MLA Jagadish Reddy | యాదాద్రి భువనగిరి : సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన మంత్రివర్గంపై సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. సాగునీటి విషయంలో సీఎం రేవంత్ సోయి లేకుండా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. మోత్కూరులో మోత్కూరు, అడ్డగూడూరు మండలాల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
నిన్న హుటాహుటిన హెలికాప్టర్లో వెళ్లి మరి సముద్రంలోకి సాగర్ నీళ్లు వదిలారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అదే హెలికాప్టర్లో కన్నెపల్లి పంపు హౌస్ వద్దకు పోయి కాళేశ్వరం మోటార్లు ఆన్ చేస్తే 50 లక్షల ఎకరాలకు నీళ్లు అందించొచ్చు అన్న సోయి జ్ఙానం సీఎం రేవంత్ రెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేదు. సమైక్యాంధ్ర కీలు బొమ్మ రేవంత్ ఆడిస్తున్న నాటకం ఇది. అంతా కావాలని కాళేశ్వరాన్ని ఉనికిలో లేకుండా చేసి, బనకచర్లకు అనుమతులు వచ్చేలా చేసి, చంద్రబాబు రుణం తీర్చుకోవడానికి రేవంత్ చేస్తున్న కుట్ర ఇది అని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు.
తెలంగాణ ద్రోహులు వీళ్ళు.. రేవంత్ ఉత్తమ్ ఇద్దరు ఇద్దరే.. తెలంగాణ రైతులు బాగుంటే ఓర్వడం లేదు. మీకు దమ్ముంటే కాళేశ్వరాన్నీ కేసీఆర్కు ఒప్పజెప్పండీ. నాలుగు రోజుల్లో నీళ్లు ఇచ్చి అన్ని చెరువులు, రిజర్వాయర్లు నింపుతాం, ఎస్సారెస్పీ కింద సాగు నీరు ఇస్తాం. మిస్టర్ రేవంత్ నువ్వు తెలంగాణ ద్రోహివి.. తెలంగాణ రైతులు ఉసురు నీకు తగులుతుందని జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు.