హైదరాబాద్: కాంగ్రెస్ గూండాలు తనపై హత్యాయత్నం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (MLA Padi Kaushik Reddy) అన్నారు. తన ఇంటి కిటికీ అద్దాలు ధ్వంసం చేశారని చెప్పారు. ప్లాన్ ప్రకారమే గుడ్లు, టమాటాలు తీసుకొచ్చారని తెలిపారు. దాడులు చేస్తే భయపడేది లేదని స్పష్టం చేశారు. చంపే ప్రయత్నం చేస్తే.. మేమేందో కూడా చూపిస్తామన్నారు. గూండాలతో వచ్చి దాడి చేయడం ఎంతవరకు కరెక్టు అని ప్రశ్నించారు. హారతులతో స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంటే.. తమపై రాళ్ల దాడులు చేస్తారా అన్నారు.
రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేదని, సామన్య ప్రజలకు ప్రభుత్వం రక్షణ ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. ప్రజా పాలన అంటే ఇదేనా రేవంత్ రెడ్డి అని నిలదీశారు. కాంగ్రెస్ గూండాల దాడికి రేపు ప్రతిచర్య ఉంటుందన్నారు. తెలంగాణ పవర్ చూపిస్తామని హెచ్చరించారు. పోలీసులపై కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలను ఎందుకు అదుపు చేయలేదని ప్రశ్నించారు. తనపై దాడి జరుగుతుంతే చూస్తూ ఉండిపోయారన్నారు. పోలీసులే దగ్గరుండి తనపై దాడి చేయించారని ఆరోపించారు. తన ఇల్లు ధ్వంసం చేస్తుంటే అడ్డుకోలేకపోయారని విమర్శించారు.
ఐదేండ్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడు పార్టీ మారిన నేతల సంగతి అప్పుడు చూస్తాం అని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఐదేండ్ల తర్వాత కేసీఆర్ సీఎం కావడం ఖాయం.. మీ భరతం పట్టడం ఖాయం. ఇది రాసిపెట్టుకోండి. ఇప్పుడు పార్టీ మారిన వారందరికీ నాలుగేండ్ల తర్వాత సినిమా చూపిస్తాం. ప్రతిపక్షానికి పీఏసీ ఇవ్వడం ఆనవాయితీ.. మేం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షానికి ఇచ్చాం. ఇప్పుడు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ దాఖలు చేసిన నామినేషన్లు ఏమయ్యాయి. నామినేషన్ దాఖలు చేయని అరికెపూడి గాంధీకి దొంగచాటున పీఏసీ ఎలా ఇస్తారని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు.
అరికెపూడి గాంధీ మాట్లాడిన మాటలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. మైనంపల్లి హన్మంత్ రావు అల్వాల్‌లో మీటింగ్ పెట్టి ఇదే విధంగా కేటీఆర్‌ను దూషించారు. 50 వేల ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు. రేపు నీ నియోజకవర్గంలో నీకు కూడా అదే గతి పడుతుంది. ఉప ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వంలో మా దమ్మేందో చూపిస్తాం. ఏదో తిట్టి డైవర్షన్ చేయడం కాదు.. సూటిగా అడుగుతున్నా సమాధానం చెప్పాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.
తెలంగాణ పవర్ రేపు చూపిస్తాం – పాడి కౌశిక్ రెడ్డి pic.twitter.com/ssZ0nQHxk0
— Telugu Scribe (@TeluguScribe) September 12, 2024