కాంగ్రెస్ సర్కారు చేస్తున్న తప్పులు, అప్పులతో 25 ఏండ్లపాటు రాష్ట్ర ప్రజలు భారం అనుభవించాల్సి వస్తుంది. దీనిపై అఖిలపక్షంలోనైనా, అసెంబ్లీలోనైనా చర్చకు పెడితే పక్కా ఆధారాలు సహా రుజువు చేస్తాను.
గ్రీన్ పాలసీని పక్కకునెట్టి కమీషన్ల కోసం కొత్త పాలసీని కాంగ్రెస్ తెచ్చింది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ సాధించుకుంటే.. ప్రస్తుతం విద్యుత్తు శాఖ మొత్తాన్ని ఆంధ్రా అధికారులతో కాంగ్రెస్ సర్కారు నింపింది. లోకల్ ఉద్యోగాల్లో 95% రిజర్వేషన్లను కేసీఆర్ సాధిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రా అధికారులతో విద్యుత్తు శాఖను నింపింది.
-హరీశ్‌రావు
హైదరాబాద్, డిసెంబర్ 1(నమస్తే తెలంగాణ): ‘30% కమీషన్ల కోసమే కాంగ్రెస్ (Congress) సర్కారు కొత్త థర్మల్ పవర్ప్లాంట్లు (Thermal Power Plant) ఏర్పాటు చేస్తున్నదని, రూ.50వేల కోట్ల కుంభకోణానికి శ్రీకారం చుట్టిందనే ఆరోపణలను పక్కా ఆధారాలతోనే చేస్తున్నామని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) స్పష్టంచేశారు. దీనిపై ఆల్‌పార్టీ మీటింగ్‌లోనైనా, బహిరంగంగానైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. పారదర్శకంగా ముందుకెళ్తున్నామనే నమ్మకం ప్రభుత్వానికి ఉంటే తమ సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. ‘2026 నాటికి థర్మల్ పవర్ ఉత్పత్తిని 40 నుంచి 30 శాతానికి తగ్గిస్తామని శ్వేతపత్రంలో ప్రభుత్వం చెప్పింది నిజంకాదా? థర్మల్ పవర్‌ను పక్కనబెట్టి గ్రీన్ కరెంట్ పాలసీని తీసుకొస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో, అనేక సభల్లో ప్రకటించలేదా? అని ప్రశ్నించారు.
శ్వేతపత్రంలో ఒకలా.. గ్రీన్ పాలసీలో మరోలా.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో ఇంకోలా చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. సోమవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల కరెంట్ అవసరాలను తీర్చేందుకు రామగుండం, పాలేరు, మక్తల్‌లో 800 మెగావాట్ల చొప్పున థర్మల్ ప్లాంట్లను నిర్మిస్తున్నామని పీపీటీలో చెప్పిన విద్యుత్తుశాఖ మంత్రి భట్టి విక్రమార్క.. ఇప్పుడు మక్తల్‌లో నెలకొల్పేది థర్మల్ పవరో, సోలారో, విండ్ ప్లాంటో.. నిర్ణయించలేదని చెప్పడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. మూడు చోట్ల ఒక్కో ప్లాంట్‌కు రూ.10,800 కోట్లు అవసరమని డీపీఆర్ సిద్ధం చేసిన ప్రభుత్వం.. ఇంకా నిర్ణయించలేదని బుకాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
రాష్ట్రంలోని రామగుండం, పాలేరు, మక్తల్‌లో థర్మల్ ప్లాంట్లు పెడతామని క్యాబినెట్ బ్రీఫింగ్లో చెప్పిన ప్రభుత్వం..తాము ప్రశ్నించగానే తత్తరపాటుకు గురవుతున్నదని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. మక్తల్‌లో థర్మల్‌ప్లాంట్ కాదని, వేరేది పెడతామని రెండురోజుల్లోనే మాట మార్చిన చరిత్ర మీది కాదా? అని నిలదీశారు. టెండర్లు పిలువకముందే, నిధులు వెచ్చించకముందే అవినీతి జరిగిందని బీఆర్ఎస్ బద్నాం చేస్తున్నదని భట్టి చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని పేర్కొన్నారు. మరీ మీరు ఆనాడు కాళేశ్వరానికి రూ.84 వేల కోట్లు ఖర్చు కాక ముందే రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని గల్లీగల్లీలో దుష్ప్రచారం చేయలేదా? అని ప్రశ్నించారు. ఆనాడు అడ్డగోలుగా తప్పులు మాట్లాడినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
2,400 మెగావాట్ల కరెంట్ అందుబాటులోకి వస్తున్నదని, అగ్రిమెంట్ చేసుకొని తీసుకోవాలని ఎన్టీపీసీ మూడుసార్లు లేఖ రాసింది, ఎన్టీపీసీ ఎండీ హైదరాబాద్‌కు వచ్చి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి భట్టిని కలిసింది నిజమా? అబద్ధమా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. కేవలం 800 యూనిట్లు అవసరమున్నదని, మిగిలిన 1,600 యూనిట్లు వద్దన్నది వాస్తవం కాదా? అని నిలదీశారు. గ్రీన్ఎనర్జీ పాలసీ తెస్తమని, థర్మల్ పవర్ తగ్గిస్తామని ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా చెప్పలేదా? 2026లోగా థర్మల్ వపర్ ఉత్పత్తిని 40 నుంచి 30 శాతానికి తగ్గిస్తామని శ్వేతపత్రం విడుదలచేయలేదా?’ అని ప్రశ్నించారు. ప్రెస్మీట్లో మాత్రం థర్మల్ కేంద్రాలు పెడతామని చెప్పడం విడ్డూరమని పేర్కొన్నారు.. సీఎం అసెంబ్లీలో చెప్పింది కరెక్టా? మంత్రులు ప్రెస్మీట్లో మాట్లాడింది కరెక్టా? అని నిలదీశారు.
ఒకవైపు థర్మల్ పవర్‌ను తగ్గిస్తామంటూనే మరోవైపు 2,400 మెగావాట్ల ప్లాంట్లు పెడతామని చెప్పడంలోని ఆంతర్యమేంటని నిలదీశారు. కమీషన్ల కోసమే ఈ వ్యవహారం నడుపుతున్నారని ఆరోపించారు. ‘తక్కువ ధరకు 2,400 మెగావాట్లు తీసుకోవాలని ఎన్టీపీపీ చేసిన విజ్ఞప్తిని పెడచెవినపెట్టి, 800 మెగావాట్లే తీసుకున్న ప్రభుత్వం.. మక్తల్, పాల్వంచ, రామగుండంలో 800 మెగావాట్ల చొప్పున ప్లాంట్లు పెట్టడంలో మతలబేంటి? ప్లాంట్‌కు రూ.10,800 కోట్లు ఖర్చవుతుందని జెన్కో డీపీఆర్ రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది నిజం కాదా? ఒక్క మెగావాట్‌కు రూ.13.62 కోట్లు, ఒక యూనిట్ ఉత్పత్తికి రూ.7.7 ఖర్చు అవుతుందని లెక్కతేల్చింది వాస్తవం కాదా?’ అని ప్రశ్నించారు.
ఇది పూర్తయ్యేనాటికి రూ.15వేల కోట్లకు పెరుగుతుందని, మూడు ప్లాంట్లకు కలిపి రూ.45 వేల కోట్ల ఖర్చవుతాయని వివరించారు. కానీ, అప్పు అవసరం లేకుండా, రూపాయి ఖర్చు చేయకుండా మన దగ్గర ఉత్పతి అయినా కరెంట్‌ను తీసుకోకుండా కొత్త ప్లాంట్లు కట్టడమెందుకని నిలదీశారు. ఎన్టీపీసీతో పోల్చితే ఒక్కో యూనిట్‌కు రూ.3 చొప్పున అదనంగా ఎందుకు వెచ్చిస్తున్నారో అర్థంకావడం లేదని పేర్కొన్నారు. ‘800 మెగావాట్లు కరెంట్ అంటే 3 కోట్ల యూనిట్లు. అంటే రోజుకు అదనంగా ప్రజలపై పడే భారం రూ.9 కోట్లు. ఏడాదికి రూ.3,285 కోట్లు. 25 ఏండ్లకు రూ.82 వేల కోట్లు. మీ 30% కమీషన్ల కోసం రాష్ట్ర ప్రజలపై రూ.82 వేల కోట్ల భారం ఎలా వేస్తారు’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల ధన దాహానికి సామాన్యులు బలికావాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
‘కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అత్యంత కీలకమైన విద్యుత్తు విభాగం మొత్తం ఆంధ్రా ఉద్యోగులతో నిండిపోయింది. ఈ ప్రభుత్వాన్ని తెలంగాణ వారు నడుపుతున్నరా? వెనుకనుంచి ఆంధ్రా ప్రభుత్వం నడుపుతున్నదా?’ అని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎంతోమంది విద్యుత్తురంగ నిపుణులు, అనుభవజ్ఞులైన తెలంగాణ బిడ్డలు ఉన్నా, ఏపీకి చెందినవారిని కీలకమైన స్థానాల్లో నియమించడంలో ఆంతర్యమేంటని నిలదీశారు. కరెంట్‌తో సంబంధమేలేని, సింగరేణిలో రిటైరైన ఆంధ్రాకు చెందిన ఉద్యోగి రాజశేఖర్‌రెడ్డిని హైడల్ అండ్ జెన్కో ప్రాజెక్టు డైరెక్టర్‌గా నేరుగా అపాయింట్ చేశారని విమర్శించారు.
