రాష్ట్రంలో 90% రైతులు పండించేది దొడ్డు రకమే. సన్నాల సాగు పెంచండి కానీ దొడ్డు రకానికి ద్రోహం చేయొద్దు. బోనస్ బోగస్ అయ్యింది. సన్నాలను ప్రోత్సహించాలనే సదాశయమే ఉంటే సన్నాలకు వెయ్యి, పదిహేను వందలు బోనస్ ఇవ్వాలి.
-హరీశ్‌రావు
Harish Rao | హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): ‘ఎనిమిది నెలల కాంగ్రెస్ పరిపాలన చూసిన తర్వాత నమ్మి నానపోస్తే పుచ్చిబుర్రలైనట్టుంది. కేంద్ర బడ్జెట్ తెలంగాణకు మొండిచేయి చూపింది. రాష్ట్ర బడ్జెట్లో అభయహస్తం శూన్యహస్తంగా మారింది. వాస్తవిక అంచనాలతో రూపొందించిన బడ్జెట్ అని డబ్బా కొట్టినా, బడ్జెట్ అంచనాలకు, వాస్తవికతకు మధ్య చాలా దూరం ఉన్నది. ఇది ప్రజల బాగోగులే కేం ద్రంగా తయారైన బడ్జెట్ కాదు. రాజకీయం ఎకువ, ప్రజల కోణం తకువ. ఆరు గ్యారెంటీలకు దికులేదు. హామీలు నెరవేరే మార్గం లేదు. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పినట్టు సంపద వల్ల సమర్థత రాదు కానీ, సమర్థత వల్ల సంపద వస్తది. ఈ ప్రభుత్వానికి సమర్థత లేదు. వాస్తవిక అంచనాలు లేవు కనుక ఆశించిన సంపద రాదు. ఫలితంగా ప్రజల సమస్యలు పరిషారం కాబోవనే నిరాశనే బడ్జెట్ మిగిల్చింది’ అంటూ అసెంబ్లీ వేదికగా మాజీ మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను తూర్పారబట్టారు. ఇకనుంచైనా ప్రభుత్వానికి రాజకీయాలు కేంద్రంగా కాకుండా, ప్రజలు కేంద్రంగా ఆలోచించే సద్బుద్ధిని భగవంతుడు ప్రసాదించాలని చురకలంటించారు.
ఇంకెన్ని రోజులు మా పేరు చెప్పుకొంటరు?
ఎనిమిది నెలలుగా రాష్ట్రంలో దశ, దిశ లేని పాలన నడుస్తున్నదని, ఒక పాలసీని కూడా సమగ్రంగా రూపొందించలేదని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. బడ్జెట్లో విజన్ లేదు.. విషయం లేదు, ఇప్పటివరకు సాధించిన ఒక్క విజయం లేదని తూర్పారపట్టారు. ఆర్థిక మంత్రి స్వీపింగ్ కామెంట్స్ చేయడంలో సిద్ధహస్తులని బడ్జెట్ నిరూపిస్తున్నదని ఎద్దేశాచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెందిందని రాసుకొచ్చారని, మరోవైపు ఇదే బడ్జెట్లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3,47,229 అని పేరొన్నారని, ఇదంతా మీ 8 నెలల పాలనలోనే సాధ్యమైందా? అని నిలదీశారు. 2014లో తలసరి ఆదాయంలో 11వ స్థానంలో ఉన్న తెలంగాణను పదేండ్లలో నంబర్ 1 స్థానానికి చేర్చిన ఘనత బీఆర్ఎస్దేనని గుర్తుచేశారు. నాలుగున్నర లక్షలు లేని జీఎస్డీపీని పద్నాలుగన్నర లక్షలపైకి తీసుకుపోయింది బీఆర్ఎస్సేనని, 2014లో దేశ జీడీపీలో తెలంగాణ కాంట్రిబ్యూషన్ 4.1%ఉండగా, పదేండ్లలో 5 శాతానికి దూసుకుపోందని, కోటి 7 లక్షల టన్నులున్న పంటల ఉత్పత్తి, నేడు 4 కోట్ల టన్నులకు పెరిగిందని, ఏమీ చెయ్యకుండానే ఇదంతా ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు.
