కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం ఇవ్వాలనే సదుద్దేశంతో ఉన్నా.. ప్రభుత్వం రెచ్చగొట్టడం వల్లే రంగంలోకి దిగాల్సి వచ్చింది. గవర్నర్ ప్రసంగం ద్వారా ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. ప్రభుత్వం అసత్యాలు చెబితే ఎండగట్టాల్సిన బాధ్యత మాపై ఉన్నది. అందుకే ప్రభుత్వ శ్వేతపత్రాలకు ప్రతిగా స్వేదపత్రం విడుదల చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారు.
– కేటీఆర్
KTR | హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): పార్టీలో అన్ని స్థాయిల్లో సమన్వయ లోపం జరిగిందని, దానికి పూర్తి బాధ్యత తనదేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రభుత్వంలో ఉన్నపుడు పూర్తికాలం ప్రభుత్వ కార్యక్రమాల్లో తలమునకలు కావటం వల్ల పార్టీకి పూర్తి సమయం కేటాయించలేకపోయామని చెప్పారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిదాకా అన్నిహోదాల్లో పార్టీ ప్రతినిధులే అధికారంలో ఉండటం, వివిధ స్థాయిల్లో ప్రజాప్రతినిధులుగా ఉన్న నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు సంతృప్తస్థాయిలో ఉన్నారని భావించామని తెలిపారు. అలాకాకుండా పార్టీని సంస్థాగతంగా నిర్మించి, అన్ని స్థాయిల్లో సమన్వయం చేయాల్సి ఉండాల్సిందని వివరించారు. తమను ఓడించి ప్రజలు తప్పుచేశారని కొంతమంది బీఆర్ఎస్ నేతలు అకడకడా మాట్లాడుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని, అలా ప్రజలను తప్పుపట్టడం సరైనది కాదని పార్టీ శ్రేణులకు హితవు పలికారు. తెలంగాణ ఉద్యమ కాలంలో, గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారనే విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా నాయకులతో కేటీఆర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై విశ్లేషించి, పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు పూర్తిస్థాయిలో తిరస్కరించలేదని, కచ్చితంగా గెలుస్తామనుకున్న జిల్లాల్లో విభిన్న ఫలితాలు నిరాశ పరిచాయని తెలిపారు. కుంగిపోకుండా నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి ఆశీర్వాదాలు పొందేందుకు పోటీపడాలని, అదే నిజమైన రాజకీయ స్ఫూర్తి అని వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఇచ్చిన 39 ఎమ్మెల్యేల స్థానాలు తక్కువేమీ కాదని, 14 స్థానాల్లో కేవలం వందలు, వేల ఓట్ల తేడాతో ఓడామని, అవి కూడా గెలిస్తే పరిస్థితి వేరుగా ఉండేదని విశ్లేషించారు. ‘పరిపాలన మీద దృష్టిపెట్టి పార్టీని పట్టించుకోలేదు.
ఇందుకు పూర్తి బాధ్యత నాదే’ అని కే తారకరామారావు చెప్పారు. బీఆర్ఎస్లో సంస్థాగత నిర్మాణం సరిగ్గా జరగలేదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి సరైన గుర్తింపును ఇవ్వలేకపోయామని అన్నారు. పార్టీ కార్యకర్తల ఆర్థిక పరిస్థితిని పట్టించుకోలేదని తెలిపారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే కేంద్రంగా పార్టీని నడపటం సరికాదని వెల్లడించారు. ప్రభుత్వానికి, పథకాలకు నడుమ కార్యకర్త లేకుండా నేరుగా లబ్ధిదారుడికే చేరడం వల్ల ఓటరుకు, కార్యకర్తకు లింకు తెగిందని విశ్లేషించారు. 6 లక్షలకుపైగా రేషన్ కార్డులు, ప్రతి నియోజవర్గంలో 15 వేలకు వరకు కొత్త పింఛన్లు ఇచ్చినా జనంలోకి తీసుకెళ్లలేకపోయామని వివరించారు. దళితబంధు కొందరికే రావడంతో మిగతావారు ఓపికపట్టలేక అసహనం ప్రదర్శించి వ్యతిరేకమయ్యారని, ఇతర కులాల్లోనూ వ్యతిరేకత వచ్చిందని శ్రేణులు చెప్పినట్టు పేర్కొన్నారు. కారు సర్వీసింగ్‌కు వెళ్లిందని, షెడ్డుకు కాదని చమత్కరించారు.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం ఇవ్వాలనే సదుద్దేశంతో ఉన్నా, తమను ప్రభుత్వం రెచ్చగొట్టడం వల్లే రంగంలోకి దిగాల్సి వచ్చిందని కేటీఆర్ వివరించారు. గవర్నర్ ప్రసంగం ద్వారా ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ కవ్వింపు చర్యలకు దిగిందని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్నవి అసత్యాలు అని చెప్పాల్సిన బాధ్యత తమపై ఉన్నదని, అందుకే ప్రభుత్వం శ్వేతపత్రాలకు, స్వేదపత్రం విడుదల చేశామని వివరించారు. కొత్తగా ప్రభుత్వం కుదురుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాన్ని విడిచిపెట్టి, ప్రతిపక్షంలో ఉన్న తమపై అభాండాలు వేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వ విధానాన్ని ఎండగట్టాల్సి వస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. త్వరలో స్వయంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావు అసెంబ్లీకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలని అన్నారు.
