హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): శాసనసభలో ఉండాల్సిన జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, అ సెంబ్లీ గ్యాలరీలో కూర్చున్నారు. వివరాల్లోకి వెళ్తే.. సమావేశాలను వీక్షించేందుకు జనగామ నియోజకవర కౌన్సిలర్లు, నేతలు సో మవారం అసెంబ్లీకి వచ్చారు. మధ్యాహ్నం 12గంటల తర్వాత వారిని అసెంబ్లీలోకి అ నుమతించారు. అప్పటికే అసెంబ్లీ చర్చలకు స్పీకర్ టీ బ్రేక్ ప్రకటించారు. సమావేశాలు తాత్కాలిక వాయిదాపడ్డాయి. 2గంటలపాటు సమావేశాలు ప్రారంభం కాలేదు. దీంతో ఆ నేతలు గ్యాలరీలోనే నిరీక్షించారు. సభ ఎప్పుడు ప్రారంభమవుతుందా? అని ఎదురుచూశారు. టీ బ్రేక్ సుదీర్ఘ సమయం తీసుకోవడంపై అసహనం వ్యక్తం చేశా రు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్వయంగా గ్యాలరీకి వచ్చి నియోజకవర్గ నాయకులతో కూర్చొని కొద్దిసేపు ముచ్చటించారు. అప్పటికీ సభ ప్రారంభం కాకపోవడంతో వారికిచ్చిన సమయం ముగిసింది. ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డి జనగామ నాయకులను స్పీకర్ వద్దకు తీసుకెళ్లి ఫొటోలు దిగారు.
టీ బ్రేక్ ఎంతసేపు? : హరీశ్‌రావు
ఇదిలా ఉంటే టీ బ్రేక్ తర్వాత 12:15 గంటలకు శాసనసభలోకి బీఆర్ఎస్ డిప్యూ టీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అందరి కంటే ముందుగా విచ్చేశారు. ఆ తరువాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కే సంజయ్, మర్రి రాజశేఖర్‌రెడ్డి, మల్లారెడ్డి, కోవ లక్ష్మి, సునీతాలక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఒకరి తరువాత ఒకరు వచ్చారు. కాంగ్రెస్ నుంచి మంత్రి దామోదర రాజనర్సింహ సైతం హాల్లోకి వచ్చారు. అరగంట గడిచినా సభ ప్రారంభం కాలేదు. దీంతో ప్రభుత్వపక్ష నేతలను ఉద్దేశించి టీ బ్రేక్ ఎంతసేపు అంటూ హరీశ్‌రావు ప్రశ్నించారు. ఒక దశలో మంత్రి దామోదర సైతం అసహనం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు 2:15 గంటలకు సభ తిరిగి ప్రారంభమైంది.