేతం బండి సంజయ్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి బీజేపీలో జాయిన్ అయితే స్వాగతిస్తామని ఎంపీ అరవింద్ అంటున్నారు. ఇది రేవంత్ రెడ్డి, బీజేపీ దోస్తానకు సంకేతము కాదా..? నేను బీజేపీ స్కూల్లో చదువుకున్న అని రేవంత్ రెడ్డి ఢిల్లీలో అన్నారు. హైదరాబాద్‌లో అన్నది మోదీ విన్నాడో లేదో అని మళ్ళీ అవే మాటలు ఢిల్లీలో మాట్లాడిండు. బీజేపీలోకి వెళ్తాను అని సూచన ఇస్తున్నట్టున్నాడు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డిని నమ్మకండి.. కాంగ్రెస్ పార్టీని ఖతం చేసి బీజేపీలోకి పోతారు అని ప్రశాంత్ రెడ్డి అన్నారు.
కేసీఆర్ తెలంగాణకు ఆత్మ. తెలంగాణ కోసం కేసీఆర్ పోరాడుతున్న సందర్భంలో ఉద్యమకారులపైకి తుపాకీ ఎక్కు పెట్టిన రేవంత్ రెడ్డి తెలంగాణకు శత్రువు. ఏపీకి చంద్రబాబు నీళ్లు తీసుకెళ్తుంటే నోరు ముసుకున్న రేవంత్ రెడ్డి తెలంగాణ శత్రువు. కేసీఆర్ హయాంలో తలసరి ఆదాయంలో దేశంలో మొదటి స్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 4వ ప్లేస్‌కు, జీడీపీలో 4వ స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని 13వ స్దానానికి దిగజార్చిన నువ్వు తెలంగాణ శత్రువు. తెలంగాణ అప్పుల పాలైందని, తెలంగాణ ముఖ్యమంత్రిగా వెళ్తే దొంగలా చూస్తున్నారని తెలంగాణ పరువు తీస్తున్న రేవంత్ రెడ్డి తెలంగాణకు శత్రువు అని ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
బీజేపీ, కాంగ్రెస్ కలిసి తెలంగాణకి అన్యాయం చేస్తున్నారు. 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి తెలంగాణకు ఒక్క రూపాయి తీసుకురాలే. ఆంద్రప్రదేశ్‌లో ఉన్న టీడీపీ ఎంపీలు వేల కోట్లు నిధులు తెచ్చుకున్నారు. నిధుల వరద ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకుపోతున్నారు. పోలవరం, అమరావతి రాజధాని, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు వేల కోట్లు, బనకచర్లకు జాతీయ హోదా తెస్తుంటే మన కాంగ్రెస్, బిజెపి ఎంపీలు ఒక్క రూపాయి కూడా తెలంగాణకు తేవట్లేదు. కాబట్టి తెలంగాణకి అసలైన శత్రువులు బీజేపీ కాంగ్రెస్ పార్టీలే..? బీఅరెస్ పార్టీకి, కేసీఆర్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం.. బీఆర్ఎస్ ఎంపీలు గెలిచి ఉంటే తెలంగాణకు ఈ గతి పట్టేదా. 45 సార్లు ఢిల్లీకి పోతే 4 సార్లు కూడా రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ దొరకలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి బతుకు అలా ఉంది అని ప్రశాంత్ రెడ్డి విమర్శించారు.