బీఆర్ఎస్ ఎప్పటికీ బీజేపీకి బీ టీం కాదని, అది కాంగ్రెస్ చేసిన విషప్రచారమని కేటీఆర్ అన్నారు. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు గతంలో లేదని, భవిష్యత్తులో ఉండదని తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ అసలుసిసలు లౌకిక పార్టీ అని స్పష్టం చేశారు. రాష్ట్రంలోనే కాదు దేశంలో కాంగ్రెస్, బీజేపీని ఎదుర్కొనే సత్తా ఒక్క బీఆర్ఎస్కే ఉన్నదని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చెందిన ముగ్గురు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలను ఓడించింది బీఆర్ఎస్ పార్టీయేనని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత గులాబీ సైనికులపై ఉన్నదని అన్నారు. బీఆర్ఎస్ను దెబ్బతీయాలని కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయ్యాయని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిసొచ్చిన తెల్లారే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నిర్వహణ తీరులో మార్పు వచ్చిందని చెప్పారు. ఆ రెండు పార్టీలు కుమ్మక్కుతోనే రెండు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు వేర్వేరుగా జరిగేలా నోటిఫికేషన్ జారీ అయ్యిందని అన్నారు. ఎమ్మెల్సీ ఉపఎన్నికల తీరుపై హై కోర్టుకు వెళితే నిరాశ మిగిలిందని తెలిపారు.
బీజేపీ మతాన్ని రాజకీయం కోసం వాడుకుంటున్నదని ధ్వజమెత్తారు. తాము యాద్రాద్రి అక్షింతలను నల్లగొండ, భువనగిరిల్లో పంచితే గెలిచే వాళ్లమేమోనని అభిప్రాయపడ్డారు. బీజేపీ వాళ్లు పొలిటికల్ హిందువులు అయితే కేసీఆర్ మతాన్ని మతంగా చూసే హిందువు అని స్పష్టం చేశారు. సమావేశంలో మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఉమా మాధవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, గాదరి కిశోర్‌కుమార్, గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్‌రెడ్డి, కూచుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్సీ బొడకుంటి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్లు దూదిమెట్ల బాలరాజు, మేడే రాజీవ్‌సాగర్, పల్లె రవికుమార్ సహా భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.
పార్టీని అన్ని స్థాయిల్లో సంస్థాగతంగా నిర్మిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి పార్టీ కమిటీలు, అనుబంధ కమిటీలను వేసి శిక్షణ తరగతులు నిర్వహిస్తామని అన్నారు. ఇక నుంచి పార్టీలో క్రమశిక్షణారాహిత్యానికి చోటులేదని తేల్చిచెప్పారు. ఎంత పెద్దవారైనా సరే పార్టీ నియమావళికి విరుద్ధంగా ప్రవర్తిస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే చుట్టూ పార్టీ కాకుండా, పార్టీ చుట్టే ఎమ్మెల్యే తిరిగే విధానం రాబోతున్నదని వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రేస్ పార్టీ ఇచ్చింది ఆరు గ్యారెంటీలే కాదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, యువత డిక్లరేషన్లలో మొత్తం 420 హామీలున్నాయని కేటీఆర్ పునరుద్ఘాటించారు. నిరుద్యోగభృతి, పాలమూరు-రంగారెడ్డి జాతీయ హోదా వంటి హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే నాలుక మడతేసిందని విమర్శించారు. రైతుబంధు రాక, కరెంటు కోతలతో ప్రజలు ఆ పార్టీపై అసహనంతో ఉన్నారని చెప్పారు. సరిపడా బస్సులు లేక మహిళా ప్రయాణికులు, గిరాకీ లేక ఆటోడ్రైవర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఉదహరించారు. ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డి రైతు రుణమాఫీ, పింఛన్ల పెంపుపై నిర్దిష్టమైన తేదీలు ప్రకటించినందునే తాము గడువును గుర్తు చేస్తున్నామని తెలిపారు. గడువులోపల హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ నేతలను ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.