హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): ‘రేవంత్‌రెడ్డి కూర్చున్న సీటు విలువ ఏంది? కూస్తున్న కూతలేంది? ప్రజావేదికలపై ఆయన మాట్లాడే భాష తీవ్ర అభ్యంతరకరం గా ఉన్నది’ అని బీఆర్ఎస్ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కావాలనే సీఎం రేవంత్ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శనివారం ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణను తెచ్చిన, దేశంలోనే ఉన్నతంగా తీర్చిదిద్దిన కేసీఆర్ చావును కోరుకునే వ్యక్తి సీఎం సీట్లో కూర్చున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ పేరు లేకుండా రేవంత్ ఉపన్యాసమే ఉండటం లేదని విమర్శించారు. ఆయన మాట్లాడే భాషను కనీసం గల్లీ లీడర్ కూడా మాట్లాడరని పేర్కొన్నారు. తెలంగాణ ప్రతిష్ఠనే ఆయన నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. ఆరు గ్యారెంటీలను అమలు చేసేదాకా కాంగ్రెస్ సర్కార్‌ను వదలబోమని హెచ్చరించారు.
రివేంజ్రెడ్డిగా మారిన రేవంత్: దాసోజు
సీఎం రేవంత్‌రెడ్డి రివేంజ్డ్రెడ్డిగా మారారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ విమర్శించారు. ఆయనతో కాంగ్రెస్ కా ర్యకర్తలూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. యాదాద్రి లక్ష్మీ నరసింహాస్వామి.. రేవంత్‌రెడ్డితో నిజం చెప్పించారని, అందుకే ‘నేను ప్ర జల కోసం సీఎం కాలేదని, పగ కోసం సీఎం అయ్యాను’ అని రేవంత్‌రెడ్డి బహిరంగ సభలోనే చెప్పారని తెలిపారు. పగతో, కక్షతో పాలన చేస్తున్న రేవంత్‌రెడ్డికి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదని ధ్వజమెత్తారు. కేసీఆర్ మానసికంగా చాలా గట్టివాడని, ఆయన తిరిగి ప్రజల్లోకి వస్తారని తెలిపారు. రాష్ర్టానికి పట్టిన చీడపురుగు రేవంత్‌రెడ్డి అని, అచ్చం ఫ్యాక్షనిస్టులా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ అంటే భయం?: గొంగిడి
బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎందుకంత భయమని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ప్రశ్నించారు. తుర్కపల్లిలో సీఎం సభ జరిగితే.. ఆలేరు నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నేతలందరినీ ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. ఆ సభలో రేవంత్ పచ్చిఅబద్ధాలు మట్లాడారని దుయ్యబట్టారు. 2015లోనే కేసీఆర్ వైటీడీఏ ఏర్పాటు చేశారని, ఆయన కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు నుండే గంధమళ్లకు నీళ్లు వస్తున్నాయని తెలిపారు. 2023లోనే యాదగిరిగుట్టలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు జీవో వచ్చిందని ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు. అయి నా ఏడాది క్రితం రేవంత్‌రెడ్డి కొడంగల్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేశారని ఆరోపించారు.