Indiramma Atmiya Bharosa | హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): రైతు భరోసా వచ్చేవారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వడం లేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క స్పష్టంచేశారు. భూమి లేని వారికి, 20 రోజులు కూలీ పని చేసిన వాళ్లకు మాత్రమే ఆత్మీయ భరోసా ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ఎకరం, అరకెరం ఉన్నవాళ్లకు కూడా ఆత్మీయ భరోసా ఇవ్వాలనే డిమాండ్‌పై భవిష్యత్తులో పరిశీలిస్తామని చెప్పారు. ఉపాధి హామీలో రూ.50 వేలు, రూ.లక్ష తీసుకునే వాళ్లు కూడా ఉన్నారని, అలా అని అందరికీ ఆత్మీయ భరోసా ఇవ్వలేం కదా అని పేర్కొన్నారు. ఇప్పటివరకు రూ.60 నుంచి 70 కోట్లు ఇచ్చామని, మిగిలిన టోకెన్లు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ఎన్నికల కోడ్‌తోపాటు ఇతర కారణాలతో మిగిలిన వారికి ఇవ్వలేదని చెప్పారు. జూన్‌లో రెండో దశ ఆత్మీయ భరోసా ఇస్తామని తెలిపారు. రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మొదటి దశ పంపిణీని మార్చి 31లోపు పూర్తి చేస్తామని స్పష్టంచేశారు. ఈ మేరకు కూలీలకు ఆత్మీయ భరోసా ఇవ్వడం లేదంటూ శనివారం అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వేసిన ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పారు.
అన్నం పెట్టే రైతుకు రేవంత్ సున్నం
దేశానికి అన్నం పెట్టిన రైతుకు సున్నం పెట్టిన దౌర్భాగ్య చరిత్ర రేవంత్‌రెడ్డి సర్కారుదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. రైతులకు కేసీఆర్ పాలన స్వర్ణయుగమైతే, కాంగ్రెస్ పాలన సంక్షోభ యుగంలా మారిందని విమర్శించారు. శనివారం అసెంబ్లీలో వ్యవసాయ పద్దుపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ తరుఫున పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడారు. వ్యవసాయానికి నిరుడు రూ.72,659 కోట్లు ఖర్చు పెట్టినట్టు చెప్పిన సర్కారు.. ఈ బడ్జెట్లో రూ.24,439 కోట్లు మాత్రమే కేటాయించిందని చెప్పారు. రైతులకు రూ.50 వేల కోట్ల బడ్జెట్ ఎందుకు తగ్గించారని నిలదీశారు. వరంగల్ డిక్లరేషన్ ఎన్నేండ్లలో పూర్తి చేస్తారో, అందరికీ రుణమాఫీ ఎప్పుడు చేస్తారో, రైతుభరోసా ఎప్పుడు ఇస్తారో, పంటల బీమా ఎప్పుడు అమలు చేస్తారో చెప్పండని ప్రశ్నించారు.
రుణమాఫీ పూర్తయితే.. వీళ్లకు ఎందుకు కాలేదు
25.35 లక్షల మంది రైతులకు రూ.20,616 కోట్ల మాఫీ చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారని, కానీ రాష్ట్రంలో ఇంకా లక్షల మంది రైతులకు రుణమాఫీ ఎందుకు కాలేదని పాడి కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. గత బడ్జెట్లో రుణమాఫీకి రూ.31 వేల కోట్లుగా పేర్కొన్నారని, ఇప్పుడేమో రూ.20,616 కోట్లతో రుణమాఫీ పూర్తి చేశామని చెప్తున్నారని, మిగిలిన రూ.11 వేల కోట్లు ఎటు పోయాయని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు రెండు విడతల్లో రూ.29,144 కోట్ల రుణమాఫీ చేశామని, ఇది కాంగ్రెస్ సర్కారు చేసిన రుణమాఫీ కన్నా ఎక్కువని చెప్పారు.
రైతుభరోసా ఏమైంది?
ప్రభుత్వం ఇప్పటికే రైతులకు రైతుభరోసా కింద రెండు సీజన్లు బాకీ పడిందని, ఎకరానికి రూ.17,500 బాకీ పడిందని పాడి కౌశిక్‌రెడ్డి విమర్శించారు. ‘చేతులు జోడించి కోరుతున్నా.. రైతులు ఎదరుచూస్తున్నారు. రైతుభరోసా కింద రూ.15వేలు జమ చేయండి’ అని విజ్ఞప్తి చేశారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణను నంబర్ వన్‌గా నిలబెట్టిన చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానిదని స్పష్టంచేశారు. 2014-15లో రైతుల తలసారి ఆదాయం రూ.1,12,162 మాత్రమే ఉంటే 2023-24 నాటికి రూ. 3,17,115కు పెరిగిందని, ఇది కేసీఆర్ ప్రభుత్వం సాధించిన ఘనతని స్పష్టం చేశారు. ఇప్పుడు మళ్లీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయని, యూరియా దొరకడం లేదని, రైతుభరోసా రావడం లేదని దుయ్యబట్టారు. మత్స్యకారులు, యాదవ, కురుమ సోదరులను ఆర్థికంగా బలోపేతం చేయాలనే సంకల్పంతో కేసీఆర్ ప్రవేశపెట్టిన ఉచిత చేపల పిల్లల పంపిణీ, గొర్రెల పంపిణీకి కాంగ్రెస్ సర్కారు ఎగనామం పెట్టి ఆ వర్గాలకు అన్యాయం చేసిందని విమర్శించారు.
రాళ్లు, గుట్టలకు ఇచ్చి ఉంటే రికవరీ చేయండి: హరీశ్‌రావు
బీఆర్ఎస్ హయాంలో రాళ్లు, గుట్టలకు రైతుబంధు ఇచ్చారంటూ మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాళ్లు, గుట్టలకు ఇచ్చి ఉంటే, ఆ వివరాలు బయటపెట్టి, రికవరీ చేయాలని సవాల్ చేశారు. ఆత్మీయ భరోసాలో దళితులు, గిరిజనులు, బలహీనవర్గాలకు అన్యాయం జరుగుతున్నదని పేర్కొన్నారు. గుంట, రెండు గుంటల భూమి గల రైతులకు రైతుభరోసా ద్వారా రూ.3 వేలు రావడం వల్ల ఆత్మీయ భరోసా కింద రూ.12 వేలు నష్టపోతున్నారని తెలిపారు. ఎకరంలోపు ఉన్న వారందరికీ 12 వేలు ఇచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆత్మీయ భరోసా కోసం గత బడ్జెట్లో రూ.930 కోట్లు పెట్టారని, ఇందులో రూ.60 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్టు సీతక్క చెప్తున్నారని తెలిపారు. అయితే ఇంకా రూ.870 కోట్లు విడుదల చేయలేదని విమర్శించారు.