నాడు తెలంగాణ ఉద్యమాన్ని అవహేళన చేస్తుంటే, తెలంగాణ విద్యుత్తు జేఏసీ కార్మికులు తరిమికొట్టిన కుమారరాజను ఇప్పుడు విద్యుత్తు ఉద్యోగుల మీద డైరెక్టర్‌గా నియమించారని ధ్వజమెత్తారు. మధ్యప్రదేశ్‌లో మైనింగ్ ఇంజినీరింగ్‌గా పనిచేసిన ఏపీ ప్రాంతానికి చెందిన ఉద్యోగి శివాజీని ఎస్పీడీసీఎల్లో ప్రాజెక్టు అండ్ హెచ్ఆర్డీ డైరెక్టర్‌గా అపాయింట్ చేశారని, ఆయనకు విద్యుత్తు మీద కనీస అవగాహన, సాంకేతిక నైపుణ్యం లేదని విమర్శించారు. తెలంగాణ గడ్డపై పనిచేయని, విద్యుత్తు వ్యవస్థపై ఏమాత్రం అవగాహన లేని మరో ఏపీకి చెందిన వ్యక్తి నర్సింహులును ఎస్పీడీసీఈఎల్ ఆపరేషన్స్ డైరెక్టర్ పోస్టులో పెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రెన్యువబుల్ ఎనర్జీ (రెడ్కో) సీఎండీగా ఏపీకి చెందిన జూనియర్మోస్ట్ అధికారి, డివిజనల్ ఇంజినీర్‌గా ఉన్న వావిలాల అనిలాను అపాయింట్ చేశారని విమర్శించారు. ‘ఈ నియామకాలు విద్యుత్తు ఉద్యోగులు, ఉద్యమకారులను అవమానపరచడం కాదా? తెలంగాణ ద్రోహులను తీసుకొచ్చి తెలంగాణలో కొలువులిస్తారా?’ అని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణలో సమర్థులైన దళిత అధికారులు, చీఫ్ ఇంజినీర్లుగా రిటైరైన దళితబిడ్డలు, అనుభవజ్ఞులు ఉన్నారని, వాళ్లందరినీ పక్కనపెట్టి ఏపీకి చెందిన వారిని నియమించడమంటే తెలంగాణ జాతి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం కాదా? అని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలతో తెలంగాణలో సీనియర్ ఇంజినీర్లు, రిటైర్డ్ సీఈలు, ఎస్ఈలు, విద్యుత్తు ఉద్యోగులందరూ ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు.
ఏపీకి చెందిన వ్యక్తుల అపాయింట్మెంట్ల వెనుక ఎవరున్నరు? ఎవరు చెప్తే పెట్టారు? వారి అపాయింట్మెంట్ తెలంగాణకు ఏవిధంగా దోహదపడుతుంది? నిష్ణాతులా? ఇది ప్రజాపాలనా? తెలంగాణ ద్రోహుల పాలనా? ఏం పాలన ఇది?
– హరీశ్‌రావు
అప్పుల కోసం ఢిల్లీకి వెళ్తే చెప్పులను ఎత్తుకెళ్లే వాళ్లను చూసినట్టు చూస్తున్నారని చెప్తున్న ముఖ్యమంత్రి.. మూడు ప్లాంట్ల నిర్మాణానికి 25% నిధులు రూ.10 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్లు ఎక్కడినుంచి తీసుకొస్తారని హరీశ్‌రావు ప్రశ్నించారు. 30% కమీషన్ రాదనే ఎన్టీపీసీ నుంచి కరెంట్ తీసుకోవడం లేదని ఆరోపించారు. ప్రజల మీద రూ.82 వేల కోట్ల భారం పడుతుందనే ఈ స్కామ్‌ను బీఆర్ఎస్ బయటకు తీసిందని స్పష్టంచేశారు. ‘కాంగ్రెస్ అవినీతిపై ప్రశ్నిస్తే.. బొగ్గులేని చోట బీఆర్ఎస్ ప్లాంట్ కట్టిందని ఆరోపించడం విడ్డూరం. విజయవాడ, రాయలసీమ, కృష్ణపట్నం థర్మల్ పవర్‌స్టేషన్లను ఏ బొగ్గు ఆధారంగా నిర్మించారు?’ అని ప్రశ్నించారు.
ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు వచ్చినప్పుడు జరిగే విపత్తును దృష్టిలో ఉంచుకుని.. అన్ని థర్మల్ ప్లాంట్లు ఒకేచోట ఉంటే విద్యుత్తు సరఫరాకు ఇబ్బందులు తలెత్తుతాయనే దూరదృష్టితో నాడు కరెంట్ ప్లాంట్లను నిర్మించామని తెలిపారు. థర్మల్ ప్లాంట్ల నుంచి వెలువడే ఫ్లైయాష్ వినియోగం లేకపోతే పర్యావరణానికి పెద్ద ముప్పు వాటిల్లుతుందని, సిమెంట్ ఫ్యాక్టరీలకు దీన్ని వాడతారని వివరించారు.
దామరచెర్ల వద్ద దాదాపు 30 సిమెంట్ ఫ్యాక్టరీలు ఉంటే 100% ఫ్లైయాష్‌ను తాము వాడుకుంటామని ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకున్నాయని చెప్పారు. 1,200 ఎకరాల స్థలం, కృష్ణా జలాలు, ఫ్లైయాష్ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని తాము నాడు యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్ నిర్మించామని వివరించారు. నాడు తాము అధికారంలోకి వస్తే యాదాద్రి పవర్ ప్లాంటుకు తాళం వేస్తామన్న వాళ్లే.. నేడు పోటీపడి కొబ్బరికాయలు కొడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఉద్దేశించి ఎద్దేవా చేశారు.
ఆధారాలు సహా కరెంట్ స్కామ్‌ను బట్టబయలు చేయడాన్ని చూసి తట్టుకోలేని మంత్రి భట్టి విక్రమార్క అన్‌ఫిట్ ఫర్ పాలిటిక్స్ అంటూ తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు హరీశ్‌రావు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ‘అవును.. నేను ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు మీలాగా 20 నుంచి 30% కమీషన్లు తీసుకోవడం రాలేదు. దాంట్లో నేను అన్ఫిటే.. మీరు బాగా ఫిట్.. ఫర్పెక్ట్. మీ ఫిట్నెస్ బయటపడ్దది కదా.. ఆర్థిక శాఖ చరిత్రలో కాంట్రాక్టర్లు సెక్రటేరియట్ ఆర్థిక శాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేసిన చరిత్ర ఏనాడైనా ఉన్నదా? మన ఊరు- మనబడి బిల్లుల కోసం కాంట్రాక్టర్లు ఏరోజైనా సచివాలయంలో ఆందోళనకు దిగారా? చిన్నచిన్న గుత్తేదారులు గతంలో ఎప్పుడైనా నిరసనకు ఉపక్రమించారా? చివరకు మాజీ సర్పంచులు ధర్నాలు చేసి అరెస్టవ్వడం చరిత్రలో ఎప్పుడైనా చూశామా? నోరు పారేసుకోవడం సులువు భట్టి గారూ.. రాజకీయాల్లో నోరు జారితే మొదటికే మోసం వస్తది.. సమాధానం ఉంటే చెప్పండి.. లేకుంటే మౌనంగా ఉండండి..’ అంటూ హరీశ్‌రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