ప్రజల జ్ఞాపకాల్లో స్వర్ణయుగాన్ని చెరపలేరు
తెలంగాణ వృద్ధిని నీతి ఆయోగ్ కుండబద్ధలు కొడితే.. అనుకున్నంత పురోభివృద్ధి సాధించలేదంటూ కాంగ్రెస్ చేసే ప్రచారం ముందు గోబెల్స్ కూడా పనికిరాడని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో తెలంగాణ పల్లెలు టాప్ 20లో 19 గెలుచుకున్నాయని గుర్తుచేశారు. ఆ అద్భుత ప్రగతి ప్రజలకు అందుబాటులో లేకుండా చేయాలని పబ్లిక్ డొమైన్లో ఉన్న మొత్తం సమాచారాన్ని డిలీట్ చేశారని, అంతకంటే చిల్లర వ్యవహారం ఇంకొకటి ఉండదని దుయ్యబట్టారు. ‘ముఖ్యమంత్రి గారూ, మీరు కంప్యూటర్ మెమొరీ నుంచి డిలీట్ చేయగలరు గానీ.. ప్రజల మెమొరీలోంచి డిలీట్ చేయలేరు. అక్షరాలను మలిపేస్తరు గానీ, అనుభవాలను మలిపేయలేరు’ అంటూ చురకలంటించారు.
21,636 కోట్ల గ్రాంట్స్ ఎలా వస్తాయి?
సెంట్రల్ గ్రాంట్స్ విషయంలోనూ ఆర్థిక మంత్రి అంచనాలు తప్పాయని హరీశ్‌రావు పేర్కొన్నారు. తొమ్మిదేండ్లుగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూ.9-10 వేల కోట్ల కంటే ఎకువ రావడం లేదని చెప్పినవారే ఇప్పుడు రూ.21,636 కోట్లు వస్తుందని ఎట్ల పెట్టారని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో సీఎస్ఎస్ కింద దేశం మొత్తానికి రూ.45 వేల కోట్లు కేటాయించినప్పుడు, ఒక తెలంగాణకు రూ.12 వేల కోట్లు ఎట్ల ఎకువ వస్తదని ప్రశ్నించారు. ఈ ఏడాది అదనంగా రూ.26,383 కోట్ల ట్యాక్స్ రెవెన్యూ వస్తుందని చూపించారని, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా నిరుటి కంటే సుమారు రూ.4 వేల కోట్లు అధికంగా రాబోతున్నదని చెప్పారని, దేశవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కొనసాగుతున్న సందర్భంలో అది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ప్లాట్ లేదా వ్యవసాయ భూమి కొనుగోలు చేసే పేద, మధ్య తరగతిపై రూ.4 వేల కోట్ల అధిక భారం వేస్తున్నట్టు స్పష్టమైపోతున్నదని విమర్శించారు. ఏయే ఫీజులు పెంచుతున్నారో సభకు చెప్పాలని డిమాండ్ చేశారు.
మద్యం విషయంలో సిగ్గు పడాలె
రాష్ట్రంలో ఎక్సైజ్ ఆదాయాన్ని అదనంగా రూ.7,700 కోట్లుకు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచించడం సిగ్గు చేటని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘2023-24 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం రూ.19,884 కోట్ల ఆదాయాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టుకుంటే, 2024-25కు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.25,617 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసిందని, అంటే, 5,773 కోట్లు అదనంగా అంచనా వేసుకున్నారని తెలిపారు. రూ.2,760 కోట్లుగా ఉన్న బీర్లపై డ్యూటీని రూ.3,500 కోట్లకు, లికర్పై ఉన్న డ్యూటీని రూ.11,031 కోట్ల నుంచి రూ.15,500 కోట్లకు పెంచారని, అంటే రాబోయే రోజుల్లో వాటి ధరలు భారీగా పెంచబోతున్నట్టు స్పష్టం చేశారని పేర్కొన్నారు. ఈ ఏడాది ఎక్సైజ్ వ్యాట్‌ను రూ.16,432 కోట్లుగా అంచనా వేయడం ద్వారా రూ.2000 కోట్ల వ్యాట్‌కు సమానమైన మద్యం అమ్మకాలను పెంచబోతున్నట్టు స్పష్టమైందని తెలిపారు. మద్యం అమ్మకాలపై ఒకనాడు రాద్ధాంతం చేసిన వాళ్లే ఇప్పుడు మద్యం అమ్మకం ద్వారా రూ.7,700 కోట్ల అధిక రాబడిని సమకూర్చుకోవాలని అంచనాలు పొందుపరచడం, ఎక్సైజ్, వ్యాట్ కలిపి మొత్తం రూ.42 వేల కోట్లకు ఆదాయం సంపాదిస్తామని చెప్పడంపై నిప్పులు చెరిగారు.
మీ అప్పులు బీఆర్ఎస్ ఖాతాలో వేస్తారా?
బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.6,71,757 కోట్లు అప్పు చేసిందని పదే పదే చెప్తున్నా.. దాంట్లోనూ ప్రభుత్వానికి స్పష్టత లేదని హరీశ్‌రావు మండిపడ్డారు. డిసెంబర్ 23న విడుదల చేసిన శ్వేతపత్రంలో నాలుగు రకాల అప్పులు చూపించారని, అందులో రెండు రకాల అప్పులు ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం లేదని, శ్వేతపత్రంలోనే స్పష్టంచేశారని గుర్తుచేశారు. గవర్నమెంట్ కట్టాల్సిన అవసరం లేని అప్పులు రూ.1,54,876 కోట్లుగా ఉన్నాయని, మిగిలిన రూ.5,16,881 కోట్ల అప్పులో వారసత్వంగా వచ్చిన రూ.72,658 కోట్ల అప్పును తీసివేస్తే నికరంగా రూ.4,44,223 కోట్ల అప్పు మాత్రమే ఉంటుందని స్పష్టంచేశారు. తెలంగాణ ఏర్పడక ముందు ఎస్పీవీ (స్పెషల్ పర్పస్ వెహికిల్స్)ల ద్వారా గత ప్రభుత్వాలు చేసిన అప్పు రూ.11,609 కోట్లు ఉన్నదని, ఇవి కూడా తీసేస్తే.. రూ.4,32,614 కోట్లు మిగులుతుందని నొక్కిచెప్పారు. కానీ, శ్వేతపత్రంలో తెలివిగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో తీసుకున్న రూ.6,115 కోట్ల అప్పును బీఆర్ఎస్ ఖాతాలో జమ చేశారని, అందులోంచి రూ.6,115 కోట్లను తీసేస్తే.. కేవలం రూ.4,26,499 కోట్ల అప్పు మిగులుతుందని వివరించారు.
తొమ్మిదిన్నరేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.4,26,499 కోట్లు మాత్రమే అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ‘ఉదయ్’ అనే సీం తీసుకొచ్చి డిసంల అప్పులను రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేయాలని చట్టం చేయడం వలన, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లను కేంద్రం చెల్లించకపోవడం ఫలితంగా తెలంగాణ అనివార్యంగా రూ.41,159 కోట్ల అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని, అది కూడా తీసివేస్తే అప్పు కేవలం రూ.3,85,340 కోట్లుగా తేలుతుందని వివరించారు. బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి, మూలధన పెట్టుబడి, సంక్షేమాల కోసం నెట్‌గా చేసిన అప్పు రూ.3,85,340 కోట్లు మాత్రమేనని స్పష్టంచేశారు. రైతుల మోటర్లకు మీటర్లు పెట్టి ఉంటే.. కేంద్రం నుంచి వేల కోట్లు వచ్చేవని, కానీ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ ఆపని చేయలేదని చెప్పారు.
