MLA Sabitha | కందుకూరు, ఏప్రిల్ 22 : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినట్లు మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సభావత్ లచ్చా నాయక్, పెద్దమ్మ తండా గ్రామ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ సభావత్ సుమన్ నాయక్తో పాటు వారి అనుచరులు సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ గులాబీ జెండాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీతోనే ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 420 హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేక పోయిందని విమర్శించారు. ప్రజా సంక్షేమాన్ని మరిచి, ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. హామీలను ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలను మాయమాటలతో మభ్యపెడుతుందని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ఒక్క గ్యారెంటీ కూడా సక్రమంగా అమలు చేయకపోవడం దారుణమన్నారు.
కాంగ్రెస్ పార్టీని వీడి తమ పార్టీలో చేరడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారని చెప్పారు. త్వరలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని జోస్యం చెప్పారు. కన్న తల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరి మోసపోయామని లచ్చానాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి పార్టీలో చేరడం తనకెంతో సంతోషంగా ఉందని వివరించారు. దీంతో మండలంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీలో పెద్దమ్మ తండా మాజీ ఉప సర్పంచ్ రేఖ్య నాయక్, లక్ష్మణ్ నాయక్, విజయ నాయక్ తదితరులు చేరిన వారిలో ఉన్నారు.
కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ సురుసాని సురేందర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, మండల పార్టీ అధ్యక్షుడు మన్నే జయేందర్, ముదిరాజ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలుక మేఘనాథ్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్ రెడ్డి, నియోజకవర్గం కార్యదర్శి సామ మహేందర్ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు ఆనేగౌని దామోదర్ గౌడ్, మహేశ్వరం మండల పార్టీ అధ్యక్షుడు రాజు నాయక్, డైరెక్టర్ పిట్టల పాండు ముదిరాజ్, మండల యూత్ అధ్యక్షుడు తాళ్ల కార్తీక్, సోషల్ మీడియా కన్వీనర్ బొక్క దీక్షిత్ రెడ్డి, యూత్ నాయకులు తేజ నాయక్, జైపాల్, వెంకటేష్, దేవుల నాయక్, మోతిలాల్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.