KTR | హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ‘ఓ స్త్రీ రేపు రా’ మాదిరి కాంగ్రెస్ పరిపాలన ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
తెల్లారి లేస్తే ప్రజాపాలన అంటారు. కానీ నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో.. మీ ప్రజా పాలనలో ప్రజాస్వామిక స్ఫూర్తి కూడా అంతే ఉంది. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామంటున్నరు. కానీ అత్తాకోడల్లకు పంచాయతీ పెట్టారు. తులం బంగారం, ఆసరా పెన్షన్ల కోసం అత్తాకోడళ్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అప్పట్లో ఊర్లల్లో గోడల మీద రాసేది ఓ స్త్రీ రేపు రా అని.. ఇవాళ వీళ్ల పరిపాలన కూడా అట్లనే ఉంది. ఏది అడిగినా ఓ స్త్రీ రేపు రా.. మహిళలను కోటీశ్వరులను చేస్తారంటా.. ఎట్ల చేస్తారో తెలియదు కానీ.. 40 శాతం బడ్జెట్‌ను చూసిన తర్వాత ప్రజలకు అర్థమైంది వీళ్ల పాలన అని కేటీఆర్ పేర్కొన్నారు.
రూ. 2500 కోసం ఆడబిడ్డలు ఎదురుచూస్తున్నారు. బంగారం అన్నారు.. లంకె బిందెలు దొరికినక ఇస్తారా..? కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. న్యూట్రిషన్ కిట్ ఆగిపోయింది. బతుకమ్మ చీరలు, రంజాన్ తోపా బంద్, ఆశాలు, అంగన్వాడీ కార్మికులను మోసం చేశారు. ఇంచా చాలా ఉన్నాయి.. క్రైమ్ రేట్ పెరిగిపోతోందని డీజీపీనే స్వయంగా చెప్పారు. ప్రోటోకాల్ వయిలేషన్స్ కూడా జరుగుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు.
హరీశ్‌రావు మీద పెట్రోల్ పోసి చంపేస్తా అని కాంగ్రెస్ నాయకుడు అంటడు.. కానీ చర్యలు, కేసులు ఉండవు. కానీ మా మీద కేసులు, చర్యలు ఉంటాయి. ఉద్యోగులకు డీఏలు, పీఆర్సీ, ఐఆర్ పెండింగ్‌లో ఉన్నాయి. ఐఆర్ అంటే ఇప్పట్లో రాదు.. డీఏ అంటే దయచేసి అడగొద్దు.. పీఆర్సీ అంటే పనికి రాని చర్చలు అని ఉద్యోగులు అనుకుంటున్నారు. అలా పరిస్థితి అయిపోయింది. ఓల్డ్ పెన్షన్ స్కీం ఎప్పుడు తెస్తారో చెప్పాలి. వ్యవసాయ విస్తరణ అధికారులను, పోలీసులను సస్పెండ్ చేశారు.. ప్రజాపాలన ఇలా ఉందంటూ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు.