Harish Rao | హైదరాబాద్ : ఈ రాష్ట్రంలో నో ఎల్ఆర్ఎస్.. నో కాంగ్రెస్ అనే పరిస్థితి భవిష్యత్‌లో తప్పకుండా వస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణలో కొత్త మున్సిపాలిటీల కోసం అసెంబ్లీలో బిల్లును కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు.
సీఎం వద్దనే మున్సిపాలిటీ శాఖ ఉంది. ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు అయింది. మున్సిపాలిటీలు ఎన్ని ఏర్పాటు చేశామన్నది ముఖ్యం కాదు.. ఎంత మేరకు అభివృద్ధి చేశాం అన్నది ముఖ్యం. నిధులు ఇస్తున్నారా లేదా..? అనేది ఆలోచించాలి. ఫాగింగ్‌కు కూడా డబ్బులు లేని పరిస్థితి. బీఆర్ఎస్ హయాంలో నెల నెల పట్టణ ప్రగతి కింద మున్సిపాలిటీలకు డబ్బులు ఇచ్చాం. ఈ ప్రభుత్వం వచ్చాక నిధులు ఇవ్వలేదు. ఎన్నికలు జరగలేదని ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఇవ్వడం లేదు అని హరీశ్‌రావు తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల నుంచి డబ్బులు వసూళ్లు చేస్తుంది.. రక్తమాంసాలు పీలుస్తుంది.. కాంగ్రెస్ వస్తే ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తాం.. నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నారు. ఇవాళ్నేమో బరాబర్ పైసలు కట్టాలని వసూలు చేస్తున్నారు. మరి అదే ప్రజలు నో ఎల్ఆర్ఎస్ నో కాంగ్రెస్ అనే పరిస్థితి వస్తుంది. ఎల్ఆర్ఎస్ జీవో తెచ్చాం.. ఎల్ఆర్ఎస్ ద్వారా వచ్చిన డబ్బుల్లో కొంత మేర ఆ మున్సిపాలిటీ అభివృద్ధికి కేటాయించడం జరుగుతుందని జీవోలో చెప్పాం. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వసూలు చేసిన ఎల్ఆర్ఎస్ డబ్బులను మున్సిపాలిటీలకు ఎప్పటి వరకు అందజేస్తారో చెప్పాలి. వచ్చిన డబ్బు ఎంతనో చెప్పాలి అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
పట్టణ ప్రగతి కింద నిధులు ఇవ్వలేదు.. ఫైనాన్స్ కమిషన్ నుంచి డబ్బులు రావడం లేదు. ఎల్ఆర్ఎస్ నిధుల నుంచి డబ్బులు ఇవ్వడం లేదు. రాష్ట్ర నుంచి నయా పైసా లేదు. మరి ఎలా కొనసాగాలి మున్సిపాలిటీలు. ప్రజలు కట్టిన డబ్బును ఎప్పటిలోగా చెల్లిస్తారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే డబ్బులను కూడా ఇవ్వడం లేదు. మరి మున్సిపాలిటీలు ఎలా నడవాలి..? పరిస్థితి ఏంటి అనేది ఆలోచించాలి. మున్సిపల్ కమిషనర్లు, ఇంజినీర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు లేరు. కొత్త మున్సిపాలిటీలకు అనుగుణంగా పోస్టులు మంజూరు చేయండి. ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోరుతున్నాం అని హరీశ్‌రావు పేర్కొన్నారు. కేసీఆర్ పటాన్చెరు, సంగారెడ్డి, జహీరాబాద్‌కు ఎస్డీఎఫ్ కింద రూ. 50 కోట్లు మంజూరు చేశారు. ఆ డబ్బులన్నీ మీరు రద్దు చేశారు. ఇదేం పద్ధతి అని హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు.