Jagadish Reddy | సీఎం రేవంత్‌రెడ్డి ఇకనైనా సోయి తెచ్చుకొని.. ఢిల్లీ పర్యటనలు మానుకొని.. రాష్ట్రంలో కరువు పర్యటనలు చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జి. జగదీశ్‌రెడ్డి హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనంతో వచ్చిన కరువుతో రైతులు అల్లాడిపోతున్నారని.. కరువు పర్యటనలు చేపట్టి వెంటనే రైతులకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులు కరువుపై ఎక్కడ ప్రశ్నిస్తారోననే భయం, ఎక్కడ నీళ్ల కోసం అడ్డుపడతారోననే జంకుతో ఇప్పటికీ వ్యవసాయరంగంపై సమీక్ష చేసేందుకు సీఎం వెనకాడుతున్నారని మండిపడ్డారు. తక్షణమే వ్యవసాయ, సాగునీటి శాఖలపై సమీక్షలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఒకవైపు తాగునీళ్లు లేక ప్రజలు.. సాగునీళ్లు లేక రైతులు అల్లాడిపోతుంటే సోయి లేకుండా కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మానవబాంబులు తయారు చేయడానికి ఉగ్రవాదివా..? పేగులు మెడలో వేసుకొని తిరగడానికి నువ్వేమన్న కసాయోడివా? ముఖ్యమంత్రివా..?’ అని ప్రశ్నించారు. ‘మూడు నెలల అసమర్థ పాలన వల్ల లక్షలాదిమంది రైతుల పేగులను మెడలో వేసుకున్నవ్.. ఆ పాపం ఊరికే పోదు’ అంటూ జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కోరుకున్న మార్పు ముందుకెళ్లడం లేదని.. మూడు నెలల్లోనే అది తిరోగమనంలో పయనిస్తున్నదని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ నేతలు నిస్ప్రయోజనంగా మార్చుతున్న కాళేశ్వరం నుంచి ఇప్పటికైనా రైతులకు సాగునీరు అందించవచ్చని జగదీశ్‌రెడ్డి సూచించారు. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ సర్కారే ఉందని.. అక్కడి ప్రాజెక్టుల నుంచి తెలంగాణకు నీళ్లు తీసుకురావొచ్చని కోరారు. ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి.. అదే ఢిల్లీ పెద్దలతో కర్ణాకట నేతలతో మాట్లాడించి నీళ్లు తెచ్చే దమ్ములేదని అన్నారు. గతంలో రైతులు కేసీఆర్‌పై భరోసా వేశారని.. ఎలాగైనా అన్ని పంటలకు నీళ్లు ఇస్తారనే నమ్మకంతో ఉంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం వారి పంటలను ఎండబెడుతున్నదని అన్నారు. నీళ్లు లేక రైతులు పంటలను పశువుల మేతకు వదిలే దారుణ పరిస్థితులను కాంగ్రెస్ తీసుకొచ్చిందన్నారు. సాగర్ ఎడమకాల్వ ఆయకట్టు ఎండిపోతుంటే నల్లగొండ మంత్రులకు, ముఖ్యమంత్రి సోయిలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఈ దుస్థితి ఉండేదా? అని ప్రశ్నించారు. పంటలపై నాడు తమకొక అంచనా ఉందని, నేటి ప్రభుత్వానికి ముందస్తు అంచనా ఏమీ లేదన్నారు. ఢిల్లీకి ముడుపులు, మూటలు సర్దడంపైనే తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ముందుస్తు ప్రణాళిక ఉందని ఎద్దేవా చేశారు. ప్రధాన పత్రికల్లో కరువుపై రాస్తున్న వార్తలు ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు.
కేసీఆర్ నిర్మించిన బ్రిడ్జీలకు శంకుస్థాపనలు చేయడం, ప్రాజెక్టులకు కొబ్బరి కాయలు కొట్టడం, కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇవ్వడం కాదని.. సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని సవాల్ విసిరారు. కొత్త ప్రాజెక్టులు కట్టకుండా.. ఉన్న ప్రాజెక్టులు నీటికి కొట్టుకుపోతే బాగుండనే దుర్మార్గపు ఆలోచన ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెట్టడం, చిత్రహింసలు పెట్టడం దారుణమని మండిపడ్డారు. మంచినీళ్లు లేవని, సాగునీరు లేక పొలం ఎండిపోయిందని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కేసు పెట్టిస్తావా? అంటూ ప్రశ్నించారు. సీఎం రేవంత్ చర్యల వల్ల గ్రామాల్లో సహా హైదరాబాద్‌కు సైతం తాగునీటి సమస్య రాబోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రిళ్లు కరెంటుతో పాములు, తేళ్లు కుట్టి చనిపోతున్న రైతుల మరణాలతో మార్పు బాగానే మొదలైందని ఎద్దేవా చేశారు. నాడు సీఎం రేవంత్ గురువు చంద్రబాబుతో ఎలాంటి మార్పు మొదలైందో.. నేడు శిష్యుడి పాలనలోనూ అదే మార్పును చూస్తున్నామని అన్నారు. కేసీఆర్ ఒక్క ఆడబిడ్డ కూడా ఇబ్బంది పడొద్దని తాగునీరు ఇస్తే.. కాంగ్రెస్ చేతగాని తనం వల్ల గ్రామాల్లో, పట్టణాల్లోనూ ట్యాంకర్లతో నీటిని తెచ్చుకోవల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ తెచ్చిన కృత్రిమ కరువుపై సోయి తెచ్చుకొని.. ఇకనైనా సమీక్షలు చేయాలన్నారు.