Harish Rao | నల్లగొండ : కాంగ్రెస్ పార్టీతో ఉన్నది ఇసుక దొంగలు, కాంట్రాక్టర్లు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీతో మాత్రం అసలైన కార్యకర్తలు ఉన్నారని హరీశ్‌రావు స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లా పరిధిలోని చండూరులో నిర్వహించిన రోడ్ షోలో హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు.
భువనగిరి పార్లమెంట్లో గులాబీ జెండా ఎగురబోతుంది. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. కానీ ఆ హామీలు అమలు కాలేదు. అయితే తిట్లు, లేకపోతే ఓట్లు కాంగ్రెస్ పని. మొదటి హామీ నెలకు రూ. 2500 మహిళలకు వేస్తాం అన్నారు. మహిళలకు రూ. 10 వేలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. రెండో హామీ రూ. 15 వేలు రైతు బంధు ఇవ్వలేదు. బీఆర్ఎస్ పార్టీ కరోనా కష్ట కాలంలో ఉద్యోగుల జీతాలు బంద్ పెట్టి రైతులను ఆదుకుంది అని హరీశ్‌రావు గుర్తు చేశారు.
రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీకి అందరి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు. రుణమాఫీ చేయకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి.. ఆయన చేస్తే నేను రాజీనామా చేస్తా. అన్ని హామీలు అమలు చేస్తే నేను రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయను. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కోసం కాంగ్రెస్ కు ఓటయ్యాలా..? ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలి. కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఓడిపోయినా ప్రభుత్వం పడిపోదు. పథకాల అమలుకు బీఆర్ఎస్ గెలవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ధరల పెరుగుదలకు కాంగ్రెస్ కారణం అయ్యింది అని హరీశ్ రావు మండిపడ్డారు.
చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫోర్జరీ సంతకం చేసి సస్పెండ్ అయినందుకు కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చిందా..? అని హరీశ్‌రావు నిలదీశారు. బీసీ బిడ్డ క్యామ మల్లేష్‌ను గెలిపించి బీసీల సత్తా చూపాలి. పడేండ్ల బీజేపీ పాలనలో ఏ ఒక్కరికి న్యాయం జరగలేదు. ధరల పెంపు, జీఎస్టీ, గ్యాస్ ధర పెంపు ఇలా అన్ని వ్యవస్థలు పతనం అయ్యాయి. కాంగ్రెస్ పాలనలో అన్ని బీఆర్ఎస్ పథకాలు మాయం అయ్యాయి. బీఆర్ఎస్ కార్యకర్తలను కోరుతున్నా.. తొమ్మిది రోజులు కష్టపడండి.. వచ్చే ఐదేళ్ళు మీ తరుపున కొట్లాడుతాం అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.