గ్రామ పంచాయతీలు కళ తప్పినయ్. బతుకమ్మ, దసరా పండుగలకు బుగ్గలు వేసేందుకు కూడా పైసల్లేవ్. పంచాయతీల్లో డబ్బుల్లేక కార్యదర్శులు అప్పుల పాలైండ్రు. చిన్న కాంట్రాక్టర్లు బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నరు. ఎవరిని కదిలించినా కండ్లల్లో నీళ్లు పెట్టుకుంటున్నరు.
– హరీశ్
సిద్దిపేట, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): హైడ్రా, మూసీ సుందరీకరణ పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి తొందరపాటు నిర్ణయాలు, చర్యల వల్ల హైదరాబాద్ కళ తప్పిందని, రియల్ ఎస్టేట్ కుదేలైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. సీఎం భాష కట్టు తప్పిందని, పరిపాలన గాడి తప్పిందని, అవినీతి అదుపు తప్పిందని, మొత్తంగా తెలంగాణ బతుకు బండి పట్టాలు తప్పిందని వాపోయారు.
సిద్దిపేటలోని తన క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని చెప్పారు. ఈ ప్రభుత్వం చిరుద్యోగుల ఉసురు పోసుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పంచాయతీల్లో డబ్బుల్లేక కార్యదర్శులు అప్పుల పాలవుతున్నారని, ఒక్కొక్కరు లక్ష నుంచి మూడు లక్షల దాకా అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
‘గ్రామాల్లో బుగ్గలు వే యకపోతే గ్రామస్థులు తిడుతున్నరు.. బుగ్గలు వేస్తే కరెంటు బిల్లులు ఎక్కువ వస్తయని ఇంట్ల కుటుంబ సభ్యులు తిడుతున్నరు’ అంటూ ఆయా గ్రామాల్లో పరిస్థితిని వివరించారు. చిన్న కాంట్రాక్టర్లు బిల్లులు రాక కష్టాలు పడుతున్నారని, వారికి వెంటనే ప్రాధాన్యత క్రమంలో బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ దవాఖానల్లో మందులు కూడా లేవని మండిపడ్డారు.
ఒకటో తారీఖునే వేతనాలు ఇస్తున్నామని ప్రభుత్వం డబ్బా కొట్టుకుంటున్నదని, రాష్ట్రంలో సకాలంలో జీతాలు రాక అనేక మండి ఇబ్బంది పడుతున్నారని హరీశ్ తెలిపారు. పోలీస్ సిబ్బందికి టీఏ, సరెండర్ లీవుల డబ్బులు 10 నెలల నుంచి పెండింగ్‌లో ఉన్నాయని, బయటకు చెప్పుకోలేక వారు కుమిలిపోతున్నారని చెప్పారు. ప్రతి నెలా హోం గార్డుల వేతనాలు ఆలస్యంగా ఇస్తున్నారని, మున్సిపాలిటీ ఆర్పీలకు నాలుగు నెలల జీతాలు పెండింగ్‌లో ఉన్నాయని, గ్రామ సంఘాల్లో పని చేసే వీఓలకు జీతాలు లేవని, మహిళా సంఘాల వీఓలు, ఆర్పీలకు కూడా ఈ పండుగకు జీతాలు అందలేదని వాపోయారు.
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ హాస్టళ్లలో పనిచేసే వంటవాళ్లు, కామాటీలు కూడా వేతనాలు రాక ఏడు నెలలుగా అవస్థలు పడుతున్నారని, మధ్యాహ్న భోజన కార్మికులకు మార్చి నుంచి వేతనాలు, వంట సరుకుల డబ్బులు రావడం లేదని, రెండో ఏఎన్ఎంలకు కూడా జీతాల్లేవని, గాంధీ, ఉస్మానియా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బందికి మూడు నెలల నుంచి వేతనాలు అందడం లేదని చెప్పారు. పండుగ పూట కూడా ఆసరా పెన్షన్లు ఇవ్వరా? అని ప్రశ్నించారు. నాలుగు వేలు ఇస్తామని చెప్పి రెండు వేలే ఇస్తున్నారని, అవీ రెండు నెలలు బాకీ పడ్డారని విమర్శించారు. ‘మూసీ సుందరీకరణకు లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టే మీరు.. రెండు వేల పెన్షన్ ఎందుకివ్వడం లేదు? కోతలు పెట్టేది పేదల మీదేనా’ అని ప్రశ్నించారు.
