హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న పది మంది ఎమ్మెల్యేలు ఎన్నిచేసినా తప్పించుకోలేరని, ప్రజల దృష్టిలో వారంతా దొరికిపోయిన దొంగలు అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జీ జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ‘రేవంత్‌రెడ్డి మూటలతో దొరికి తప్పించుకున్నరు.. మేము తప్పించుకోలేమా? అని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనుకుంటున్నరు. ఇకడ తప్పించుకున్నా కోర్టు ముందు వీరు తప్పించుకోలేరు. వీరి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయం. వారికి రాజకీయ భవిష్యత్తు లేకుండా ప్రజలు తీర్పు చెప్పడం ఖాయం’ అని హెచ్చరించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, కాలె యాదయ్య, తెల్లం వెంకట్రావ్, గూడెం మహిపాల్‌రెడ్డి, డాక్టర్ సంజయ్ స్పీకర్‌కు ఇచ్చిన సమాధానాలపై అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ ఉపేందర్‌రెడ్డికి సోమవారం బీఆర్ఎస్ తరఫున పార్టీ ఎమ్మెల్యేలు జీ జగదీశ్‌రెడ్డి, కేపీ వివేకానంద, చింతా ప్రభాకర్ రీజాయిండర్లు అందజేశారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ… పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కొంతమంది ఎమ్మెల్యేలు తాము అమాయకులమని, కేసీఆర్‌పై నమ్మకం ఉన్నదని, పార్టీ మారలేదని స్పీకర్‌కు వివరణ ఇచ్చినట్టు పేర్కొన్నారు.
దీనిపై తమకు పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానాన్ని పంపిస్తూ మూడు రోజుల్లోనే సమాధానం ఇవ్వాలని స్పీకర్ స్పష్టంచేశారని వెల్లడించారు. స్పీకర్ గడువు ఇచ్చిన మూడు రోజుల్లోనే పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిన విధానం, ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే, మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్తోకలిసి కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆ పార్టీ గెలుపు కోసం మీడియాలో ప్రకటనలు ఇచ్చిన విధానాలను రిజాయిండర్లలో పేర్కొన్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆడియో, వీడియో, ఫొటో ఆధారాలను సమర్పించినట్టు వివరించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదంటూ స్పీకర్‌కు వివరణ ఇచ్చిన తరువాత కూడా కాంగ్రెస్ పార్టీ సభలు, సమావేశాల్లో పాల్గొన్నారని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానికసంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేద్దామని పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారని గుర్తుచేశారు. దీనికి ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ‘నా నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయంటే చర్చించడానికి సీఎం మా ఇంటికి వచ్చారని పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మరి శ్రీనివాస్‌రెడ్డికి కేసీఆర్‌పై నమ్మకం ఉంటే కేసీఆర్ ఫొటో, కేసీఆర్ కండువా ఉండాలి కదా? ఎందుకు లేదు. అభివృద్ధి కోసం సీఎంను కలిసిన పోచారం.. ఆ తర్వాత రాహుల్‌గాంధీ, మహేశ్ కుమార్‌గౌడ్‌ను ఎందుకు కలిశారు?’ అని జగదీశ్‌రెడ్డి నిలదీశారు.