విపరీతమైన ఆరోపణలు, ఏసీబీ రైడ్స్‌ను ఎదుర్కొన్న వ్యక్తి, ఏపీకి చెందిన నందకుమార్‌ను అత్యంత కీలకమైన పోస్టు, తెలంగాణ రాష్ర్టానికి హెడ్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్గా ప్రభుత్వం నియమించడంపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ట్రాన్స్ఫర్కో రేటు, పర్మిషన్కో రేటు, పోస్టింగ్కో రేటు, పర్మిషన్ రావాలంటే ఓ రేటు, లంచమిస్తేగాని ఫైల్ కదలదని ఆయన మీద పుంఖాను పుంఖాలుగా వార్తలు వచ్చాయని గుర్తుచేశారు. ఎక్కడినుంచైనా గ్రీన్ ఎనర్జీని తీసుకుని వాడుకునేందుకు వీలుగా గ్రీన్ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ పాలసీ కింద పరిశ్రమల నుంచి ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించగా, ఒక్కో అప్లికేషన్‌కు రూ.25 వేల చొప్పున దాదాపు రూ.600 కోట్లు ఫీజుల రూపంలోనే వచ్చాయని పేర్కొన్నారు.
మొత్తంగా రెండువేల మెగావాట్ల కోసం దరఖాస్తులు రాగా ఒక్క మెగావాట్‌కు కూడా చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ఇప్పటికీ అనుమతివ్వలేదని వెల్లడించారు. ఒక్క మెగావాట్ పర్మిషన్ కోసం తొలుత రూ.20 లక్షలు డిమాండ్ చేశారని, ఇప్పుడు పెద్దలకు ఇవ్వాలని మరో రూ.10 లక్షలు కలిపి మొత్తంగా రూ.30 లక్షల లంచం డిమాండ్ చేస్తున్నారని, మరి ఆ పెద్దలు ఎవరని నిలదీశారు. క్యాప్టివ్ విధానం లేకపోతే ప్రభుత్వం అప్లికేషన్లను ఎందుకు తీసుకున్నదని, ఆరు నెలల నుంచి ఎందుకు పెండింగ్‌లో పెడుతున్నదని ప్రశ్నించారు. సమావేశంలో ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, శంభీర్‌పూర్ రాజు, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠాగోపాల్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు పల్లె రవికుమార్, అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, పార్టీ నేత కిశోర్‌గౌడ్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ విద్యుత్తు వ్యవస్థ అస్తవ్యస్తమైపోతున్నది. అవగాహనలేమి, ఆంధ్ర అధికారుల పెత్తనం, దోపిడీ, అవినీతితో ఆగమాగమైతున్నది. సంస్థలో ఏపీకి చెందిన అధికారులను తక్షణం తొలగించాలి. తెలంగాణ బిడ్డలకు అవకాశమివ్వాలి.
– హరీశ్‌రావు
ముఖ్యమంత్రి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నా రాష్ట్ర ఎన్నికల సంఘం నిద్ర పోతున్నదా? నియమ నిబంధనలను చూసే బాధ్యత లేదా? అని హరీశ్‌రావు మండిపడ్డారు. సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న వేళ ఇరిగేషన్ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేస్తున్నారని, మున్సిపాల్టీల్లో కొబ్బరికాయలు కొడుతున్నందున కోడ్ వర్తించదంటే ఎలా? అని నిలదీశారు. ఏదైనా సరే ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజలను ప్రభావితం చేసేది కోడ్ పరిధిలోకి వస్తుందని వెల్లడించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్లు తదితర పనుల శంకుస్థాపనలన్నీ గ్రామీణ ప్రజలను ప్రభావితం చేసేవేనని పేర్కొన్నారు. రెండేండ్ల నుంచి ఏం చేశారని, ఇప్పుడెందుకు సీఎం తిరగాల్సి వస్తున్నదని ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం వాటిని పరిశీలించాలని, ముఖ్యమంత్రిపై కేసు నమోదు చేసేలా పోలీసులకు డైరెక్షన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్న తరువాతనే ముఖ్యమంత్రి వెళ్లాలని డిమాండ్ చేశారు.