అప్పులను ఆస్తులుగా మార్చినం
బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రానికి రూ.లక్షల కోట్ల ఆస్తులను సమకూర్చిందనే వాస్తవాలను కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే తొక్కిపెడుతున్నదని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కాళేశ్వరానికి రూ.94,000 కోట్లతో లక్షల కోట్ల విలువైన ఆస్తులను, మహబూబ్‌నగర్ పెండింగ్ ప్రాజెక్టుల కోసం రూ.4 వేల కోట్లు ఖర్చు చేసి ఆరున్నర లక్షల ఎకరాలకు సాగు నీరు అందించామని, మిషన్ భగీరథకు రూ.28,000 కోట్లు, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ సీంకు రూ.27,554 కోట్లు, సీతారామ ప్రాజెక్టు రూ.8,056 కోట్లు, దేవాదుల ప్రాజెక్టు రూ.6,000 కోట్లు, సమ్మకసాగర్ 2,000 కోట్లు, తుమ్మిళ్ల, భక్తరామదాసు ప్రాజెక్టులు పూర్తి, 8,200 కిలోమీటర్లు ఆర్అండ్బీ డబుల్ లైన్, 321 కి.మీ ఫోర్‌లైన్, 382 బ్రిడ్జిలను బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిందని ఇవన్నీ నాటి ప్రభుత్వం సృష్టించిన ఆస్తులేనని వివరించారు. యాదాద్రి, ఇతర దేవాలయాల కోసం రూ.2,800 కోట్లు, రైతుబంధుకు రూ.72,972 కోట్లు, రైతుబీమాకు రూ.6,800 కోట్లు, రైతు రుణమాఫీకి రూ.29 వేల కోట్లు, ఉచిత కరెంట్‌కు రూ.61 వేల కోట్లు, గొర్రెల పంపిణీకి రూ.5 వేల కోట్లు, ఆసరా పింఛన్లకు రూ.61 వేల కోట్లు, సచివాలయం, కమాండ్ కంట్రోల్ సెంటర్, జిల్లాకు ఒక మెడికల్, నర్సింగ్ కాలేజీ, కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్, వెయ్యి గురుకులాలు వంటివి ప్రభుత్వ ఆస్తులేనని, అవి కేసీఆర్ సృష్టించారని స్పష్టంచేశారు.
సీఎం భాషకు భయపడుతున్న ప్రజలు
ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ప్రతి ద్రోహం కూడా నమ్మకంలో నుంచే పుడుతుంది’ అనే మార్టిన్ లూథర్‌కింగ్ మాటలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రభుత్వం తమ మొదటి వాగ్దానానికి మొదటి అసెంబ్లీ సమావేశంలోనే తిలోదకాలిచ్చి నమ్మకద్రోహాల పరంపరకు నాంది పలికిందని దుయ్యబట్టారు. ‘ఆరు గ్యారెంటీలకు మొదటి అసెంబ్లీ సమావేశంలోనే చట్టబద్ధత కల్పిస్తామని భూమ్యాకాశాలు దద్దరిల్లే విధంగా ప్రామిస్ చేశారని, బాండ్ పేపర్లు రాసిచ్చారని ఎద్దేవా చేశారు. వంద రోజులు కాదు ఎనిమిది నెలలు గడిచిపోయినా ఆరు గ్యారెంటీల్లో 13 హామీల ప్రస్తావన లేదని మండిపడ్డారు. అడుగుదామంటే రాహుల్‌గాంధీ పత్తా లేరని, ముఖ్యమంత్రిని అడుగుదామంటే ఫ్రస్ట్రేషన్లో ‘పేగులు మేడ లో వేసుకుంటా, కనుగుడ్లతో గోటీలాడుతా, లాగుల తొండలు జొర్రగొడుత, పండవెట్టి తొకుత, గోచీ ఊడగొడుతా, లాగులూడగొడుతా…’ ఇలా వారు రాక్షస భాషలో చెలరేగి పొతుంటే సామాన్య ప్రజలకు ఎట్ల అడుగోస్తది?’ అంటూ సీఎం తీరును ఎండగట్టారు.
ప్రతిక్ష నేతలను స్క్రీన్లలో చూపించాలె
పార్లమెంట్లో ప్రతిపక్ష నేతలు మాట్లాడుతుంటే ప్రజలకు చూపించడం లేదని సాక్షాత్తూ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ అంటున్నారని, తెలంగాణలో కూడా కాంగ్రెస్ తమను స్క్రీన్లలో చూపించడం లేదని ప్రజలు తమకు చెప్తున్నారని హరీశ్‌రావు చెప్పారు. రాహుల్‌గాంధీ వారసులుగా ఇక్కడి కాంగ్రెస్ నేతలు తమను కూడా స్క్రీన్లలో చూపించాలని డిమాండ్ చేశారు. ఇందుకు స్పందించిన మంత్రి శ్రీధర్‌బాబు.. ఒక్కసారి కాకపోతే పదిసార్లు చూపిస్తామని అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తక్షణం వేటువేయాలని ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ పాంచజన్యం కోరుతున్నారని, అదే స్ఫూర్తితో తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసే విధంగా ఒత్తిడి తీసుకురావాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కాగా, ఈ అంశంపై అధికార పక్షానికి సంబంధించిన నేతలెవ్వరూ స్పందించలేదు.
రుణమాఫీ వడ్డీలు రైతులే చెల్లిస్తున్నరు..