వ్యక్తిగత ప్రయోజనాల కోసం పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి ఇప్పుడు బుకాయిస్తున్నారని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. తాము తప్పుచేసి పార్టీ మారామని నియోజకవర్గ ప్రజల ముందు ఒప్పుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాను నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్తే సడెన్‌గా సీఎం కండువా కప్పారంటూ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చెప్తున్నారని, మరి ఆ తర్వాత సంజయ్ ఒక దినపత్రికకు ఇచ్చిన ప్రకటనల్లో కాంగ్రెస్ నేతల ఫొటోలు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. గాంధీభవన్, కాంగ్రెస్ పార్టీ మీటింగ్‌ల్లో పాల్గొంటే అభివృద్ధి ఎట్లా అవుతుందని నిలదీశారు. స్పీకర్ నుంచి నోటీసులు వచ్చాక తాము పార్టీ మారలేదంటూ కేసీఆర్ దగ్గరకు వచ్చిన వివరణ ఇవ్వాల్సిన పది మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దగ్గరకు ఎందుకు వెళ్లారని నిలదీశారు. పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యే ఎన్ని బొంకినా, ఎన్ని సుద్దులు చెప్పినా తప్పించుకోలేరని జగదీశ్‌రెడ్డి హెచ్చరించారు. పదిచోట్ల ఉప ఎన్నికలు రావడం ఖాయమని, వారికి రాజకీయ భవిష్యత్తు లేకుండా ప్రజలు బుద్ధిచెప్పడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తెచ్చేందే కాంగ్రెస్ పార్టీ అని, చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు కోర్టు ఇచ్చిన గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని కోరారు. పదిమంది ఎమ్మెల్యేలు గడ్డిపోచను పట్టుకుని వరద నుంచి బయటపడాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. వాళ్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాదని, పార్టీకి ద్రోహం చేశారంటూ పిటీషన్ ఇచ్చామని, పదిమంది ఎమ్మెల్యేలపై చర్యలు త్వరగా తీసుకోవాలని కోరారు.
పార్టీ ఫిరాయించిన మొత్తం పది మంది శాసనసభ్యుల్లో స్పీకర్ నోటీసులకు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ స్పందించకపోవడంతో వారికి రిజాయిండర్లు ఇవ్వలేదని జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్‌పై అనర్హత వేటు వేయాలని పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ కే సంజయ్ విదేశాల్లో ఉండటం వల్ల ఆయన తిరిగి రాష్ట్రానికి వచ్చిన తర్వాత మూడు నాలుగు రోజుల్లో వారిద్దరి సమాధానాలపై రిజాయిండర్లు ఇస్తారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఆ లోపు స్పీకర్ నిర్ణయం ఉంటుందని తాము భావిస్తున్నట్టు చెప్పారు.
‘స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి’ అంటూ ఇటీవల పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ తరఫున చేసిన ప్రచారంపై మీడియాలో వచ్చిన వార్తను బీఆర్ఎస్ నేతలు ప్రస్తావిస్తున్నారు. అభివృద్ధి నిధుల కోసం సీఎం రేవంత్‌రెడ్డిని కలిస్తే తప్పేమీ లేదు. కానీ రాహుల్‌గాంధీని, మహేశ్‌కుమార్‌గౌడ్‌ను ఎందుకు కలిశారు? దీనిని ఏమనుకోవాలి? దీనికి ఏం సమాధానం చెబుతారు? అని ప్రశ్నిస్తున్నారు. రాహుల్, మహేశ్‌కుమార్‌ను పోచారం కలిసిన ఫొటోలను విడుదల చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్‌లో నిర్వహించిన మీటింగ్‌కు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ హాజరయ్యారు. మల్లికార్జునఖర్గే, మీనాక్షి నటరాజన్‌తో భేటీ అయ్యారు. ఖర్గే మీటింగ్‌కు జగిత్యాల నుంచి బయలు దేరానంటూ బస్సులో వస్తున్న ఫొటోను ఎక్స్ వేదికగా షేర్ చేశారు. నవ తెలంగాణ పత్రికలో ఫుల్ పేజీ ప్రకటనను సీఎం రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ, ఖర్గే, భట్టి, ఫొటోలతో ఇచ్చారు. గాంధీభవన్‌లో ఖర్గేతో జరిగిన సమావేశంలో సంజయ్ పాల్గొన్నారు’ అని బీఆర్ఎస్ నేతలు గుర్తుచేస్తున్నారు.
పీసీసీ నిర్వహించిన క్రమశిక్షణా కమిటీ సమావేశానికి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా శంషాబాద్‌లో కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ పాల్గొన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడటానికే వీరంతా కాంగ్రెస్‌లో చేరినట్టు పీసీసీ అధ్యక్షుడు చెప్పిన మాటాలు మీడియాలో వచ్చాయి. వీటికి ఏమని సమాధానం చెబుతారని బీఆర్ఎస్ నేతలు నిలదీస్తున్నారు. కాగా, స్పీకర్ నోటీసులకు స్టేషన్‌ఘన్‌ఫూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎందుకు సమాధానం ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు.