Hyderabad | కొండాపూర్, సెప్టెంబర్ 12 : ఉదయం పదకొండున్నర గంటలు.. రద్దీగా ఉన్న హైదరాబాద్ నగర రహదారులు.. 20 వరకు తెల్లటి ఇన్నోవా వాహనాలు.. వాటికి ముందు ఉన్న వాహనాల్లో ఇన్నోవాలను చిత్రీకరిస్తూ కెమెరాలు.. ఫుట్‌బోర్డులపై నిలబడి చేతులు ఊపుకుంటూ… కోపంగా చూస్తూ.. ఎనిమిది జంక్షన్లను ఎలాంటి ట్రాఫిక్ జాం లేకుండా దాటుకుంటూ వెళ్తున్న వాహన శ్రేణిని ఆశ్చర్యంగా చూస్తున్న వాహనదారులు.. ఇదేదో… తెలుగు ఫ్యాక్షన్ సినిమాలో సన్నివేశం అనుకుంటున్నారా? ఇదంతా హైదరాబాద్ నడిబొడ్డున శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఆయన కుమారుడు పృథ్వీతో పాటు అనుచరగణం గురువారం చూపించిన ఆంధ్రా ఫ్యాక్షనిజం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మీద దాడి చేసేందుకు వేసుకున్న భారీ స్కెచ్. కూకట్పల్లి వివేకానందనగర్ నుంచి 9 కిలోమీటర్ల దూరంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ వరకు లక్షలాది మంది నిశ్చేష్టులై ఈ భయానక దృశ్యాలను చూశారు. వాహన శ్రేణికి ఇబ్బంది కలగకుండా 8 జంక్షన్లలో సిగ్నల్ ఫ్రీతో సైబరాబాద్ పోలీసులు సహకరించడంతో 20 నిమిషాల్లోనే కొండాపూర్‌లోని కౌశిక్‌రెడ్డి నివాసం కొల్ల లగ్జరీ విల్లాస్‌కు వాహనాలన్నీ చేరుకున్నాయి. పోలీసులు అడ్డుకున్నట్టుగా ప్రయత్నించగానే.. కొందరు గేటు ఎక్కడం, మరికొందరు గేటును తన్నుకుంటూ లోపలికి వెళ్లారు. అరికెపూడి పృథ్వీ, అనుచరులు కౌశిక్‌రెడ్డి విల్లా దగ్గరికి వెళ్లి పథకం ప్రకారం సంచుల్లో తెచ్చుకున్న టమాటాలు, కోడిగుడ్లను కౌశిక్‌రెడ్డి, ఆయన ఇంటిపై విసిరారు. ఇంటి ముందు ఉన్న పూలకుండీలను ధ్వంసం చేసి, రాళ్లతో ఇంటి అద్దాలను పగులగొట్టారు. కౌశిక్‌రెడ్డి, ఆయన పక్కన ఉన్న బీఆర్ఎస్ నాయకులపైనా రాళ్లు విసిరారు. 2 గంటల పాటు బీభత్సాన్ని సృష్టించిన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.
బీఆర్ఎస్ పార్టీ నుంచి శేరిలింగంపల్లి నుంచి గెలుపొందిన గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ప్రతిపక్షాలకు ఇవ్వాల్సిన పీఏసీ (పబ్లిక్ అకౌంట్ కమిటీ) చైర్మన్ పదవికి ఎన్నికవడం.. తాను బీఆర్ఎస్లో ఉన్నానని ఎమ్మెల్యే గాంధీ చెప్పారు. దీంతో హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, గాంధీ ఇంటికి గురువారం ఉదయం 11 గంటలకు వచ్చి గులాబీ కండువా కప్పి, ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తానని ప్రకటించారు. దీంతో సైబరాబాద్ పోలీసులు ఉదయమే కౌశిక్‌రెడ్డి ఉంటున్న కొండాపూర్ కొల్ల లగ్జరీ విల్లాస్ ఉన్న గేటెడ్ కమ్యూనిటీకి చేరుకొని.. కౌశిక్‌రెడ్డిని గృహ నిర్బంధం చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తానే 12 గంటలకు కౌశిక్‌రెడ్డి నివాసానికి వెళ్తానని ముందుగానే ప్రకటించారు. గాంధీ వస్తే తాను సాదరంగా ఆహ్వానించి, భోజనం పెట్టి తెలంగాణభవన్‌కు వెళ్లి ప్రెస్‌మీట్ నిర్వహించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వద్దకు వెళ్తామని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి స్వాగతించారు.