ప్రభుత్వం డిసెంబర్ 9 రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులను దారుణంగా మోసం చేసిందని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. డిసెంబర్ 9 నాటికే కటాఫ్ తేదీని పెట్టడంతో 8 నెలల వడ్డీని రైతులే చెల్లించి, రుణమాఫీ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. రుణమాఫీ అర్హత నుంచి లబ్ధిదారులను సాధ్యమైనంతగా తొలగించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు. ఆలస్యానికి కారణం ప్రభుత్వమేనని, రైతులు వడ్డీ ఎందుకు చెల్లించాలని నిలదీశారు. రుణమాఫీకి రూ.31వేల కోట్లని చెప్పి, బడ్జెట్లో రూ.5 వేల కోట్లు తకువ కేటాయించారని దుయ్యబట్టారు. రైతుభరోసా అనేది కాంగ్రెస్ ఇచ్చిన రెండో గ్యారెంటీ అని, కానీ, బడ్జెట్లో ఆ భరోసా ఏ కోశాన కనిపించడం లేదని ధ్వజమెత్తారు. రైతుభరోసా కింద ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని చెప్పినా, ప్రస్తుత సీజన్‌కు ఒక రూపాయి కూడా రైతు అకౌంట్లో వేయలేదని, రైతులు అనివార్యంగా ప్రైవేటు రుణాల కోసం చెయ్యి చాచాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. పంచాయతీ ఎన్నికలు వస్తే తప్ప ఇచ్చేట్టు లేరని విమర్శించారు. రైతుభరోసా ఎప్పుడిస్తారో తేల్చిచెప్పాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తామన్న హామిని బకాయిలతో సహా చెల్లించి నిలుపుకోవాలని కోరారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో బోనస్ ఇచ్చే పంటల లిస్టును స్పష్టంగా పేరొని, ఇప్పడేమో కేవలం వరికే, అదీ సన్నాలకు మాత్రమేనని సన్నాయి నొకులు నొకుతున్నారని ఎద్దేవాచేశారు.
కార్డు లేదు.. కాకరకాయ లేదు
ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇస్తామని మ్యానిఫెస్టోలో స్పష్టంగా చెప్పి, ఇప్పుడు కొందరికే అంటున్నారని, అందరికీ కాకపోయినా కనీసం తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికైనా వర్తింపజేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. యువవికాసం కింద విద్యార్థులకు రూ. 5 లక్షల విద్య భరోసాకార్డు ఇస్తామని చెప్పి, ఇప్పటివరకు కార్డు లేదు.. కాకరకాయ లేదు.. ఆ ఊసే ఎత్తడం లేదని ఎద్దేవా చేశారు. పింఛన్ పెంచడం సంగతేమోకానీ, ఇచ్చే రూ.2 వేలు కూడా సక్కగ ఇస్తలేరని, రెండు నెలల పింఛన్లు పెండింగ్‌లో ఉన్నాయని మండిపడ్డారు.
చంద్రబాబే అభివృద్ధిని కొనియాడారు
బీఆర్ఎస్ హాయంలో హైదారాబాద్ అభివృద్ధి కాలేదని బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద జోక్ పేల్చిందని, అది జోక్ ఆఫ్ ద డికేడ్ అని హరీశ్‌రావు అభివర్ణించారు. హైదరాబాద్‌లో తాగునీటి సమస్యను శాశ్వత ప్రాతిపదికన పరిషారం చూపామని స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి గురువు సారీ సహచరుడైన చంద్రబాబునాయుడే ఈ మధ్యనే హైదరాబాద్‌లో జరిగిన ఒక సభలో హైదరాబాద్ ప్రగతిని ప్రశంసించారని, కేసీఆర్ హయాంలో హైదరాబాద్ చాలా అభివృద్ధి జరిగిందని ప్రకటించారని ఉటంకించారు. ప్రత్యర్థులు కూడా ప్రశంసించేలా హైదరాబాద్‌ను అన్ని కోణాల్లో అభివృద్ధి చేశామని, కుట్ర పూరితంగా కాంగ్రెస్ కాదన్న మాత్రాన ఆ అభివృద్ధి అదృశ్యమైపోదని చురకలంటించారు.
