MLA Padi Kaushik Reddy | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల పక్షాన గర్జిస్తాం.. కాంగ్రెస్ నేతలకు తప్పకుండా ఏడు చెరువుల నీళ్లు తాగిస్తాం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ భవన్లో పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రజలకు ఇచ్చిన హామీలపై, నిరుద్యోగుల పక్షాన మాట్లాడితే.. కాంగ్రెస్ పార్టీ నేతలు సమాధానం చెప్పకుండా ఎగిరెగిరి పడుతున్నారు. జీవన్ రెడ్డి సీనియర్ నాయకులు. మీరంటే మాకు గౌరవం ఉంది. కానీ సీనియర్ నాయకుడిగా ఉంటూ ఇలాంటి మాటలు మాట్లాడి మీ గౌరవాన్ని కోల్పోవడం మంచిది కాదు. మీకు అవగాహన ఉందో లేదో తెలియదు. హరీశ్ రావు ఏ సబ్జెక్ట్ మాట్లాడిన స్టడీ చేసి మాట్లాడుతారు. హరీశ్‌రావు నిరుద్యోగుల పక్షాన మాట్లాడుతూ.. గ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 సెలెక్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మీరు దానికి సమాధానం చెప్పకుండా 1:100 చేయలేం. చేస్తే కోర్టుకు వెళ్లి స్టే తెస్తరు అని మాట్లాడుతున్నారు. ఈ అంశంపై మీకు నాలెడ్జి లేదని మీరే బయటపెట్టుకున్నారు. ఎప్పుడంటే ఎప్పుడు చేంజ్ చేసుకోవచ్చని బైలాస్ ఉన్నాయి. వైఎస్సార్ కేబినెట్లో జీవన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు 1:100 పిలిచారు. తనకు తెలియదు అంటే సిగ్గుచేటుగా ఉందని పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు.
గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్న భట్టి విక్రమార్క కూడా గ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 పిలవాలని డిమాండ్ చేశారు. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇలా.. లేనప్పుడు అలా మాట్లాడటం సరికాదు. మొన్న ఏపీలో గ్రూప్-2 ఎగ్జామ్స్ 1:50 పెట్టినప్పుడు, అభ్యర్థుల డిమాండ్ మేరకు 1:100 పిలవడం జరిగింది. ఇదేమీ కొత్త పరిస్థితి కాదు. చిల్లరమల్లర కాంగ్రెస్ పార్టీ నాయకులు హరీశ్‌రావు మీద నోరు పారేసుకోవడం సరికాదు. కాంగ్రెస్ పార్టీ నాయకుల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. మీ మాటలకు భయపడేవారు ఎవరూ లేరు. ప్రతి హామీనీ నెరవేర్చే వరకు ప్రజల పక్షాన గర్జిస్తాం. ఏడు చెరువుల నీళ్లు తాగిస్తాం. భయపడే ప్రసక్తే లేదు. ఆరు గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఏడు నెలలు అయినా హామీల నెరవేరలేదు. ఈ ఆరు నెలల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదు కానీ.. ఆరు స్కామ్స్ చేశారు. కాంగ్రెస్ కుంభకోణాలను ప్రజలు గమనిస్తున్నారు. హామీలు నెరవేర్చకపోతే.. ప్రజలు సరైన సమయంలో కర్రుకాల్చి వాత పెడుతారు అని కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తున్నాం. హరీశ్‌రావు మీద మాట్లాడేటప్పుడు ఆలోచించుకుని మాట్లాడాలి. హరీశ్‌రావు ప్రజల పక్షాన ప్రశ్నలు అడిగారు తప్ప ఎవర్నీ వ్యక్తిగతంగా దూషించలేదు. ఎదురుదాడులకు దిగినా.. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చు వరకు ప్రజల పక్షాన గర్జిస్తూనే ఉంటామని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.