KTR | హైదరాబాద్ : చంద్రబాబు హయాంలో ఫార్ములా-1 ట్రాక్‌కు కేటాయించిన భూముల్లో రేవంత్ రెడ్డికి కూడా 15 ఎకరాల భూమి ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఫార్ములా -ఈ రేస్‌పై ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్, ఇండియాలో కార్ రేసింగ్ రావాలని, ప్రపంచ వ్యాప్తంగా బహుళ ప్రాచుర్యం పొందిన దీన్ని తేవాలని ప్రయత్నాలు జరిగాయి. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 2001లో ఆనాడు ఫార్ములా-1 రేస్‌ను తేవాలని ప్రయత్నించారు. ఫార్ములా1 సీఈవోను కలిసి హైదరాబాద్‌కు రండి ఏర్పాట్లు చేస్తానని చెప్పారు. కానీ దురదృష్టవశాత్తు చంద్రబాబు ప్రయత్నాలు ఫలించలేదు. గోపన్‌పల్లి లో 580 ఎకరాల భూసేకరణకు నోటీసులు ఇచ్చారు రెవెన్యూ శాఖ వారు. ఇండియాలో ఫార్ములా 1 పర్మనెంట్ ట్రాక్ బిల్డ్ చేయాలి.. దానికి హైదరాబాద్ కేంద్రం కావాలని బాబు ప్రయత్నించాడు. దురదృష్టం బాబు ప్రభుత్వం పోయింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. అలాగే ఆ ట్రాక్ కోసం భూములు ఇచ్చిన రైతులు కూడా తమ భూమి కోసం న్యాయ పోరాటం చేస్తున్నారు. ఆ రైతుల్లో రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు.. అక్కడ 15 ఎకరాల భూమి కూడా ఉంది. రేవంత్ రెడ్డి ఎన్నికల ఆఫిడవిట్లో 15 ఎకరాల భూమిని చూపించారు. 2023 ఎన్నికల ఆఫిడవిట్లోనే ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి డిక్లేర్ చేశారని కేటీఆర్ గుర్తు చేశారు.
ఎఫ్-1 రేస్ తేవాలని బాగా ప్రయత్నాలు జరిగాయి. పట్టణాల అభివృద్ధి దాని చుట్టూ ఆధారపడి ఉంది. మొనాకో సిటీలో నిర్వహించే గ్రాండ్ ప్రీ ఈవెంట్ వరల్డ్ ఫేమస్. అక్కడ ప్రపంచ బిలినీయర్లు దిగుతారు. గ్రాండ్ ప్రీ వల్ల మొనాకో సిటీ వెలుగులోకి వచ్చింది. పాపులారిటీ రేసింగ్ ఎఫ్-1.. 200 కోట్ల పైచిలుకు చూస్తారు. మన దేశంలో కూడా ప్రయత్నాలు జరిగి.. యూపీలోని నోయిడాలో జేపీ గ్రూప్ ఒక ట్రాక్ కట్టారు. ఆ ట్రాక్‌లో ఫార్ములా-1 రేస్ నిర్వహించారు. 2009, 2010, 2011లో 1700 కోట్లు ఖర్చు చేసి నిర్వహించారు. మూడు ఏండ్ల తర్వాత మళ్లీ రాం అని క్యాన్షిల్ చేసుకుని ఫార్ములా-1 వారు వెళ్లిపోయారు అని కేటీఆర్ తెలిపారు.
ఫార్ములా -4 రేస్ మొన్ననే చెన్నైలో జరిగింది. జమ్మూకశ్మీర్‌లో కూడా జరిగింది.. ఇక్కడ ఫార్ములా -4 రేస్ జరగడం ఇండియాకు గర్వకారణం అని అమిత్ షా ట్వీట్ చేశారు. చెన్నైలో 42 కోట్లు ఖర్చు పెట్టి నిర్వహించారు. ఈ రకంగా రేసుల కోసం దేశ వ్యాప్తంగా పోటీ ఎప్పట్నుంచో ఉంది. అయితే గత 11 ఏండ్ల నుంచి కొత్త ట్రెండ్ వచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చినప్పట్నుంచి రేసింగ్‌లో ఈవీ వాహనాలను తీసుకురావాలని ఫార్ములా – ఈ వచ్చింది.. దీనికి విపరీతమైన, విస్తృతమైన ప్రచారం వచ్చింది. ఈ క్రమంలో మన బీఆర్ఎస్ ప్రభుత్వం.. 2014లో చాలా ఆలోచనలు చేసి ఏ రంగాల్లో పెట్టుబడులు తీసుకురావొచ్చు అని అన్వేషించింది. 14 కీలక రంగాలను గుర్తించి.. వాటిని ఇండస్ట్రీయల్ పాలసీలో చేర్చాం. అందులో ఒకటి ఆటో మొబైల్ రంగం, రెండోది రెన్యువబుల్ ఎనర్జీ రంగం. ఈ రెండింటి కలయికనే ఎలక్ట్రిక్ వెహికల్స్. కాలుష్యంతో సతమతవువుతున్నారు.. కాబట్టి ఈవీలను తీసుకురావాలని నిర్ణయించాం. భవిష్యత్‌లో పార్ములా-1 ఉండకపోవచ్చు.. ఫార్ములా -ఈని తీసుకురావాలని నిర్ణయించాం అని కేటీఆర్ గుర్తు చేశారు.