లా అండ్ ఆర్డర్ దిగజారిందనడానికి లాఠీచార్జిలే నిదర్శనం
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలోని మొదటి పేజీ చాప్టర్ 1, మొదటి లైన్లోనే ‘పూర్తి స్థాయి ప్రజాస్వామిక పరిపాలన అందిస్తాం‘ అని హామీ ఇచ్చిందని, అంటే ప్రజల భావ ప్రకటనా స్వేచ్చకు, నిరసన తెలియజేసే హకుకు హామీపడతామనే కదా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఆచరణలో అందుకు విరుద్ధంగా ఉన్నదని మండిపడ్డారు. సిటీ సెంట్రల్ లైబ్రరీలో, ఆర్ట్స్ కాలేజీలో అక్రమంగా పోలీసులు చొరబడి గేట్లకు తాళాలేసి విద్యార్థులను నిర్బంధించి, లాఠీలతో వీపులు చిట్ల గొడుతున్నారని, అది చూసి సరస్వతీదేవి కన్నీరు పెట్టుకొని ఉంటదని, లైబ్రరీలో ఉన్న పుస్తకాల రచయితలు, కాళోజీ ఆత్మ ఎంత తల్లడిల్లిందోనని వాపోయారు.
ఓటిచ్చునప్పుడే ఉండాలి బుద్ధి, ఎన్నుకొని తలబాదుకున్ననేమగును’ అంటూ ఒక నిరుద్యోగ విద్యార్థి సోషల్ మీడియాలో కాళోజీ కవిత పెట్టిండంటే, అంత కంటే ఎక్కువ చెప్పేది ఏమీ లేదని వివరించారు. రైతులు ఎరువులు అడిగినా, అంగన్వాడీలు, ఆశ వర్కర్లు రోడ్లెక్కినా లాఠీచార్జీతోనే సమాధానం చెప్తున్నారని, ఇదేనా పూర్తిస్థాయి ప్రజాస్వామ్యం అని నిలదీశారు. లాఠీచార్జీని చిత్రీకరిస్తున్న జర్నలిస్టును సైతం అసభ్య పదజాలంతో బూతులూ తిట్టి, కొట్టడమేనా కాంగ్రెస్ మారు ప్రజాస్వామ్యం? ఇందిరమ్మ పాలన? అని నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష కార్యకర్తలపై ప్రతీకార దాడులు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు, సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టినా బెదిరింపులు, కేసులు పెడుతున్నారని, మొత్తంగా కాంగ్రెస్ తెచ్చిన మార్పు ఎట్లా ఉందంటే విద్యార్థినులకు ఇస్తామన్న సూటీలా లేదని, పోలీసులు విచ్చలవిడిగా ప్రయోగిస్తున్న లాఠీలా ఉన్నదని మండిపడ్డారు. ప్రజల గొంతులు నొకేస్తూ, వీపులు వాయగొడుతూ ప్రజాపాలన అని చెప్పుకోవడం కాంగ్రెస్‌కే చెల్లిందని, ఎమర్జెన్సీ ప్రయోగించిన ఇందిరమ్మ రాజ్యం ఎట్లా ఉండాలనో గట్లే ఉన్నదని ఎద్దేవాచేశారు. పరిషారాలు చూపించని ప్రజావాణి ప్రాధాన్యం కోల్పోయిందని చెప్పారు.
కరెంట్‌పై అసెంబ్లీ బయట సవాల్‌కు సిద్ధమా?
రెండేండ్ల వ్యవధిలో అన్ని రంగాలకు 24 గంటల కరెంట్ ఇచ్చే స్థాయికి తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుపోయిందని హరీశ్‌రావు చెప్పారు. ‘ఐదు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ స్థాపిత విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లు. పురోభివృద్ధి లేదని మీరు చెప్పిన ఒకే ఒక దశాబ్దంలో ఇది 19,483 మెగావాట్లు. ఇందిరమ్మ రాజ్యంలో తలసరి విద్యుత్తు వినియోగం 1,196 యూనిట్లు మాత్రమే. బీఆర్ఎస్ పాలనలో ఇది 2,349 యూనిట్లకు పెరిగింది. ఇదే అసెంబ్లీ ముంగట పది నిమిషాలు నిలబడి వచ్చిపోయేటోళ్లను కరెంట్ సరఫరా బీఆర్ఎస్ పాలనల మంచిగున్నదా? కాంగ్రెస్ పాలనల మంచిగున్నదా అని? అడిగితే, పది నిమిషాలల్ల మొత్తం ఖుల్లంఖుల్ల అయితది’ అంటూ విద్యుత్తు కోతలపై సవాలు విసిరారు.
