MLA Jagadish Reddy | సూర్యాపేట : అసెంబ్లీ సమావేశంలో తమ సమస్యలను లేవనెత్తాలని ప్రజలు బీఆర్ఎస్ తలుపు తడుతున్నారు అని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తెలిపారు. తప్పకుండా ప్రజా సమస్యలను అసెంబ్లీలో లెవనేత్తి ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఉద్యోగులు భృతి కోసం, నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ కోసం, విద్యార్థినులు స్కూటీ కోసం, రైతులు రుణమాఫీ, రైతు భరోసా, యూరియా, కరెంటు కోతలపై మమ్మల్ని అడగమని అంటున్నారు అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వరదలపై ప్రభుత్వానికి సోయి లేదు. సీఎం పాత పద్ధతుల్లో రోత మాటలు.. మంత్రులకు రివ్యూ చేయాలనే సోయి లేదు. గోదావరి, కృష్ణాలో వందలాది టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తుందని జగదీశ్ రెడ్డి తెలిపారు.
జిల్లా కేంద్రంలోని ఉదయసముద్రంలో నీరు లేదు.. జిల్లా మంత్రి కోమటిరెడ్డికి సోయి లేదు. ఓ వైపు వర్షాలు, మరోవైపు యూరియా కోసం రైతులు పడిగాపులు. కాళేశ్వరం నివేదిక అసెంబ్లీలో పెడితే మాకేం ఇబ్బంది లేదు. అసలు నివేదికను బయట పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
స్థానిక సంస్థల పేరుతో కాంగ్రెస్ మోసం బయట పడింది. మరో డ్రామాకు తెర తీస్తుంది. హైకోర్టు మూడు నెలల టైమ్ ఇస్తే, రెండు నెలలు నిద్రపోయి, ఇప్పుడు హడావుడి చేస్తుంది. ఎన్నికల కమిషన్ దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. ఓ వైపు వర్షాలు, వరదలు వస్తుంటే సమగ్రంగా లేని ఓటర్ లిస్టులు పెట్టి ప్రజల్ని గందరగోళానికి గురి చేస్తున్నారు. అన్ని ఓటర్ లిస్టులను గ్రామాల్లో బహిరంగపర్చాలి. అందరి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలి అని జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు.