హుజూరాబాద్, జనవరి 31 : కరీంనగర్ సీపీపై వస్తున్న వార్తల్లో నిజం లేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి స్పష్టం చేశారు. సీపీ గౌష్ ఆలం మత మార్పిడి చేస్తున్నారని తాను అన్నట్టుగా తెలంగాణ ఐపీఎస్‌లు ఒక ప్రకటనలో పేర్కొనడాన్ని ఖండిస్తూ శనివారం ఆయన ఒక వీడియో విడుదల చేశారు. తెలంగాణ ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ తనపై చేసిన ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదని స్పష్టంచేశారు. కరీంనగర్ సీపీ గౌష్ ఆలం మత మార్పిడిలు చేస్తున్నారని తాను అన్నట్టు ఐపీఎస్ అసోసియేషన్ నిరూపిస్తే, మరుక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. నిరూపించకపోతే తనపై అసత్య ఆరోపణలు చేసిన ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పుడు ప్రచారంతో తన ప్రతిష్టకు భంగం కలిగించారని మండిపడ్డారు. అసోసియేషన్ క్షమాపణ చెప్పని పక్షంలో వారిపై అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెడతానని హెచ్చరించారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన అధికారులే రాజకీయ ప్రేరేపిత ఆరోపణలు చేయడం సరికాదని హితవుపలికారు.