పది వేల కోట్లు సభకు తెలియకుండా ఎలా తెస్తారు?
కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే రూ.24 వేల కోట్ల విలువైన భూములు అమ్మకానికి పెట్టబోతున్నదని హరీశ్‌రావు విమర్శించారు. నాన్ ట్యాక్స్ రెవెన్యూ విషయంలో ఇది స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. ‘2023-24లో రూ.23,819 కోట్లుగా ఉన్న నాన్‌ట్యాక్స్ రెవెన్యూ.. 2024-25కి రూ.35,208 కోట్లుగా అంటే రూ.11,389 కోట్లు అధికంగా చూపారని, అందులో రూ.10వేల కోట్లు భూముల అమ్మకం ద్వారా వస్తాయని, మరో రూ.14 వేల కోట్లు అడిషనల్ రిసోర్స్ మొబిలైజేషన్ అని చెప్పారని, అసలు ఈ అడిషనల్ రిసోర్స్ మొబిలైజేషన్ అంటే ఏమిటి? అని, అసెంబ్లీకి కూడా చెప్పనంత గోప్యంత ఏమిటని? నిలదీశారు.ఎన్నికల ముందు పీసీసీ చీఫ్‌గా వారసత్వ భూములను అమ్ముడాన్ని ప్రశ్నించిన సీఎం రేవంత్ ఇప్పుడెలా అమ్మకానికి సిద్ధమయ్యారని ప్రశ్నించారు.
పేర్లు మార్చయినా కేసీఆర్ పథకాలు కొనసాగించండి
రాష్ట్ర ప్రభుత్వం పేద మహిళలు, చిన్నారులు, గర్భిణులకు ఉపయోగపడే కేసీఆర్ కిట్ వంటి పథకాలను నిర్దాక్షిణ్యంగా నిలిపివేసిందని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108 వంటివి పేర్లు మార్చకుండా కొనసాగిస్తున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వానికి భేషజాలు ఉంటే పథకాల పేర్లు మార్చుకోండి కాని వాటిని ఆపొద్దని విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యశ్రీకి రూ.1,065 కోట్లు మాత్రమే కేటాయించిందని, రూ.36 కోట్లు తగ్గించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో లాఅండ్ ఆర్డర్ గాడి
తప్పింది. ఎనిమిది నెలల కాలంలోనే 500 మర్డర్ కేసులు, 60 డెకాయిట్ కేసులు, 400 రాబరీలు, 1800
లైంగికదాడి కేసులు ఇలా మొత్తంగా లక్ష కేసులు నమోదయ్యాయి. ఆటో కోసం వెళ్తున్న ఒక యువతిని కారులో ఎక్కించుకుని సామూహిక లైంగికదాడి చేసిన ఉదంతాలు జరిగాయి. ప్రభుత్వం ఇప్పటికైనా లా అండ్ ఆర్డర్‌పై దృష్టి సారించాలి.
-హరీశ్‌రావు
రైతుభరోసా ఎప్పుడిస్తారో తేల్చిచెప్పాలి. వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తామన్న హామీని బకాయిలతో సహా చెల్లించి మాట నిలుపుకోవాలి. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో బోనస్ ఇచ్చే పంటల లిస్టును స్పష్టంగా పేరొన్నారు. ఇప్పడేమో కేవలం వరికే, అదీ సన్నాలకు మాత్రమేనని సన్నాయి నొకులు నొకుతున్నారు.
-హరీశ్‌రావు
నేడు గల్లీకో బెల్ట్ షాపు పెట్టే పరిస్థితి వచ్చింది. ప్రజల రక్తమాంసాలను పీల్చి పిప్పి చేసి వసూలు చేస్తామని చెప్తున్నారు. నాడు బెల్ట్‌షాపులు ఎత్తేస్తామని చెప్పి, నేడు ఆదాయం రూ.42 వేల కోట్లు తెచ్చుకునే ప్లాన్ చేస్తున్నారు. డబ్బులు కావాలంటే ఇంకో ప్రయత్నం చేయండి కానీ.. తెలంగాణలో మందు అతిగా తాగించకండి.
-హరీశ్‌రావు