గేటెడ్ కమ్యూనిటీ లోపలికి వెళ్లాలంటే లోపల ఉన్నవారి అనుమతి ఉంటేనే సెక్యూరిటీ అనుమతిస్తారు. పైగా ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని గృహ నిర్బంధం చేసిన దరిమిలా ఆయన ఇంటి ముందుతో పాటు గేటెడ్ కమ్యూనిటీ ప్రధాన గేటు వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. ఎమ్మెల్యే గాంధీ, ఆయన అనుచరులను సులువుగా పోలీసులు నియంత్రించే అవకాశాలు ఉన్నా.. ప్రధాన గేటు వద్దకు వచ్చాకే పోలీసులు అడ్డుకున్నట్టుగా ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే గాంధీ కొడుకు అరికెపూడి పృథ్వీ, అనుచరులు ప్రధాన గేటుపైకి ఎక్కినా పోలీసులు అడ్డుకోకపోవడంతో సులువుగా లోపలికి వెళ్లిపోయారు. ఆపై ఎమ్మెల్యే గాంధీ ఒకచోట కూర్చుని మీడియాతో కౌశిక్‌రెడ్డిని బూతులు తిట్టుకుంటూ ఉండిపోయారు. పోలీసులు ఆయన చుట్టూ మోహరించారు. ఈలోగా మూడు వాహనాలు గేటుదాటి లోపలికి వచ్చినా పోలీసులు అడ్డుకోలేదు. దీంతో పృథ్వీ, గాంధీ అనుచరులు తాము ముందుగా వాహనాల్లో ఉంచిన సంచులు, కర్రలు, కత్తులు బయటికి తీశారు. పోలీసుల కండ్ల ముందే ఇదంతా జరుగుతున్న ఎవరూ అడ్డుకోలేదు. పృథ్వీ, కొంతమంది అనుచరులు కౌశిక్‌రెడ్డి నివాసం విల్లా-61 వైపు పరుగులు పెట్టి కర్రలు, రాళ్లు, కోడిగుడ్లు, టమాటలతో కౌశిక్ ఇంటిపై దాడి చేశారు. గేటు తాళాలు విరగొట్టారు. ఇంట్లోకి దూసుకెళ్లారు. పనివాళ్లను విచక్షణారహితంగా కొట్టారు.
వాస్తవానికి అరికెపూడి గాంధీని గేటెడ్ కమ్యూనిటీ బయటనే పోలీసులు నియంత్రించే వీలుంది. అంతమేర బలగాలు ఉన్నాయి. కానీ లోపలికి అనుమతించి కండ్ల ముందు దాడి జరిగినా ప్రేక్షకపాత్ర వహించారు. ఎమ్మెల్యే గాంధీ కుమారుడు పృథ్వీ, అనుచరుల దాడి ప్రణాళిక పూర్తయ్యాక ఎమ్మెల్యే గాంధీ.. కౌశిక్‌రెడ్డి ఇంటి వైపునకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పుడు పోలీసులు ఆయన్ని ఎత్తుకుని పోలీసు వాహనంలోకి నార్సింగి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం గాంధీ అనుచరులు అక్కడి నుంచి తమ వాహనాల్లో వెళ్లిపోయారు.
కాంగ్రెస్ కార్యకర్తల రాళ్లదాడిలో కౌశిక్ ఇంటి అద్దాలు, పూలకుండీలు, గేటు ధ్వంసమయ్యాయి. ఇంట్లో అద్దాలు పగిలిన గదిలో ఇటీవల గుండె అపరేషన్ జరిగిన కౌశిక్ మామ కృష్ణారెడ్డి ఉన్నారు. ఈ దాడితో ఆయన తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో మళ్లీ అనారోగ్యం పాలయ్యారు. కాంగ్రెస్ కార్యకర్తల రాళ్లదాడిలో ఆయనకు తృటిలో ప్రమాదం తప్పింది. కౌశిక్‌రెడ్డి ఇంట్లో పని చేస్తున్న ఇద్దరు మహిళలపైనా దాడి చేశారు. దాడి చేసిన వారి చేతుల్లో కర్రలు, కత్తులు ఉన్నాయని లక్ష్మి అనే మహిళ మీడియాకు తెలిపారు. రెండు గంటల పాటు కౌశిక్‌రెడ్డి ఇంటి వద్ద గాంధీ అనుచరులు హంగామా సృష్టించారు. అప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు ఈ విషయాన్ని తెలుసుకొని కౌశిక్‌రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు.
కొండాపూర్‌లోని కౌశిక్‌రెడ్డి నివాసానికి వెళ్లే ముందే ఎమ్మెల్యే గాంధీ, ఆయన అనుచరులు భారీ స్కెచ్ వేసుకున్నారు. భారీ సంఖ్యలో వాహనాలు, సంచుల్లో రాళ్లు, టమాటాలు, కోడిగుడ్లు నింపుకుని… కౌశిక్‌రెడ్డి నివాసానికి 12 గంటలకు చేరుకునేలా ప్రణాళిక రూపొందించుకొన్నారు. కూకట్పల్లి వివేకానందనగర్‌లోని గాంధీ నివాసం నుంచి 20 వాహనాల్లో బయలుదేరారు. మీడియా చిత్రీకరిస్తుండగానే సినిమా ైస్టెల్లో గాంధీ ఉన్న వాహనంతో పాటు మరికొన్ని వాహనాలపై అనుచరులు ఫుట్‌బోర్డుపై నిలబడి చేతులు ఊపుతూ, హెచ్చరికలు చేస్తూ కదిలారు. వివేకానందనగర్ నుంచి కొండాపూర్ కౌశిక్‌రెడ్డి నివాసం వరకు 9 కిలోమీటర్ల దూరంగా ఉండగా.. మధ్యలో 8 జంక్షన్లు ఉన్నాయి. ఇది ఐటీ కారిడార్ కావడంతో భారీ ఎత్తున ట్రాఫిక్ ఉంటుంది. కానీ ఎక్కడా గాంధీ వాహన శ్రేణి ఆగకుండా సాఫీగా కొండాపూర్ వరకు వెళ్లిందంటే ట్రాఫిక్ పోలీసులకున్న ముందస్తు సమాచారం, ఆదేశాల ప్రకారం ఫ్రీ సిగ్నల్ ఇచ్చినట్టుగా స్పష్టమవుతుంది.