యువకులు, విద్యార్థులు గ్రామాలకు వచ్చి నాయనమ్మకు, అమ్మమ్మకు, తాతకు కాళ్లు మొక్కి తమ భవిష్యత్తు కోసం కాంగ్రెస్‌కు కోసం ఓటు వేయాలని ఆరోజు అడిగిండ్రు.. ఇవ్వాళ అదే యువతకు, విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలపై మీ గ్రామాల్లో చర్చ పెట్టండి.. మీ కుటుంబ సభ్యులకు వివరించి చెప్పండి.
-హరీశ్
కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలపై గ్రామాల్లో చర్చ పెట్టాలని దసరాకు ఇండ్లకు వచ్చే యువత, విద్యార్థులకు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. నిరుద్యోగ యువతకు మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి రేవంత్‌రెడ్డి మోసం చేసిండని, కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినవి తప్ప, కాంగ్రెస్ సర్కార్ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని, దీనిపై గ్రామాల్లో చర్చ పెట్టాలని కోరారు. నాలుగు వేల నిరుద్యోగ భృతి, రైతుబంధు వస్తున్నదా? అడగాలని, వానకాలం పంట చేతికొచ్చినా పెట్టుబడి సాయం మాత్రం చేతికి రాలేదని, రూ.15 వేలు ఇస్తామన్న రైతు భరోసా ఏమైందని, వీటన్నింటిపైనా యువత, విద్యార్థులు ఎండగట్టాలని విజ్ఞప్తిచేశారు. సమావేశంలో నాయకులు రాజనర్సు, శ్రీకాంత్‌రెడ్డి, ఎల్లారెడ్డి, భూపేశ్, సోంరెడ్డి, యాదయ్య పాల్గొన్నారు.
‘కాంగ్రెస్ గ్యారెంటీ అంటే గోల్డ్డెన్ గ్యారెంటీ అని రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నాడు. అది గోల్డ్డెన్ గ్యారెంటీయా? గోల్మాల్ గ్యారెంటీయా?’ అని హరీశ్ ఎద్దేవాచేశారు. ‘గోల్డ్డెన్ గ్యారెంటీ అంటే వంద రోజుల్లో 4వేల పెన్షన్, రూ.15 వేల రైతుబంధు, రుణమాఫీ, నిరుద్యోగ భృతి ఇవ్వాలి కదా? మీరిచ్చిన హామీలు పూర్తి చేయాలి కదా? ఇవేవీ పూర్తి చేయకుంటే అది గోల్డెన్ గ్యారెంటీ ఎట్లయితది?’ అని ప్రశ్నించారు.
ఇవన్నీ గోబెల్స్.. గోల్మాల్ గ్యారెంటీలని దుయ్యబట్టారు. కాంగ్రెస్ వచ్చాక బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయని, నిత్యావసరాల ధరలు బాగా పెరిగాయన్నారు. రియల్ ఎస్టేట్ రంగం ఆగమైపోయి లక్షల మంది రోడ్డు మీద పడ్డారని చెప్పారు. కాంగ్రెస్ మోస పూరిత వైఖరి, ఆ పార్టీ చేసిన మోసాలు, బాండ్ పేపర్ల మీద రాసిచ్చి, మాట తప్పిన తీరుపై గ్రామాల్లో యువత, విద్యార్థులు చర్చించాలని పిలుపునిచ్చారు.