MLA Prashanth Reddy | హైదరాబాద్ : రాష్ట్రంలో కరువు పారద్రోలిన ప్రాజెక్టు కాళేశ్వరం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్, బీజేపీ అందరూ కలిసి కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, ముఠా గోపాల్‌తో కలిసి వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీపై ఉంది. బనకచర్ల, అనుసంధానం పేరిట ఏపీ, కేంద్రం తెలంగాణ హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ జీవనాడి అయిన కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవాలు ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. ఒక్క ఎకరాకు నీరు ఇవ్వలేదని అంటున్నారు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాదాపు 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందింది. కేవలం రెండు పిల్లర్లు కుంగితే కాళేశ్వరం కుంగిపోయిందని అంటున్నారు. భారీ వరదను కూడా తట్టుకొని మేడిగడ్డ ఆనకట్ట నిలబడింది, కావాలంటే అక్కడకు వెళ్లి చూద్దామని అధికార పార్టీ నేతలకు వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు.
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక సీల్డ్ కవర్లో ఉండగానే ఏదో జరిగిందని పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతున్నారు. నివేదికను తప్పుపడుతున్నాం, సెక్షన్ 8బీ ప్రకారం వివరణ కోరలేదు, న్యాయస్థానంలో పోరాడుతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలు, ప్రయోజనాలను వివరించాల్సిన అవసరం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆధారాలు, గణాంకాలు, సాంకేతిక అంశాలతో ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలని సభాపతిని అడిగాం. సభాపతి అందుబాటులో లేరు, కార్యదర్శి తీసుకోవడం లేదు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు శాసన సభాపతి అవకాశం ఇస్తారని కోరుతున్నాం. పీపీటీకి అవకాశం ఇవ్వకపోతే పక్షపాతంగా వ్యవహరిస్తున్నట్లు భావించాల్సి వస్తుంది. నిజానిజాలు సమగ్రంగా వివరించేందుకు పీపీటీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం. సభాపతి సమయం ఇస్తే రేపు అయినా కలిసి వినతిపత్రం అందిస్తాం అని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.