Palla Rajeshwar Reddy | రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. రెండున్నరేళ్లలో బిహార్, యూపీ వెనుకబడిన రాష్ట్రాల్లో ఉన్న మాదిరిగానే తెలంగాణ శాంతిభద్రతలు మారాయని విమర్శించారు. కేసీఆర్ హయాంలో నేరాలు తగ్గాయని తెలిపారు. కానీ కాంగ్రెస్ వచ్చిన రెండున్నరేళ్లలోనే నేరాలు పెరిగిపోయాయని పేర్కొన్నారు.
కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై దాడి చేసి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కారును ధ్వంసం చేసిన బీజేపీ నాయకులపై రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. డీజీపీని కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, దేశపతి శ్రీనివాస్ వినతిపత్రం అందజేశారు. అనంతరం పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కరీంనగర్ ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. రెండు మూడు నెలలుగా జిల్లాల్లో జరిగిన ఘటనలను వివరించామని పేర్కొన్నారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై బీజేపీ నేతలు దాడి చేశారని తెలిపారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని హత్య చేసే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. బండి సంజయ్ ఇంటికి సమీపంలోనే జ్యువెలరీ షాపులో దోపిడీ జరిగితే ఏం చేశారని ప్రశ్నించారు. బండి సంజయ్ కేటీఆర్ పట్ల ఇష్టమొచ్చినట్లు మాట్లాడిండని మండిపడ్డారు. కేటీఆర్‌పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను విత్‌డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి అయినా సరే బండి సంజయ్‌పై కేసు నమోదు చేయాలన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి భద్రత కల్పించాలని కోరారు.
బండి సంజయ్ ప్రవర్తన చూసే అతన్ని ఎమ్మెల్యేగా గెలిపించలేదని పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఇప్పటికైనా ప్రవర్తన మార్చుకోకపోతే కౌన్సిలర్‌గా కూడా గెలవవు అని హితవు పలికారు. డీజీపీ కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మాపై ఏరకమైన కేసులు పెట్టారో వారిపై కూడా అలాంటి కేసులే పెట్టాలన్నారు.