KTR | హైదరాబాద్ : తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మొదటి రోజే ఇంత భయపడితే ఎట్ల..? మంత్రులు ఉలిక్కి పడటం సరికాదు అని కేటీఆర్ అన్నారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
పదేండ్లు విధ్వంసం జరిగిందన్నారు. మరి 50 ఏండ్ల విధ్వంసం గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. జీవన విధ్వంసం చెప్పాలి. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి పేరు ప్రస్తావించారు. గత ముఖ్యమంత్రుల పేర్లు తీసుకున్నారు. పొన్నం ప్రభాకర్ ఏపీ చరిత్ర మాట్లాడొద్దు అంటారు. పాపం వారి సభ్యుడే వారిని ఇరికిస్తున్నారు. వాస్తవాలు చెప్పాలి కదా..? సాగునీరు, తాగునీరు, కరెంట్ ఇవ్వలేని అసమర్థత గురించి చెప్తే ఉలికిపాటు ఎందుకు..? అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది మొదటి రోజు. మొదటి రోజే ఇంత భయపడితే ఎట్ల సర్.. ఒక్కోక్క మంత్రి లేచి ఉలిక్కి పడి మాట్లాడుతున్నారు. నిర్మాణాత్మకమైన సూచనలు తప్పకుండా చేస్తాం. కొత్త ప్రభుత్వం వచ్చింది తొందరపడకండి.. ఒక మూడు నెలలు సమయమిద్దాం.. ఎట్లాగు అట్టర్ ప్లాప్ అయితారు. కానీ మూడు నెలలు సమయం ఇద్దాం అని కేసీఆర్ చెప్పారని కేటీఆర్ తెలిపారు.
ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలనలో బొంబాయి, బొగ్గు బాయి, దుబాయి ఆనాడు ఇదే కదా..? ఇదే దుస్థితి. ఇందిరమ్మ రాజ్యం అంటే ఆకలి చావులు, గంజి కేంద్రాలు, ఎన్కౌంటర్లు ఉండే. ఆ రోజుల్లో ప్రాజెక్టులు.. పైసలు తరలించుకుపోయినా ఆంధ్రాకు మౌనంగా హారతి పట్టింది ఇదే కాంగ్రెస్ నాయకులు కదా..? ఆనాడు తెలంగాణ కోసం రాజీనామాలు చేస్తుంటే.. పదవుల కోసం పెదవులు మూసుకున్నది ఎవరు..? ఇదే సభలో తెలంగాణ పదం నిషేధిస్తే ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా మాట్లాడిండా..? కిరణ్ కుమార్ రెడ్డి ఒక్క రూపాయి ఇవ్వనంటే ఒక్క మాట మాట్లాడలేదు. ఇవాళేమో బాగా మాట్లాడుతున్నారు. పదవుల కోసం పెదవులు మూసిన చరిత్ర కచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులదే. ఇందులో రెండో అభిప్రాయం అవసరం లేదు అని కేటీఆర్ స్పష్టం చేశారు.
2014, జూన్ 25 అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు గుర్తు చేశారు కేటీఆర్. నేను చదువుకోవడానికి హైదరాబాద్లో ఉంటే నా తండ్రి గాను చరిపోతే మా గ్రామానికి పోయాను. పద్ధతి ప్రకారం దహనసంస్కారాలు అయిన తర్వాత స్నానం చేసి ఇంటికి పోవాలి. ఎండాకాలం వస్తే ఏ బావిలో రోజుల తరబడి ఈత కొట్టినమో ఆ బాయి ఎండిపోయింది. బోరు దగ్గరికి పోయి స్నానం చేద్దామంటే కరెంట్ లేదు. నాకున్న పరిచయాలతో కరెంట్ వేయిస్తే బోర్ల నుంచి నీళ్లు వస్తలేవు. స్నానం చేయాల్సిన సమయంలో నెత్తిమీద నీళ్లు చల్లుకొని ఇంటికి వచ్చాం. తెలంగాణ ప్రాంతం నిర్లక్ష్యం కావడానికి కారణం కాంగ్రెస్ పాలకులన్న విషయం ఇప్పుడు అర్థమైంది. ఇది రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు అని కేటీఆర్ గుర్తు చేశారు.
దాచేస్తే దాగని సత్యాలు ఇవి. ఇంత ఆవేశం ఎందుకు భట్టి అన్న.. నిమిషానికోసారి డిస్టర్బ్ చేయొద్దు. ఇందిరమ్మ పాలన గురించి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఇంకా చాలా ఉన్నాయి చెప్పమంటే చెప్తాను. ఇందిరమ్మ పాలన అంటే 1984 వరకు ఉండే. ఇందిరమ్మ రాజ్యం తెచ్చినం అంటే.. ఆ పాలన గురించి గుర్తు చేయాలి కదా..? గంజి కేంద్రాలు, కరెంట్, నిర్బంధాలు, నియంతృత్వం, ఎమర్జెన్సీ రోజులు, ఎన్కౌంటర్లు, ముల్కీ రూల్స్ ఎట్ల తుంగలో తొక్కారో గుర్తు చేయాలి. తాగునీళ్లు లేని విషయాన్ని గుర్తు చేయాలి.
రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిని గుర్తు చేసినప్పుడు తప్పకుండా మేం అన్ని చెప్పాలి. పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తీసుకుపోతుంటే హారతి పట్టిన వారి సంగతి చెప్పాలి. హంద్రీనీవాకు హారతి పట్టిన సంగతి చెప్పాలి. తెలంగాణకు అన్యాయం చేసిన వారి గురించి చెప్పాలి. ఇందిరమ్మ పేరు అవసరం ఉన్నప్పుడు తలుచుకుంటే ఎట్ల..? అని కేటీఆర్ ప్రశ్నించారు.
చరిత్ర దాచేస్తే దాగదు. ప్రగతి భవన్కు పోయి కేసీఆర్ పేరు మీద మట్టి పూయగానే చరిత్ర మరుగున పడిపోదు. తప్పకుండా వాస్తవాలు వాస్తవంగానే ఉంటాయి. వాస్తవం ఏందంటే 50 ఏండ్ల గోస తర్వాత కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు కేసీఆర్ తెలంగాణకు.. తెలంగాణ తల్లి దాస్య శృంఖలాలు తెంచిన వ్యక్తి కేసీఆర్. మార్పు మొదలైంది నిర్బంధం పోయింది అని నిన్న అన్నారు. జూన్ 2, 2014న నాడు దాస్య శృంఖలాల నుంచి విముక్తి పొందింది తెలంగాణ అని కేటీఆర్ గుర్తు చేశారు.